అమరావతి రాజధాని నగరం పనులమీద రాష్ట్రప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల ప్రజా నిధులను ఖర్చు చేస్తున్నది. సుమారు, 25-30,000 మంది వలస కార్మికులు ఇతర రాష్ట్రాలనుంచి, రాజధాని భవన నిర్మాణ కార్యక్రమంలో పనులకోసం వస్తున్నారు. చట్టబద్ధంగా వారికి ఉన్న హక్కులను పరిరక్షించడం, వారి సంక్షేమం విషయంలో శ్రద్ధ చూపడం, వారిసేవలను పొందుతున్న కాంట్రాక్టర్లకు మాత్రమే కాకుండా, ఆ కాంట్రాక్టర్లను నియమించిన APCRDA ఉన్నత అధికారులకు కూడా బాధ్యత ఉందని ప్రభుత్వం గుర్తించాలి.
2014-19 లో, అప్పటి ప్రభుత్వం, అమరావతి లో పనిచేసిన వలస కార్మికుల విషయంలో నిర్లక్ష్యం చూపడం, అప్పటి కాంట్రాక్టర్లు వారికి సరిగ్గా వేతనాలు ఇవ్వకపోవడం అందరికీ తెలిసిన విషయం. అప్పటి వలస కార్మికుల దైన్య పరిస్థితి మీద విపులమైన రిపోర్టులు వెలువడ్డాయి. ఆ సమయంలో, ప్రభుత్వం, షాపుర్జీ పలాంజీ, L&T వంటి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించింది. అప్పటి ప్రభుత్వం మారగానే, అమరావతి లో భవన నిర్మాణ కార్యక్రమం కూడా ఆగడం జరిగింది.
మళ్ళీ టీడీపీ-జనసేన ప్రభుత్వం 2024లో వచ్చిన తదుపరి, అమరావతి లో పనులు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. వేలాదిమంది వలస కార్మికులు పనులలో చేరారు. మళ్ళీ షాపుర్జీ పలాంజీ, L&T వంటి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించబడ్డాయి. కాని, ఆ కార్మికుల సంక్షేమంలో విషయంలో మాత్రం, APCRDA అధికారులు ఉదాసీనతతో ప్రవర్తించడం బాధాకరం.
వలస కార్మికుల హక్కులను పరిరక్షించడం బదులు, APCRDA అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు, వారి విషయంలో law & order దృష్ట్యా ప్రవర్తిస్తున్నారనే వార్తలు చూసాను. వలస కార్మికులందరినీ Inter-State Migrant Workmen (Regulation of Employment and Conditions of Service) Act కింద, Building and Other Construction Workers (Regulation of Employment and Conditions of Service) Act కింద, ఇతర సంక్షేమ చట్టాలకింద, రిజిస్టర్ చేయడం, వారికి సకాలంలో కాంట్రాక్టర్లు వేతనాలు చెల్లించడం, వారి తరఫున ప్రోవిడెంట్ ఫండ్ ఇతర కాంట్రిబ్యూషన్ లు జమా చేయించడం, వారికి సరి అయిన వసతులు ఏర్పాటు చేయడం, వారి ఆరోగ్యం విషయంలో సౌకర్యాలు ఏర్పాటు చేయడం, APCRDA ఉన్నత అధికారుల బాధ్యత, కాని, అధికారులు ఆ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నానే వార్తలు వస్తున్నాయి.
ఉదాహరణకు, షాపుర్జీ పలాంజీ కంపెనీ, పనులు చేస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, వేతనాలకోసం ఆ కార్మికులు ఉద్యమం చేయవలసి వచ్చిందని ఎన్నో వార్తలు చూసాను. కాంట్రాక్టర్లు, వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం, రాజ్యాంగంలో ఆర్టికల్ 21 (జీవించే హక్కు) ను ఉల్లంఘించడం అవుతుంది. అదే కాకుండా, షాపుర్జీ పలాంజీ కంపెనీ వారు, కార్మికులచేత ఐదు నెలలు పనిచేయించుకుని, వారికి వేతనాలు ఇవ్వకపోవడం, రాజ్యాంగంలో ఆర్టికల్ 23 (forced labour) కింద పెద్ద నేరంగా భావించాలి. ఆ కార్మికుల తరఫున షాపుర్జీ పలాంజీ కంపెనీ provident fund కూడా జమా చేసి ఉండదు. Building and Other Construction Workers (Regulation of Employment and Conditions of Service) Act కింద కూడా, కార్మికులకు అందవలసిన సంక్షేమ సౌకర్యాలు, ఆ కంపెనీ కార్మికులకు అందచెయ్యలేదని తెలుస్తున్నది.
అటువంటి దైన్య పరిస్థితికి, కొంతవరకు APCRDA ఉన్నత అధికారులకు కూడా బాధ్యత ఉంది. ఈ నేపథ్యంలో, ఈ కింద సూచించిన దిశలో, రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టాలని నా విజ్ఞప్తి.
కార్మిక సంక్షేమ శాఖ తత్క్షణం, షాపుర్జీ పలాంజీ కంపెనీ వారు, కార్మిక సంక్షేమం విషయంలో ఉన్న చట్టాలను ఎంతవరకు ఉల్లంఘించారు, ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అనే విషయం మీద క్షుణ్ణంగా దర్యాప్తు చేసి కంపెనీ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వం, భారతీయ న్యాయ సంహిత లో 146 వ సెక్షన్ (Whoever unlawfully compels any person to labour against the will of that person, shall be punished with imprisonment of either description for a term which may extend to one year, or with fine, or with both) కింద దర్యాప్తు చేపట్టి, షాపుర్జీ పలాంజీ కంపెనీ వారిమీద తగిన చర్యలు తీసుకోవడం అవసరం
మీ సూచించిన దిశలో, అమరావతి పనులు అప్పగించబడిన ఇతర కాంట్రాక్టర్ల విషయంలో కూడా దర్యాప్తు చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలి
ఈ నేపథ్యంలో, బాధ్యతారహితంగా వర్తిస్తున్న APCRDA ఉన్నత అధికారులమీద తగిన చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వం అమరావతి రాజధానిని, ప్రపంచస్థాయి నగరంగా పెంపోందిస్తుందని పదేపదే ప్రజలకు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో, ఆ భవన నిర్మాణ కార్యక్రమంలో, ముఖ్యంగా చట్టాల అమలువిషయంలో ప్రభుత్వం జవాబుదారీ మీద పర్యవేక్షణ చేసే బాధ్యత ఉన్న హై కోర్టు వారి కి చెందిన భవనం కట్టడంలో పనిచేస్తున్న కార్మికుల హక్కులకు కూడా భంగం కలగడం బాధాకరమైన విషయం.
మీద సూచించిన దిశలో ప్రభుత్వం ఆలస్యం చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. అంటూ ఈఏఎస్ శర్మ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు.