అమ్మకానికి అలుగు..కోటి రూపాయల బేరం..సీన్ కట్ చేస్తే జైలు ఊచలు
x

అమ్మకానికి అలుగు..కోటి రూపాయల బేరం..సీన్ కట్ చేస్తే జైలు ఊచలు

గుట్టుచప్పుడు కాకుండా అలుగు అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ఓ ముఠాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.


అంతర్జాతీయ మార్కెట్‌లో కోట్లాది రూపాయల విలువ చేసే, అత్యంత అరుదైన వన్యప్రాణి 'అలుగు' (Pangolin) అక్రమ రవాణా ముఠా ఆటను నెల్లూరు జిల్లా అధికారులు కట్టడి చేశారు. నెల్లూరు జిల్లా రాపూరు అటవీ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ దందాను డి.ఆర్.ఐ (DRI) , అటవీశాఖ అధికారులు కలిసి సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడిలో ఈ గుట్టును బట్టబయలు చేశారు.

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఆరుగురు ముఠా

నెల్లూరు జిల్లా పరిధిలోని రాపూరు - తెగచర్ల అటవీ ప్రాంతంలో ఒక అలుగును పట్టుకుని, దానిని భారీ ధరకు విక్రయించేందుకు ఓ ముఠా బేరసారాలు సాగిస్తున్నట్లు అధికారులకు పక్కా సమాచారం అందింది. దీనిపై నిఘా పెట్టిన అటవీశాఖ అధికారులు ఆరుగురు సభ్యుల ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు, వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న అలుగును క్షేమంగా రక్షించారు.

ఎందుకింత డిమాండ్?

అలుగు అనేది దట్టమైన అడవుల్లో మాత్రమే కనిపించే ఒక అరుదైన క్షీరద జంతువు. దీని చర్మంపై ఉండే పొలుసులు (Scales) చైనా వంటి దేశాల్లో సంప్రదాయ మందుల తయారీలో వాడతారనే ప్రచారం ఉంది. ఈ కారణంగా అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్‌లో ఒక అలుగు విలువ సుమారు రూ. కోటి వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భారీ ధర వెనుక ఉన్న ఆశే వేటగాళ్లను అడవుల వైపు నడిపిస్తోంది.

న్యాయస్థానం ముందుకు నిందితులు

అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న అలుగును అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అలుగు ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి, దానిని సురక్షితమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి (Rescue Center) తరలిస్తామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం వీటిని వేటాడటం లేదా విక్రయించడం తీవ్రమైన నేరమని, నిబంధనలకు విరుద్ధంగా, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అలాంటి నేరస్తులకు జైలు శిక్ష తప్పదని వారు హెచ్చరించారు.

Read More
Next Story