నలుగురు మహిళా బందీలను విడుదల చేసిన హమాస్.. అయితే..
పాలస్తీనియన్లను ఉత్తర గాజా ప్రాంతానికి రానివ్వమని ప్రకటించిన నెతన్యహూ మహిళా బందీలందరిని విడుదల చేయాలని డిమాండ్
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులను హమాస్ విడుదల చేసింది. దాదాపు 15 నెలల తరువాత వీరు గాజాలో బంధిగా ఉన్నారు. తాజాగా బందీలను తీసుకువచ్చి ఇజ్రాయెల్ సరిహద్దులో విడిచిపెట్టారు.
విడుదలైన వారిలో కరీనా అరివ్, డానియోల్లా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్భాగ్ ఉన్నారు. వీరి అందరి వయస్సు 20 సంవ్సరాలని తెలుస్తోంది. 2023 న హమాస్, ఐడీఎఫ్ స్థావరాలపై జరిపిన పాశవిక ఉగ్రదాడిలో వీరిని బందీలుగా తీసుకెళ్లారు. ఈ దాడుల్లో 1500 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు.
తరువాత ఇజ్రాయెల్ యుద్ధానికి దిగగా దాదాపు పాలస్తీనాలోని ఉగ్రవాదులతో సహ 46 వేల మంది మరణించారు. తాజాగా ఈ నలుగురు మహిళలతో పాటు మరో మహిళా సైనికురాలిని కూడా హమాస్ ఎత్తుకెళ్లగా, ఆమెను తాజాగా విడిచిపెట్టలేదు.
ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మొదటి దశలో 33 మంది బందీలను హమాస్ విడిచిపెడుతుండగా టెల్ అవీవ్ వెయిమందికి పైగా ఖైదీలను విడుదల చేస్తోంది. అయితే మొదటగా ఉగ్రవాద సంస్థ బందీలను విడుదల చేయాలి. తరువాత ఇజ్రాయెల్ ఖైదీలను విడిచిపెడుతుంది. ఒప్పందం తరువాత దాదాపుగా 90 బందీలు ఇంకా హామాస్ అదుపులోనే ఉంటారు. ఇందులో మూడింట ఒక వంతు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మిగిలిన వారిని రక్షించగా, కొంతమందిని విడుదల చేశారు. కొంతమంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
లిరి అల్భాగ్:
జనవరి ప్రారంభంలో విడుదలైన హమాస్ వీడియోలో లిరి అల్భాగ్ కనిపించారు. ఇందులో ఆమె ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించింది. తన మానసిక క్షోభ కారణంగా తనను చూడటం కష్టంగా మారిందని కుటుంబం తెలిపింది.
కరీనా అరివ్:
కరీనా అరీవ్ కిడ్నాప్ చేయడానికి ముందే ఆమె తన కుటుంబానికి ఒక సందేశాన్ని పంపింది. ‘‘ నేను జీవించకపోతే అమ్మ నాన్నలు జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా జీవించండి ’’ అని సమాచారం ఇచ్చినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. జనవరి 2024 లో విడుదలైన గిల్బోవా, డొరన్ స్టెయిన్ బ్రేచర్ లతో కలిసి ఉన్న వీడియోలో కనిపించింది.
డానియెల్లా గిల్బోవా:
కిడ్నాప్ తరువాత డేనియెల్లా గిల్బోవా తల్లిదండ్రులు ఆమె పేరును డేనియల్ నుంచి డేనియెల్లాగా మార్చారు. ఇలా పేరు మారిస్తే దేవుడి రక్షణ లభిస్తుందని యూదులు బలంగా విశ్వసిస్తారు. కిడ్నాప్ అయిన వీడియోలో గిల్బోవా ఆమెను గాజాకు తీసుకెళ్లిన జీప్ లోకి బలవంతంగా ఎక్కించడంతో పాదాలకు గాయం అయినట్లు తెలుస్తోంది.
నామలెవీ:
నామ లెవీ కిడ్నాప్ కు సంబంధించిన ఫుటేజ్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమెను కిడ్నాప్ చేస్తున్న సందర్భంలో దుస్తులు మొత్తం రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. జనవరి 19న హమాస్ విడుదల చేసిన వీడియోలో రోమి గోనెన్, ఎమిలీ డమారీ, బ్రిటిష్ ఇజ్రాయెల్ పౌరుడు, రొమోనియా ఇజ్రాయెల్ పౌరసత్వం కలిగిన డోరన్ స్టెయిన్ బ్రేచర్ ఉన్నారు.
అయితే హమాస్ చెరలో ఉన్న మొత్తం మహిళా బందీలను విడిచిపెట్టే వరకూ పాలస్తీనియన్లను తిరిగి ఉత్తర గాజాకు తిరిగి రానివ్వమని ఇజ్రాయల్ హెచ్చరించింది. దీనికి సంబంధించి ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ ఒప్పందం ప్రకారం హమాస్ మహిళా బందీ అయిన యోహోద్ ను విడుదల చేయకపోతే గాజా స్ట్రిప్ కు ఉత్తరాన ఉన్న ప్రాంతానికి పాలస్తీనియన్లను రానివ్వం’’ అని అందులో పేర్కొన్నారు.
ఇస్లామిక్ జిహాద్
యోహోద్ ను పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాద సంస్థ ఆధీనంలోకి తీసుకున్నట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆదివారం నెట్ జారిమ్ కారిడార్ ను జారీ చేసింది. ఇజ్రాయెల్- హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం సజీవంగా ఉన్న మహిళా బందీలను మొదటగా విడుదల చేయాలి.
Next Story