
యుద్ధం ప్రభావం: కర్ణాటక ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ
క్యాటరింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోన్న వంటగ్యాస్ .. మిర్చి రైతులకు కష్టాలు..బియ్యం ఎగుమతులకు ఆటంకం
ఇజ్రాయిల్-అమెరికా, ఇరాన్ మధ్క కొనసాగుతున్న యుద్ధ ప్రభావం కర్ణాటక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడింది. ముఖ్యంగా వంటగ్యాస్ కొరత కారణంగా పెళ్లిళ్లు, కేటరింగ్ వ్యాపారం, ఎగుమతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితి సామాన్యుల నుంచి వ్యాపార వేత్తల వరకు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.
గ్యాస్ కొరతతో పెళ్లిళ్లు వాయిదా..
కర్ణాటకలో జనవరి నుంచి జూలై వరకు పెళ్లిళ్లకు పీక్ సీజన్. అయితే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా అనేక పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 15వేల పెళ్లి మండపాలు ఉండగా, బెంగళూరులోనే వెయ్యికి పైగా ఉన్నాయి. గ్యాస్ సరఫరా లేకపోవడంతో కొన్ని మండపాలు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల వంట కోసం చెక్క పొయ్యిలు లేదా ఎలక్ట్రిక్ స్టవ్‌లను ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో అతిథులకు వంట చేయడం కష్టంగా మారింది.
కేటరింగ్ రంగం కుదేలు..
వంటగ్యాస్ కొరత కేటరింగ్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒక పెళ్లి విందు కోసం 500 మంది అతిథులు ఉంటే కనీసం 8 నుంచి 12 గ్యాస్ సిలిండర్లు అవసరం. 1,000 మందికి పైగా హాజరయితే సుమారుగా 20 సిలిండర్ల వరకు అవసరం. గ్యాస్ ధరలు పెరగడంతో కేటరింగ్ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. దీంతో కేటరింగ్ కాంట్రాక్టర్లు తాము వడ్డించే ప్లేట్ ధరను పెంచుతున్నారు. పెళ్లి నిర్వాహకులు మెనూను మార్చి తక్కువ ఇంధనంతో తయారయ్యే వంటకాలను ఎంచుకుంటున్నారు.
గ్యాస్ సరఫరాకు అంతరాయం..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా చమురు, సహజ వాయువు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా సముద్ర మార్గాన్ని కూడా మార్చాలి వచ్చింది. ప్రస్తుతం నౌకలు ఇప్పుడు ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం ద్వారా ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో రవాణా సమయం 15 నుంచి 20 రోజులు పెరిగింది. షిప్పింగ్ ఖర్చులు 40 నుంచి 60 శాతం వరకు పెరిగాయి.
ఐటీ రంగంపై మిశ్రమ ప్రభావం..
కర్ణాటక ఆర్థిక వ్యవస్థలో ఐటీ రంగం కీలకం. ఏటా సుమారు రూ.3 లక్షల కోట్ల విలువైన ఐటీ సేవలు, ఉత్పత్తులు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ వంటి దేశాలకు ఎగుమతి అవుతాయి. అయితే నిపుణుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే ఐటీ రంగంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. మరికొందరి అభిప్రాయం ప్రకారం ఎక్కువ భాగం సాఫ్ట్‌వేర్ సేవలు ఆన్‌లైన్ ద్వారా నడుస్తున్నందున తక్షణ ప్రభావం తక్కువగా ఉంటుందని అంటున్నారు.
మిర్చి రైతులకు కష్టాలు..
ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉత్పత్తి అయ్యే బ్యాడగి మిర్చికి పశ్చిమాసియాలో భారీ డిమాండ్ ఉంది. సాధారణంగా ప్రతి నెల 1,500 టన్నులకుపైగా మిర్చి ఎగుమతి అవుతుంది. కానీ యుద్ధం కారణంగా హాస్పిటాలిటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మందగించడంతో డిమాండ్ తగ్గింది. ఎగుమతుల్లో ఆలస్యం రావడంతో స్థానిక మార్కెట్లలో నిల్వలు పెరిగి రైతులకు నష్టం కలుగుతోంది.
బియ్యం ఎగుమతులకు ఆటంకం..
సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ, ఇరాక్ దేశాలు కర్ణాటక నుంచి సోనా మసూరి బియ్యాన్ని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటాయి. అయితే యుద్ధం కారణంగా చెల్లింపుల సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో ఎగుమతులు తగ్గిపోయాయి. కొన్ని రైస్ మిల్లుల నుంచి రోజుకు 50 టన్నుల వరకు ఎగుమతి అయ్యే బియ్యం ఇప్పుడు తగ్గిపోయింది. దీంతో రైస్ మిల్ పరిశ్రమ కూడా సంక్షోభంలో పడుతోంది.
నిమ్మకాయ ఎగుమతులపై ప్రభావం..
ఎండిన నిమ్మకాయలకు పశ్చిమాసియాలో మంచి డిమాండ్ ఉంది. కానీ వాటిని రవాణా చేయడానికి అవసరమైన కోల్డ్ స్టోరేజ్ కంటైనర్ల అద్దె భారీగా పెరిగింది. ముందు ఒక కంటైనర్ రవాణా ఖర్చు రూ.80వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉండేది. ఇప్పుడు అది రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెరిగింది. దీంతో ఎగుమతిదారుల లాభాలు తగ్గిపోయాయి.
సంక్షోభంలో అనేక రంగాలు..
గ్యాస్ కొరత, రవాణా ఖర్చులు పెరగడం, ఎగుమతుల్లో ఆలస్యం వంటి కారణాలతో కర్ణాటకలో పెళ్లి రంగం నుంచి వ్యవసాయం వరకు అనేక రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. యుద్ధ పరిస్థితి కొనసాగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరింత తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

