హరీష్ రాణాకు ‘పాసివ్ యూథెనేషియా’కు సుప్రీం అనుమతి
x

హరీష్ రాణాకు ‘పాసివ్ యూథెనేషియా’కు సుప్రీం అనుమతి

ఢిల్లీ ఎయిమ్స్‌లో లైఫ్ సపోర్ట్‌ను దశలువారీగా తొలగించునున్న వైద్యులు ..


Click the Play button to hear this message in audio format

31 ఏళ్ల హరీష్ రాణాకు పాసివ్ యూథెనేషియా (చికిత్స ఆపడం ద్వారా సహజ మరణం)కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. దీంతో 12 సంవత్సరాలుగా కోమాలో ఉన్న రాణాకు కుటుంబ సభ్యులు తుది వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఘజియాబాద్‌లో నివసిస్తున్న రాణా కుటుంబం, అతనిని ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించి అక్కడ లైఫ్ సపోర్ట్‌ను దశలువారీగా తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.


12 ఏళ్ల పాటు అచేతనంగా..

హరీష్ రాణా గత 12 సంవత్సరాలుగా కోమాలో ఉన్నాడు. 2013లో నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి పడిపోవడంతో అతని తలకు తీవ్ర గాయమైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్నాడు. వైద్యులు అతని పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు పాసివ్ యూథెనేషియాకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. రాణా జీవనాధార చికిత్స (వెంటిలేటర్, ఫీడింగ్ ట్యూబ్) లను దశలవారీగా తొలగించాలని, అది కూడా గౌరవప్రదంగా జరగాలని కోర్టు ఆదేశించింది. ఈ బాధ్యతను ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) అప్పగించింది. ఈ నిర్ణయం చాలా బాధాకరమైనదైనా అవసరమైనదని హరీష్ తండ్రి అశోక్ రాణా గతంలో పేర్కొన్నారు.


ఆధ్యాత్మిక ప్రార్థనల మధ్య వీడ్కోలు..

హరీష్ రాణా కుటుంబం బ్రహ్మకుమారీస్ ఆధ్యాత్మిక బోధనలను అనుసరిస్తోంది. ఒక వీడియోలో కుటుంబ సభ్యులు , బ్రహ్మకుమారీస్ సభ్యులు రాణా నుదిటిపై తిలకం పెట్టి ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. “అందరినీ క్షమిస్తూ, అందరినీ క్షమించమని అడుగుతూ నిద్రపోండి” అని ప్రార్థనలు చేస్తూ అతనికి ఆధ్యాత్మికంగా వీడ్కోలు చెప్పినట్లు వీడియోలో కనిపిస్తుంది. రాణా ఆత్మకు శాంతి కలిగించడమే ఈ ప్రక్రియ లక్ష్యమని బ్రహ్మకుమారీస్ సభ్యులు తెలిపారు.


రాణా కుటుంబానికి ఆర్థిక సాయం..

హరీష్ చికిత్స కోసం కుటుంబం గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అతని తండ్రి అశోక్ రాణా, తల్లి నిర్మల తమ కుమారుడి చికిత్స కోసం ఢిల్లీలోని తమ ఇంటిని కూడా అమ్ముకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. కుటుంబానికి జీవనోపాధి కోసం ఉచితంగా ఒక దుకాణం కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.

అదేవిధంగా ప్రజల విరాళాల ద్వారా ఇప్పటికే రూ.2.5 లక్షలు సేకరించారు. సంక్షేమ పథకాలు కూడా రాణా కుటుంబానికి అందేలా అధికారులు సహకరిస్తున్నారు.

ఈ ఘటనతో పాసివ్ యూథెనేషియా అంశం దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు వచ్చింది.


2011లో ఇలాంటిదే అరుణా షాన్‌బాగ్ కేసు..

అరుణా షాన్‌బాగ్ అనే నర్సు కేసుతో భారతదేశంలో పాసివ్ యూథెనేషియాపై చర్చ మొదలైంది. ముంబైలోని ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే ఆమెపై 1973లో దాడి జరగడంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది. ఆ తర్వాత దాదాపు 40 సంవత్సరాలు కోమాలోనే జీవించింది. అరుణా షాన్‌బాగ్ కేసులో సుప్రీంకోర్టు 2011లో పాసివ్ యూథెనేషియాకు అనుమతినిచ్చింది.

Read More
Next Story