కన్నడ మూలం, తెలుగు హృదయం...కర్నూలు కల్కూరకి తెలుగు ‘కళారత్న’
x

కన్నడ మూలం, తెలుగు హృదయం...కర్నూలు కల్కూరకి తెలుగు ‘కళారత్న’

కర్నాటకలో పుట్టి, కర్నూలులో పెరిగి విద్యాభ్యాసం చేసి, తెలుగు అధికార భాష కోసం పోరాడిన కల్కూరకు ఇది అసలైన గుర్తింపు...


విలువలే శ్వాసగా, అక్షరమే ఆయుధంగా సాగుతున్న ఒక అరుదైన సాహితీ ప్రస్థానానికి సముచిత గౌరవం దక్కింది. నిబద్ధత గల గాంధేయవాది, బహుభాషా కోవిదుడు కురాడి చంద్రశేఖర కల్కూర (కేసీ కల్కూర)ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ’కళారత్న‘ (హంస) పురస్కారంతో సత్కరించింది. ఉగాది పర్వదినం వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న కల్కూర .. 86 ఏళ్ల వయసులోనూ కునటపడని దీక్షతో అటు సాహిత్యం, ఇటు సామాజిక సేవలో నిమగ్నమై నవతరానికి స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు. హోటల్ కార్మికుడి నుంచి హంస పురస్కారం వరకు సాగిన ఆయన జీవితం, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని మరోసారి నిరూపించింది. యువతకు మార్గదర్శకంగా నిలుస్తోంది.

హోటల్ కార్మికుడి నుంచి హంస పురస్కారం వరకు సాగిన ప్రస్థానం
కర్ణాటకలోని ఉడిపి జిల్లా కురాడిలో 1940లో జన్మించిన కేసీ కల్కూర జీవితం ఒక అద్భుతమైన స్ఫూర్తి పాఠం. ఉపాధి వేటలో యువకునిగా కర్నూలుకు చేరుకుని.. ఒక హోటల్‌లో సాధారణ కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన, తన కష్టార్జితంతో మూడు హోటళ్లకు యజమానిగా ఎదిగారు. చదువుపై మక్కువతో బీఎల్ పూర్తి చేసి న్యాయవాదిగా పనిచేస్తూనే, భాషా సరిహద్దులను చెరిపివేసి తెలుగు సంస్కృతిని, సాహిత్యాన్ని తన ఊపిరిగా మార్చుకున్నారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ’గాడిచర్ల ఫౌండేషన్‘ ద్వారా గ్రంథాలయ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నడిపించారు. తెలుగు భాషా వికాస ఉద్యమం, జాతీయ సాహితీ సంస్థ ద్వారా గత పాతికేళ్లుగా వందలాది మంది కవులను, రచయితలను వెలుగులోకి తెస్తూ మాతృభాష పరిరక్షణకు ఆయన చేసిన కృషి అనితరసాధ్యం.
సేవా తత్పరత .. నడిచే నిఘంటువుగా కళారత్న గౌరవం
కల్కూర గారి సేవలు కేవలం అక్షరానికే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతలోనూ ప్రదర్శితమయ్యాయి. తన తల్లి స్మారకార్థం పంచలింగాల గ్రామంలో రూ. 50 లక్షల విలువైన భూమిని సామూహిక ఎత్తిపోతల పథకానికి విరాళంగా ఇచ్చి, 1200 ఎకరాలకు సాగునీరు అందేలా చేసి తన ఉదారతను చాటుకున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో అపారమైన ప్రవేశం ఉండటంతో సాహిత్యాభిమానులు ఆయనను నడిచే నిఘంటువు గా కొనియాడతారు. గద్వాల సంస్థాన చరిత్రపై ఆయన చేసిన విశేష పరిశోధనలు నేటి తరానికి ఎంతో కీలకం. ఉడిపి శ్రీకృష్ణ మఠం, తెలుగు విశ్వవిద్యాలయం వంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్న ఆయనను, నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'కళారత్న' పురస్కారంతో సత్కరించడం ద్వారా ఒక నిబద్ధత గల గాంధేయవాదికి, అక్షర తపస్వికి సరైన గౌరవం దక్కింది.
ఉగాది వేళ కళాకారులకు ఘన సన్మానం
తెలుగు రాష్ట్ర రాజధానిలో ఉగాది పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మికతతో పాటు అక్షరానికి, కళకు అరుదైన గౌరవం దక్కింది. మన సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న మహనీయులను కూటమి ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ వేడుకల్లో పాల్గొని, వివిధ రంగాల్లో లబ్దప్రతిష్టులైన కళాకారులకు పురస్కారాలను అందజేశారు. పండుగ పూట కళాకారుల ప్రతిభను గుర్తించి గౌరవించడం ద్వారా తెలుగు జాతి అస్తిత్వాన్ని చాటిచెప్పినట్లయింది.
కళారత్న, ఉగాది పురస్కారాల ప్రదానం.. హంస జ్ఞాపికల సత్కారం
సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటి వివిధ కళా రంగాల్లో నిష్ణాతులైన వారికి ఈ వేడుకల్లో సముచిత స్థానం లభించింది. మొత్తం 38 మంది ప్రముఖులకు ప్రతిష్టాత్మక ఉగాది కళారత్న పురస్కారాలను, మరో 122 మంది ప్రతిభావంతులకు ఉగాది పురస్కారాలను ముఖ్యమంత్రి అందజేశారు. పురస్కార గ్రహీతలకు పవిత్రమైన హంస జ్ఞాపికలను బహూకరించి, శాలువాలతో ముఖ్యమంత్రి వారిని ఆత్మీయంగా సత్కరించారు. కళాకారులను ప్రోత్సహించడం అంటే మన మూలాలను, మన సంస్కృతిని కాపాడుకోవడమేనని ఈ సందర్భంగా సీఎం పునరుద్ఘాటించారు.
కళాకారుల హర్షం.. పెరిగిన బాధ్యత
రాష్ట్ర ప్రభుత్వం తమ దశాబ్దాల కృషితో కూడిన ప్రతిభను గుర్తించి, సాక్షాత్తూ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారాలు అందించడం పట్ల కళాకారులు అమితానందం వ్యక్తం చేశారు. పండుగ పూట దక్కిన ఈ గౌరవం తమ జీవితంలో మరుపురాని ఘట్టమని, ఈ పురస్కారం తమపై బాధ్యతను మరింత పెంచిందని వారు పేర్కొన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని దశదిశలా చాటేందుకు తమ వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు ఆనందం వ్యక్తం చేశారు.
Read More
Next Story