చేనేతలకు హామీల్లోనే ఉచిత విద్యుత్
x
గత ఏడాది ఆగస్టు 7న ఉచిత విద్యత్ పథకం ప్రారంభించిన సీఎం

చేనేతలకు హామీల్లోనే ఉచిత విద్యుత్

చేనేతలకు ఉచిత విద్యుత్ జీవో ఇచ్చినా అమలు కాలేదు. ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామంటున్నారు. కార్మికులు మండిపడుతున్నారు.


చేనేత కార్మికుల మగ్గాలకు ఉచిత విద్యుత్ అందిస్తామంటూ గత సంవత్సరం మార్చి 26న జీవో ఎంఎస్ నెంబరు 44ను ప్రభుత్వం విడుదల చేసింది. పది నెలల తరువాత 2026 జనవరి 29న సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. విచిత్రం ఏమిటంటే గత ఏడాది మార్చిలో జీవో విడుదల అయితే ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో ఒక చేనేత మగ్గంపై కూర్చుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పథకాన్ని ప్రారంభించి ఐదు నెలలు గడిచినా అమలుకు నోచుకోలేదు. చేనేత కుటుంబాలకు రూ. 25వేలు ఆర్థిక సాయం ఇస్తామనని చెప్పి రెండేళ్లు కావస్తున్నా ఇవ్వలేదు.

ఉచిత విద్యుత్ పై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

రాష్ట్రంలోని చేనేత, పవర్‌లూమ్ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా నేతన్నల ఇళ్లకు, పవర్‌లూమ్ యూనిట్లకు భారీగా ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ 2026 మార్చి 26న G.O.MS.No. 44 పేరుతో అధికారిక ఉత్తర్వులను వెలువరించింది.

200 యూనిట్ల వరకు ఉచితం

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, ప్రతి చేనేత కార్మికుని కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. గతంలో ఉన్న 100 యూనిట్ల పరిమితిని ప్రభుత్వం రెట్టింపు చేసింది. అలాగే పవర్‌లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఒకవేళ ఈ నిర్ణీత పరిమితి దాటి విద్యుత్తును వినియోగిస్తే అదనపు యూనిట్లకు డిస్కమ్ నిబంధనల ప్రకారం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

నేతన్నల ఆర్థిక భారం తగ్గిపే లక్ష్యం

ముడిసరుకులు, రంగులు, రసాయనాల ధరలు విపరీతంగా పెరగడంతో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో నేతన్నలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

లబ్ధిదారులు: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93,000 చేనేత కుటుంబాలు, 10,534 పవర్‌లూమ్ యూనిట్లకు ఈ పథకం వర్తిస్తుంది.

బడ్జెట్: ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఏటా రూ. 125 కోట్ల ఆర్థిక భారాన్ని భరించనుంది.

పింఛన్ పెంపు: సామాజిక భద్రతలో భాగంగా ఇప్పటికే చేనేత కార్మికుల నెలవారీ పింఛన్‌ను రూ. 3,000 నుండి రూ. 4,000లకు పెంచిన విషయాన్ని ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తుచేసింది.

త్వరలోనే అమలు విధానం (SOP)

ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో పారదర్శకంగా అమలు చేసేందుకు విద్యుత్ శాఖతో కలిసి త్వరలోనే ప్రత్యేక మార్గదర్శకాలను (SOP) విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకానికి అవసరమైన నిధులను విద్యుత్ శాఖ ద్వారా డిస్కమ్‌లకు ప్రభుత్వం జమ చేస్తుంది. మంగళగిరిలోని చేనేత, జౌళి శాఖ కమిషనర్ ఈ ఉత్తర్వుల అమలును పర్యవేక్షిస్తారు. అని ఆదేశాలు జారీ అయి ఇప్పటికి పది నెలలు అయింది.

సీఎం ప్రారంభించి ఆరు నెలలైనా...

2025 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఈ పథకం ప్రారంభించారు. ఆరు నెలలు గడిచినా ఇంతవరకు పథకం అమలు కాలేదు. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి కొత్తగా అమలు చేస్తామని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. ఈ ప్రకటనను ‘కీలక హామీ నెరవేర్చినట్టు’ చిత్రీకరించడం పట్ల విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తారట...

మంత్రి సవిత గురువారం అమరావతి సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి సాధారణ మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేస్తామని వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.85 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని తెలిపారు. అయితే గత ఆగస్టు 7 నుంచి అమలు చేస్తామని ప్రకటించిన పథకం ఎందుకు ఆలస్యమైందనేదానికి సమాధానం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆగస్టు 7న ఈ పథకాన్ని ప్రారంభించారు. రూ.190 కోట్ల భారం పడుతుందని అప్పటి వార్తలు తెలిపాయి. కానీ వాస్తవంగా అమలు జరగలేదు.

మాజీ మంత్రి ఆర్కె రోజా విమర్శలు

ఈ ఆలస్యం పట్ల మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కె రోజా తీవ్రంగా స్పందించారు. ఇటీవల ముఖ్యమంత్రి నగరి పర్యటన సందర్భంగా రోజా ప్రశ్నిస్తూ నేతన్నలకు ఉచిత విద్యుత్ హామీ జీవోకే పరిమితమైందని, అమలు లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమైందని, 500 యూనిట్ల ఉచిత విద్యుత్, మామిడి రైతులకు రూ.360 కోట్ల బకాయిలు వంటి విషయాల్లో ఆలస్యం చేస్తోందని విమర్శించారు. రోజా నేతృత్వంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రదర్శనలు చేపట్టి, పవర్‌లూమ్ టారిఫ్‌లు తగ్గించాలని, నేతన్నలకు ఉచిత విద్యుత్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఈ విమర్శలకు తేరుకుని ఇప్పుడు కొత్త తేదీ ప్రకటించడం విశేషం. అయితే ఆలస్యానికి కారణాలు ఏమిటి? ఆగస్టు నుంచి జనవరి వరకు ఎందుకు అమలు చేయలేదు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. ఆగస్టు 5న ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రూ.125 కోట్లు కేటాయించామని, ఆగస్టు 7 నుంచి అమలు అని చెప్పారు. కానీ ఆ తర్వాత సైలెంట్. ఇప్పుడు ఏప్రిల్ 1 ని కొత్త ప్రారంభంగా చెప్పటం, పాత హామీని మరచిపోయి 'గుడ్ న్యూస్' అని చెప్పడం పట్ల నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏప్రిల్ ఫూల్ చేయదలుచుకున్నారు: సురేంద్ర

ఉచిత విద్యుత్ చేనేత కార్మికులకు ఏప్రిల్ ఒకటి నుంచి ఇస్తామని చెప్పటం కార్మికులను ఏప్రిల్ పూల్ చేయడమేనని చేనేత కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు బీరక సురేంద్ర పేర్కొన్నారు. ఆయన ‘ది ఫెడరల్’ ప్రతినిధితో మాట్లాడుతూ గత సంవత్సరం మార్చిలో జీవో ఇచ్చి, ఆగస్ట్ లో పథకం ప్రారంభించినా ఇంత వరకు అమలు చేయకపోగా మంత్రి సవిత ఏప్రిల్ ఒకటి నుంచి పథకం ప్రారంభమవుతుందని చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు.

ప్రభుత్వం మోసం చేసింది: మాచర్ల మోహన్ రావు

ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల మోహన్ రావు పేర్కొన్నారు. ఆయన ‘ది ఫెడరల్’ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి 20 నెలలైనా ఉచిత విద్యుత్ ఇవ్వలేదు. సీఎం ప్రారంభించినా అమలు కాలేదని అన్నారు. చేనేతలకు ఇస్తామన్న రూ. 25వేల సాయం మాట కూడా లేదన్నారు. ఆగస్ట్ లో సీఎం చంద్రబాబు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నట్లు ప్రకటించినా అమలు కాలేదు అని తెలిపారు. త్రిఫ్ట్ ఫండ్ ఐదు కోట్లు ఇస్తామని చెప్పి కోటిన్నర విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. అవి కూడా డ్రా చేసే అధికారం అధికారులకు ఇవ్వలేదన్నారు. కార్మిక వర్గం ఈ విషయాలు గుర్తించి ఓట్ల రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సి ఉందన్నారు. నూలుకు సబ్సిడీ కూడా ఇవ్వటం లేదని తెలిపారు. ఆప్కో ద్వారా ఇవ్వాల్సిన బకాయిలు రూ. 13 కోట్లు ఉన్నా రిలీజ్ చేయలేదని, కానీ ఒక సొసైటీకి మాత్రం రూ. 12 కోట్లు ఇచ్చారని చెప్పారు. బకాయిల విషయం సీఎం, సీఎం తనయుడు లోకేష్ కు చెప్పినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు.

హామీలు అమలు కాలేదు: చేనేత కార్మికుడు పోతులయ్య

ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురు చూస్తున్నాం. మాకు ఇప్పటి వరకు ఏ సాయం అందలేదు. ఉచిత విద్యుత్ ఇవ్వలేదు. ఏప్రిల్ నుంచిైనా ఇస్తామోనని ఎదురు చూస్తున్నాము అని ధర్మవరం చేనేత కార్మికుడు సాకే పోతులయ్య పేర్కొన్నారు.

