
మాజీ మంత్రి ఇల్లునే కొల్లగొట్టారు
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
కృష్ణా జిల్లా గుడివాడలో భారీ చోరీ కలకలం రేపింది. మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ నివాసమే లక్ష్యంగా దుండగులు బరితెగించారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అదునుగా చూసుకున్న దొంగలు, ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి విలువైన వస్తువులను దోచుకెళ్లారు.
జరిగిన ఉదంతం ఇదే..
కఠారి ఈశ్వర్ కుమార్ భార్య మధురిమ రెండు రోజుల క్రితం వ్యక్తిగత పనిమీద హైదరాబాద్ వెళ్లారు. బుధవారం ఆమె తిరిగి గుడివాడలోని తన నివాసానికి చేరుకోగా, ఇంటి తలుపులు తెరిచి ఉండటం చూసి విస్తుపోయారు. లోపలికి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని వస్తువులు మాయమవ్వడంతో చోరీ జరిగినట్లు ఆమె గుర్తించారు.
ఏమేం మాయమయ్యాయంటే?
ఈ దొంగతనంలో ప్రధానంగా వంశపారంపర్యంగా వస్తున్న సుమారు 10 కిలోల వెండి వస్తువులు, పూజా సామాగ్రిని దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కఠారి ఈశ్వర్ కుమార్ తన వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉంటున్నారు. యజమానులు ఇంట్లో లేని సమయాన్ని దొంగలు ముందే పసిగట్టి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
దర్యాప్తులో పోలీసులు
చోరీపై సమాచారం అందుకున్న వెంటనే మధురిమ గుడివాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీంను రప్పించారు. క్లూస్ టీం సభ్యులు వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Next Story

