గ్లోబల్ అయ్యప్ప సంగమం: ఆడిట్ నివేదికలు నిరాధారం
x

గ్లోబల్ అయ్యప్ప సంగమం: ఆడిట్ నివేదికలు నిరాధారం

స్పష్టం చేసిన ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ..


Click the Play button to hear this message in audio format

గ్లోబల్ అయ్యప్ప సంగమం నిర్వహణకు సంబంధించిన ఆడిట్ నివేదికలపై మీడియాలో వచ్చిన వార్తలను ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ఖండించింది. ఖర్చులు సముచితంగానే జరిగాయని, ముఖ్యమంత్రికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించారన్న ఆరోపణలు వాస్తవానికి విరుద్ధమని బోర్డు స్పష్టం చేసింది.

శబరిమల స్వామి అయ్యప్ప ఆలయంతో పాటు వందలాది దేవాలయాలను నిర్వహించే టీడీబీ ప్లాటినం జూబ్లీ వేడుకలలో భాగంగా 2025 సెప్టెంబర్ 20న పంబాలో గ్లోబల్ అయ్యప్ప సంగమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆడిట్ నివేదికలపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బోర్డు ఆరోపించింది. “ఆడిట్ నివేదికలపై వస్తున్న వార్తలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు ప్రచారంలోకి వస్తుండడం బాధాకరం” అని ప్రకటనలో పేర్కొంది.

సంగమానికి హాజరైన ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోసం ప్రత్యేకంగా మంచం కొనుగోలు చేసినట్టు దేవస్వం ఆడిట్ నివేదికలో గానీ, హైకోర్టుకు సమర్పించిన ప్రత్యేక కమిషనర్ నివేదికలో గానీ ఎలాంటి ప్రస్తావన లేదని టీడీబీ తెలిపింది. నవంబర్ 4, 2025న సమర్పించిన అంచనాలో ఇప్పటికే ఉన్న కార్యాలయ సముదాయం, అతిథి గృహాల కోసం ఫర్నిచర్ మరియు ఇతర వస్తువుల కొనుగోలుకు రూ.3,83,439 కేటాయించినట్లు వివరించింది. అతిథి గృహం కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నీ దేవస్వం ఆస్తిగానే ఉంటాయని, ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ఖర్చు చేశారన్న వార్తలు తప్పుడు అర్థాలుగా పేర్కొంది.

పంబ గెస్ట్ హౌస్‌లో జరిగిన పునరుద్ధరణ పనులను కూడా కొన్ని మీడియా సంస్థలు ముఖ్యమంత్రి కోసం ప్రత్యేక ఏర్పాట్లుగా చిత్రీకరించడం తప్పుదారి పట్టించే ప్రయత్నమని బోర్డు విమర్శించింది. కేంద్ర మంత్రులు, ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు కూడా అదే అతిథి గృహంలో బస చేస్తారని గుర్తుచేసింది.

కార్యక్రమంలోని సంగీత ప్రదర్శన విషయంలో మొదట “నందగోవిందం భజనలు” బృందాన్ని సంప్రదించినప్పటికీ వారు ముందస్తు నిబద్ధతల కారణంగా నిరాకరించారని, అనంతరం సంగీత దర్శకుడు ఇషాన్ దేవ్‌ను నియమించి 25 మందికి పైగా కళాకారులు, 10 మందికి పైగా సాంకేతిక నిపుణులతో ప్రదర్శన నిర్వహించామని తెలిపింది. నందగోవిందం భజనలకు చెల్లింపుల ప్రస్తావన ఆడిట్ నివేదికలో కనిపించడాన్ని ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ చేసిన అనుకోని పొరపాటుగా వివరించింది. ఆ చెల్లింపు ఇషాన్ దేవ్ ఖాతాలో జమైందని స్పష్టం చేసింది.

సంగమం నిర్వహణ బాధ్యతలను కేరళ అకాడమీ ఫర్ స్కిల్స్ డెవలప్‌మెంట్‌కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ — ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్‌స్ట్రక్షన్ (IIIC) కు అప్పగించినట్లు తెలిపింది. 2025–26 బడ్జెట్‌లో “రిలిజియస్ కన్వెన్షన్ & డిస్కోర్స్” శీర్షిక కింద కేటాయించిన రూ.5 కోట్లను ధనలక్ష్మి బ్యాంకులో ప్రత్యేక ఖాతాలో జమ చేసి, అందులో నుంచి రూ.3 కోట్లు అడ్వాన్స్‌గా ఐఐఐసీకి చెల్లించినట్లు వివరించింది. అదనంగా వసతి కోసం హోటళ్లకు రూ.12,76,440, జీఎస్టీ కింద రూ.15,25,424 చెల్లించినట్లు పేర్కొంది.

ఇప్పటివరకు స్పాన్సర్‌షిప్ రూపంలో రూ.3 కోట్లు అందాయని, అందులో ధనలక్ష్మి బ్యాంక్ నుంచి రూ.2 కోట్లు, కేరళ బ్యాంక్ నుంచి రూ.1 కోటి వచ్చినట్లు తెలిపింది. అదానీ గ్రూప్ రూ.1 కోటి ఆఫర్ చేసిందని కూడా వెల్లడించింది. దేవస్వం నిధుల నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి జమ చేయలేదన్న ఆరోపణలను ఖండించింది.

సంగమం ముగింపు రోజున ఆహార వ్యయాలు అధికంగా చూపించారన్న ఆరోపణలను కూడా బోర్డు తోసిపుచ్చింది. ఆహ్వానితులతో పాటు శబరిమల భక్తులు, పంబ ప్రాంత దినసరి కూలీలు, డాలీ కార్మికులకు కూడా ఆహారం అందించడంతో అంచనాల కంటే రెట్టింపు మందికి భోజనం వడ్డించాల్సి వచ్చిందని వివరించింది.

హైకోర్టు నిర్దేశించిన గడువులోపే ఆడిట్ నివేదిక సమర్పించామని, ధృవీకరణ అనంతరం కొన్ని వ్యత్యాసాలను సరిదిద్దుతామని టీడీబీ తెలిపింది. ఫిబ్రవరి 17న జరిగే బోర్డు సమావేశంలో ఈ అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించింది. గ్లోబల్ అయ్యప్ప సంగమం వ్యర్థం కానిదని, శబరిమల వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడమే లక్ష్యమని పేర్కొంది.

ఇదిలా ఉండగా, గ్లోబల్ అయ్యప్ప సంగమం ఆడిట్ నివేదికలో అనేక సమస్యలు, తీవ్రమైన అసమానతలు ఉన్నాయని కేరళ హైకోర్టు రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించింది. ఈ అసమానతలపై టీడీబీతో పాటు రాష్ట్ర ఆడిట్ విభాగం నుంచి వివరణలు కోరిన విషయం తెలిసిందే.

Read More
Next Story