అబద్ధాలు మాట్లాడే చేనేత మంత్రి సవిత మాటలు నమ్మవచ్చా?: సీపీఎం బాలకృష్ణ

కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 ఆగష్టు 7వ తేదీన చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి చేనేత కార్మికునికి ఇస్తామని ప్రకటించారు. అయితే నేటికీ కొన్ని నెలలు గడిచినా దీనిపై ఎటువంటి స్పష్టత లేదు. 26-3-2025 వ తేదీన ఈ-కెవైసి పూర్తి చేస్తే వెంటనే 6 వేల కోట్లు ఇస్తామని ఇంతవరకు అమలు పరచలేదు. ముఖ్యమంత్రి మాటలే నీటి మూటలుగా మిగిలిపోయాయి అని సీపీఎం నాయకులు, రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ పేర్కొన్నారు.

2024-2025 బడ్జెట్‌లో 5 కోట్లు రూపాయలు కేటాయించారు. కేవలం ఒకే ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కానీ చేనేత మంత్రి సవిత మంగళగిరి సమావేశంలో మాట్లాడుతూ 5 కోట్లు విడుదల చేశామని చెప్పారు. అది పూర్తిగా అబద్ధమని సంఘాల వాళ్ళు మొత్తుకుంటున్నారు. ప్రస్తుతం రూ. 176 కోట్లు విడుదల చేసినట్లుగా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అంటే 5 కోట్లు విడుదల చేసినట్లు చెప్పడం అబద్ధమని ఇందులో అర్థమవుతుంది. సహకార సంఘాలలో బ్యాంకు వాళ్ళు లోన్లన్నీ కూడా చక్రవడ్డీలు వేస్తుంటే వాటిని మాఫీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఆర్థికంగా నష్టపోతున్న నేతన్నలు

చేనేత రంగం ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైనది. 93 వేల సాధారణ మగ్గాలు, 10 వేలకు పైగా మర మగ్గాలు ఉన్నాయి. ఈ ఆలస్యం వల్ల నేతన్నలు ఆర్థికంగా నష్టపోతున్నారు. నెలకు రూ.720 నుంచి రూ.1,800 వరకు ఆదా అవుతుందని అప్పటి ప్రకటనల్లో ప్రభుత్వం వారు చెప్పారు. కానీ ఆరు నెలలు గడిచినా అమలు లేదు. ప్రభుత్వం ఇప్పుడు హడావుడిగా ప్రకటనలు చేస్తున్నా, వాస్తవ అమలు ఎలా ఉంటుందో చూడాలి. విపక్షాలు ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాయి. కానీ నేతన్నల బాధలు మాత్రం కొనసాగుతున్నాయి. మొత్తంగా 1,03,534 కుటుంబాల్లోని సుమారు 4 లక్షల మంది చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులకు పథకం అమలైతే ఆర్థిక ఊరట కలుగుతుంది.

ఇక పెన్షన్ల విషయానికి వస్తే, 50 ఏళ్లకే నేతన్నలకు రూ.4 వేల పెన్షన్‌ అందించనున్నారు. ప్రస్తుతం 87,280 మంది నేతన్నలకు పెన్షన్లు ఇస్తున్నారు. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెన్షన్‌ పెంచడం ద్వారా ప్రతి నేతన్నకు నెలకు రూ.1,000 చొప్పున ఏడాదికి రూ.12,000లు అదనపు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఇది వారి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను పెంచుతుంది.

రాష్ట్రంలో రూ.10.44 కోట్లతో 10 చేనేత క్లస్టర్లు

చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కో ఆప్టెక్స్‌, టాటా తనేరియా, బిర్లా ఆద్యం వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ఈ-కామర్స్‌ ద్వారా చేనేత వస్త్రాల డోర్‌ డెలివరీ సదుపాయం కల్పించింది. విశాఖపట్నంలో 5 ఎకరాల్లో రూ.172 కోట్లతో యూనిటీ మాల్‌ నిర్మాణం చేపట్టింది. ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలో టెక్స్‌టైల్స్‌ పార్కులు ఏర్పాటు చేస్తోంది. మంగళగిరిలో మెగా టెక్స్‌టైల్‌ పార్కు, ధర్మవరంలో రూ.30 కోట్లతో మెగా క్లస్టర్‌ నిర్మిస్తోంది. పిఠాపురంలో మరో మెగా క్లస్టర్‌ ఏర్పాటు చేయనుంది. మొత్తంగా రాష్ట్రంలో రూ.10.44 కోట్లతో 10 క్లస్టర్లు స్థాపిస్తోంది.

Read More
Next Story