చెత్త నుంచి సంపద.. ఏఐతో సుపరిపాలన
x

చెత్త నుంచి సంపద.. ఏఐతో సుపరిపాలన

గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31 నాటికి చెత్తను సేకరించే బాధ్యత ప్రభుత్వానిది అని వినుకొండలో సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ఆంధ్రప్రదేశ్‌ను పరిశుభ్రతలో అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పలనాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న నిర్ణయాలను ప్రజలకు వివరించారు.


మార్చి నాటికి వంద శాతం లక్ష్యం

స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల సేకరణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్వచ్ఛ రథాన్ని ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటా చెత్త సేకరించేందుకు ఉద్దేశించిన పుష్ కార్ట్‌లు, ఈ-ఆటోలను ఆయన పరిశీలించి, వ్యర్థాల నిర్వహణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 2026 మార్చి నాటికి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం డోర్-టు-డోర్ చెత్త సేకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలో ఇప్పటికే 4.14 లక్షల కుటుంబాలు ఇంట్లోనే ఎరువు తయారు చేస్తూ టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాయని, దీనిని అందరూ అలవాటు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను రాజమండ్రి సహా మరో 5 ప్రాంతాల్లో త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.


మహిళా శక్తికి అండ.. రూ. 100 కోట్ల చెక్కు పంపిణీ

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, 561 స్వయం సహాయ సంఘాలకు రూ. 100.14 కోట్ల భారీ చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. వినుకొండను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే ఆలోచన ఉందని, లక్ష మంది మహిళలను ఎంఎస్‌ఎంఈ (MSME)లుగా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు.


టెక్నాలజీతో విప్లవం: ఏఐ ట్యూటర్ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ వరకు

పాలనలో టెక్నాలజీని వాడటంలో తాను ఎప్పుడూ ముందుంటానని చెప్పిన సీఎం, రాబోయే రోజుల్లో ఏపీలో రానున్న మార్పులను వివరించారు. విద్యార్థులకు కృత్రిమ మేధస్సు (Artificial Intelligence)లో శిక్షణ ఇచ్చేందుకు త్వరలో ఏఐ ట్యూటర్ రానున్నారు. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందిస్తున్న రాష్ట్రం ఏపీ అని గుర్తుచేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటం కంప్యూటర్ అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.

శ్రీవారి లడ్డూపై కీలక వ్యాఖ్యలు

సభలో ప్రసంగిస్తూ గత పాలకులు చేసిన విధ్వంసంపై సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను గుట్టలుగా వదిలేసి రాష్ట్రాన్ని కలుషితం చేసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి, ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ల్యాబ్ నివేదికలు వచ్చినా.. తప్పు ఒప్పుకోకుండా తిరిగి ప్రభుత్వంపైనే బురద జల్లుతున్నారు. సాక్షాత్తూ స్వామివారి ఫోటోను మండలిలోకి చెప్పులు వేసుకుని తీసుకువెళ్లి రాజకీయ రౌడీయిజం చేస్తున్నారు అని ధ్వజమెత్తారు.

Read More
Next Story