ఒలింపిక్స్ దేవుడెరుగు, ముందు మా బతుకేంటన్న అమరావతి రైతులు!
x
మంత్రి నారాయణతో రైతుల వాదన

ఒలింపిక్స్ దేవుడెరుగు, ముందు మా బతుకేంటన్న అమరావతి రైతులు!

అమరావతి రెండో దశ: రైతుల ప్రశ్నలతో మంత్రి ఉక్కిరిబిక్కిరి!


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైంది. బుధవారం తుళ్లూరు మండలం వడ్డమానులో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో ప్రభుత్వానికి రైతుల నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది.

ఒకవైపు ప్రభుత్వం అభివృద్ధి పనులు, రుణమాఫీ వంటి ఆశలు చూపిస్తుండగా, మరోవైపు "గత అనుభవాల"ను ఎత్తిచూపుతూ రైతులు నిలదీయడం గందరగోళానికి దారితీసింది.
అభివృద్ధి మంత్రం.. రుణమాఫీ వరం
రెండో విడతలో సుమారు 16,666 ఎకరాలను సేకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఈ భూములను అంతర్జాతీయ క్రీడా పోటీలు, ఒలింపిక్ నిర్వహణ కోసం వినియోగిస్తామని, మూడేళ్లలోనే అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా ప్రాంగణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా రైతులకు ఊరటనిచ్చేలా.. గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీకి సీఎం చంద్రబాబు అంగీకరించారని, కౌలు కూడా పెంచే ఆలోచనలో ఉన్నారని మంత్రి ప్రకటించారు. రాజధాని అభివృద్ధిని గత ప్రభుత్వం అడ్డుకుందని, తాము నిధులు సమీకరించి వేగంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.
మా బతుకులు అరణ్య రోదనేనా....
అయితే, ప్రభుత్వ హామీలపై రైతులు ససేమిరా అన్నారు. మొదటి దశలో భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని వారు సూటిగా ప్రశ్నించారు. "తొలి దశలో వేలాది ఎకరాలు ఇస్తే మాకు అరణ్య రోదన మిగిల్చారు. సంచార జాతుల్లా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం. అప్పట్లో చెప్పిన అభివృద్ధి ఏమైంది? మాకు కేటాయించిన ప్లాట్లను ఎందుకు అభివృద్ధి చేయలేదు?" అంటూ అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీశారు.
ఒకవైపు ప్రభుత్వం రెండో దశ భూ సమీకరణను భవిష్యత్ అభివృద్ధికి కీలకంగా చూపుతుంటే, మరోవైపు తొలి దశ అనుభవాలే రైతుల్లో అనుమానాలు, భయాలు పెంచుతున్నాయి. అమరావతి నిర్మాణం హామీల మీద నడుస్తుందా? లేక అమలు మీద నడుస్తుందా? అన్న ప్రశ్న ఈ గ్రామ సభతో మరింత బలంగా ముందుకు వచ్చింది.
రైతుల ప్రధాన డిమాండ్లు ఇవే..
మూడేళ్లలో అభివృద్ధి చేస్తామని అగ్రిమెంట్‌లో రాసివ్వాలి.
ఒకవేళ నిర్ణీత సమయంలో అభివృద్ధి చేయకపోతే, ఎకరానికి ఏడాదికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలి.
గతంలో జరిగిన జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి ప్రాజెక్టుకు ఉన్న చట్టబద్ధతను స్పష్టం చేయాలి.
రైతుల ప్రశ్నలతో గ్రామసభలో గందరగోళం నెలకొనగా, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ స్పందిస్తూ.. అమరావతికి చట్టబద్ధత ఉందని, అభివృద్ధి జరగకపోతే కోర్టుకు వెళ్లే హక్కు ఉంటుందని చెప్పారు. అయినప్పటికీ, తమ డిమాండ్లు అంగీకరించే వరకు అడుగు ముందుకు వేయనిచ్చేది లేదని రైతులు స్పష్టం చేయడంతో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ సవాలుగా మారింది.
ప్రభుత్వం చెబుతున్న ఒలింపిక్స్ స్థాయి కలలు, రైతులు కోరుతున్న నిర్దిష్ట కాలపరిమితితో కూడిన అభివృద్ధి మధ్య నెలకొన్న ఈ ఘర్షణ అమరావతి భవిష్యత్తుపై ఉత్కంఠను రేపుతోంది.
Read More
Next Story