మౌనిక డేటింగ్ యాప్ నుంచి డెత్ మిస్టరీ వరకు
x

మౌనిక డేటింగ్ యాప్ నుంచి డెత్ మిస్టరీ వరకు

ఓ డేటింగ్ యాప్ ద్వారా చింతాడ రవీంద్రకు పరిచయమైంది.


విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగాలో పెట్టీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న చింతాడ రవీంద్ర, పోలిపల్లి మౌనికల పరిచయం ఒక డేటింగ్ యాప్‌లో మొదలైంది. 2021లో మొదలైన ఆ పరిచయం క్రమంగా రిలేషన్‌షిప్‌కు దారితీసింది. అయితే, ఏడాది క్రితం రవీంద్రకు వివాహం కావడంతో వీరి బంధంలో చీలిక వచ్చింది. రవీంద్రకు పెళ్లయిందని తెలిసిన తర్వాత, మౌనిక తన రిలేషన్‌షిప్ వీడియోలను చూపిస్తూ డబ్బు కోసం రవీంద్రను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టిందని, నిందితుడి భార్యకు ఆ వీడియోలను పంపడంతో పాటు, మరింత ఒత్తిడి పెంచడంతో రవీంద్ర తన ప్రియురాలిని శాశ్వతంగా అడ్డుతొలగించుకోవాలని ఒక కిరాతకమైన స్కెచ్ వేశాడు.

పైశాచికత్వం..బాత్‌రూమ్‌లో శవం ముక్కలు
మౌనికను అంతమొందించేందుకు రవీంద్ర వేసిన ప్లాన్ అత్యంత పాశవికంగా ఉంది. తన భార్య పుట్టింటికి వెళ్లిన సమయాన్ని చూసి, మౌనికను ఇంటికి పిలిపించాడు. ఇన్‌స్టామార్ట్ ద్వారా ముందే కొనుగోలు చేసిన కత్తిని సిద్ధం చేసుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆమె ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత అతనిలోని రాక్షసుడు బయటకొచ్చాడు. శవాన్ని ఎవరికీ దొరక్కుండా చేసేందుకు ఆమె తల, చేతులు, కాళ్లను ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ శరీర భాగాలను బాత్‌రూమ్‌లో కడిగి, ఎలాంటి రక్తపు మరకలు లేకుండా ప్యాక్ చేసి, కొన్నింటిని ఏకంగా ఫ్రిజ్‌లో దాచడం అతని క్రూరత్వానికి పరాకాష్ట.
కారులో శవ భాగాలు.. నిర్జన ప్రదేశంలో దహనం
హత్య చేసిన తర్వాత సాక్ష్యాలను పూర్తిగా తుడిచిపెట్టేందుకు రవీంద్ర మరో అడుగు ముందుకు వేశాడు. మౌనిక తల, చేతి భాగాలను ఒక గోనె సంచిలో వేసి, కారులో అడవివరం రోడ్డులోని ధారపాలెం వద్ద ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేని సమయం చూసి పెట్రోల్ పోసి వాటిని తగలబెట్టాడు. మిగిలిన భాగాలను సూట్‌కేసులో సర్ది ఇంట్లోనే ఉంచాడు. అయితే, చేసిన పాపం వెంటాడటంతో తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతని సలహా మేరకు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడంతో ఈ భయంకరమైన హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఫ్రిజ్‌లో దాచిన శరీర భాగాలను చూసి పోలీసులు సైతం విస్తుపోయారు. అనంతరం పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు.
Read More
Next Story