
ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
సూసైడ్‌కి టాస్క్ బెస్డ్ ఆన్‌లైన్ గేమే కారణమా? కుటుంబసమస్యలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య(Suicide) దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. 16, 14, 12 ఏళ్ల వయస్సున్న ముగ్గురు అమ్మాయిలు తాము ఉంటున్న అపార్ట్‌మెంట్ తొమ్మిదో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు.
ఘజియాబాద్(Ghaziabad)లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ ముగ్గురు అమ్మాయిలు వాడిన మొబైల్ ఫోన్‌ల మీదున్న IMEI నంబర్‌ల ఆధారంగా డేటా రికవర్ చేస్తున్నారు. టాస్క్ బెస్డ్ ఆన్‌లైన్ గేమ్‌తోనే ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇంకేమైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. దర్యాప్తులో భాగంగా బాలికల తండ్రి చేతన్ కుమార్, ఆయన భార్యను పోలీసులు సుమారు రెండు గంటల పాటు ప్రశ్నించారు.
ప్రస్తుతానికి ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు..అమ్మాయిల గదిని పరిశీలించారు. అక్కడ ఓ డైరీ పోలీసులకు దొరికింవది. అందులో కొరియన్ సంస్కృతిపై తమకున్న ఆసక్తిని రాశారు. కుటుంబ సభ్యుల మందలించిన విషయం కూడా అందులో రాసి ఉంది.
‘డేటా రికవరీతో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం’
‘‘తండ్రి చేతన్ కుమార్ పెద్ద కుమార్తెకు మూడు నెలల క్రితం, రెండో కుమార్తెకు 15 రోజుల క్రితం మొబైల్ ఫోన్ కొనిచ్చాడు. వారు రోజంతా ఫోన్లు చూస్తూ మిగతా ప్రపంచాన్ని మరిచిపోయారు. దీంతో చేతన్ వారి నుంచి ఫోన్లను లాగేసుకుని అమ్మేశాడు. వాటిని కొన్న వ్యక్తుల నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకుని డేటా రికవరీ చేస్తున్నాం’’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిమిష్ పాటిల్ చెప్పారు.
‘లోతుగా విచారిస్తున్నాం..’
‘‘ఇప్పటివరకు కొరియన్ టాస్క్ బెస్డ్ యాప్‌ల వినియోగంపై స్పష్టమైన ఆధారాలు లేదు. చేతన్ కుమార్ కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఆస్తి లావాదేవీలు, అప్పులేమైనా ఉన్నాయా? అని కూడా విచారిస్తున్నాం. అవసరమైతే కుటుంబ సభ్యులను మళ్లీ ప్రశ్నిస్తాం.’’ అని పాటిల్ తెలిపారు.
‘విదేశీయులతో మాట్లాడేవారు..’
చేతన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..‘‘ మా కూతుర్లు కొరియన్ సంస్కృతి ప్రభావంతో అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేవారు. తమ పేర్లను కొరియన్ పేర్లుగా మార్చుకుని విదేశీ స్నేహితులతో ఆన్‌లైన్‌లో మాట్లాడేవారు. ఇటువంటి గేమింగ్ యాప్‌లపై నియంత్రణ అవసరం.’’ అని ప్రభుత్వాన్ని కోరారు.
పోస్టుమార్టం రిపోర్టులో ఏముంది?
‘‘బాలికల తలలకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కటెముకలు విరిగాయి. అంతర్గత అవయవాలు కూడా దెబ్బతిన్నడంతో చనిపోయారు’’ అని పోస్టుమార్టం నివేదికలో ఉంది. ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

