
పోలవరంలో ఒంటరిగా కాదు గుంపులుగా వెళ్లాలి
పెద్దపులి పంజా విసరడంతో మూడు దూడలు బలయ్యాయి. పులి సంచారంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆందోళనలు చెందుతున్నారు.
పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి హడలెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వస్తున్న పులి, తాజాగా కొత్తవీధి గ్రామ సమీపంలో పశువుల మందపై పంజా విసిరింది. ఈ దాడిలో మూడు గేదె దూడలు మృతి చెందడంతో పశుపోషకులు లబోదిబోమంటున్నారు. పులి సంచారంతో మన్యం ప్రాంత ప్రజలు గుండెచేత పట్టుకుని బతుకుతున్నారు.
అప్రమత్తమైన అటవీ శాఖ
ఘటనాస్థలాన్ని అటవీ, పశుసంవర్థక శాఖ అధికారులు సందర్శించారు. మృతి చెందిన పశువుల శరీరాలపై ఉన్న గాయాలను పరిశీలించిన అధికారులు, అవి పెద్దపులి దాడిలో జరిగినవేనని ప్రాథమికంగా ధృవీకరించారు. పులి అడుగుజాడల (Pugmarks) ఆధారంగా దాని కదలికలను ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
పాఠశాల సమీపంలోనే సంచారం.. భయంలో విద్యార్థులు
పులి దాడి జరిగిన ప్రాంతానికి అత్యంత సమీపంలోనే గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఉండటం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వందలాది మంది విద్యార్థులు ఉండే ఈ పాఠశాల పరిసరాల్లో పులి సంచరిస్తుండటంతో అటవీ శాఖ అధికారులు పాఠశాల సిబ్బందిని, వార్డెన్లను అప్రమత్తం చేశారు. సాయంత్రం వేళల్లో విద్యార్థులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గ్రామస్తులకు హెచ్చరికలు
ముసినిమిల్లి, దాని పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పొలాలకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా అడవి ప్రాంతానికి వెళ్లకూడదని సూచించారు. రాత్రి వేళల్లో పశువుల పాకల వద్ద కాపలా ఉండే వారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పులి కంటబడితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
Next Story

