బంగ్లా జైలు నుంచి మత్స్యకారులకు బంధ విముక్తి!
x
బంగ్లాదేశ్‌ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు

బంగ్లా జైలు నుంచి మత్స్యకారులకు బంధ విముక్తి!

పొరపాటున బంగ్లాదేశ్‌ సముద్ర జలాల్లోకి వెళ్లి ఆ దేశ కోస్టుగార్డుకు చిక్కి జైలులో ఉన్న ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఎట్టకేలకు విడుదలయ్యారు.


సముద్రంలో చేపలవేటకు వెళ్లిన ఉత్తరాంధ్రకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు గత ఏడాది అక్టోబర్‌ 21న బంగ్లాదేశ్‌ సముద్ర జలాల్లోకి పొరపాటున ప్రవేశించారు. ఆ దేశ కోస్టుగార్డు సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ దేశ చట్టాల ప్రకారం అరెస్టు చేసి అక్కడ జైలులో పెట్టారు. విశాఖపట్నంలోని వడ్డాది సత్యనారాయణకు చెందిన ఇండ్‌–ఏపీ–వీ5– ఎంఎం–735 నంబరు మెకనైజ్డ్‌ బోటులో తొమ్మిది మంది అక్టోబర్‌ 13న వేటకు బయల్దేరారు. వీరిలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండరాజుపాలేనికి చెందిన మరుపల్లి చినప్పన్న, మరుపిల్లి రమేష్, సూరాడ అప్పలకొండ, మరుపిల్లి ప్రవీణ్, సూరపత్తి రాము, మరుపల్లి చిన్న అప్పన్న, పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్కా రమణ; వాసుపల్లి సీతయ్య తదితరులున్నారు.

దాదాపు వంద రోజులు జైలులో మగ్గి..
బంగ్లాదేశ్‌ చట్టాల ప్రకారం ఆ దేశ సముద్ర జలాల్లోకి అక్రమంగా చొరబడ్డ వారిని తక్షణమే విడిచి పెట్టడానికి వీలుండదు. దీంతో నెలలు, ఏళ్ల తరబడి ఆ దేశ జైళ్లలో మగ్గుతూ ఉండాల్సిందే. ఈలోగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని వారి విడుదలకు కృషి చేయాల్సి ఉంటుంది. వీరి కృషి ఫలిస్తే నెలల వ్యవధిలోనే విడుదలవుతారు. లేనిపక్షంలో సంవత్సరాల కొద్దీ అక్కడి చెరశాలల్లోనే గడపాల్సి వస్తుంది. బంగ్లాదేశ్‌ కోస్టుగార్డుకు పట్టుబడిన వారిలో ఉత్తరాంధ్ర మత్స్యకారులు తొమ్మిది మందితో పాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మరో 14 మంది జాలర్లు కూడా ఉన్నారు. వీరంతా దాదాపు వంద రోజులుగా బంగ్లాదేశ్‌లోని భాగర్‌హాట్‌ జైలులోనే మగ్గుతున్నారు. దీంతో ఆయా బంధిత మత్స్యకార కుటుంబ సభ్యులు ఆందోళనతో ఉన్నారు. తమ వారు ఎప్పుడు విడుదలవుతారు? తమ ఇంటికి ఎప్పుడు చేరుకుంటారు? అంటూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

బంగ్లాదేశ్‌ జైలు వద్ద ఇరుదేశాల హైకమిషన్‌ అధికారులు

మత్స్యకారులను విడిపించేందుకు..
బంగ్లాదేశ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న మత్స్యకారుల విడుదలకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈస్ట్‌కోస్ట్‌ మెకనైజ్డ్‌ బోట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వాసుపల్లి జానకీరామ్‌ కృషి చేశారు. ఇప్పటికే గత నెలలో జానకీరామ్‌ బంగ్లాదేశ్‌ వెళ్లి ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయవాది మహ్మద్‌ రెహ్మాన్‌తో పాటు ఆ దేశంలో భారత విదేశాంగ శాఖ అధికారులతోను సమావేశమయ్యారు. మత్స్యకారుల విడుదలకు అవసరమైన పత్రాలను సమర్పించారు. ఈనెల 19న మరోసారి ఆయన బంగ్లాదేశ్‌కు వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉన్నారు.
ఎట్టకేలకు మత్స్యకారులకు విముక్తి..
బంగ్లాదేశ్‌ ప్రభుత్వం భారతీయ మత్స్యకారులు 23 మందిని మంగళవారం భాగర్‌హాట్‌ జైలు నుంచి విడుదల చేసింది. బంగ్లాదేశ్‌ హోం మంత్రిత్వశాఖ డిప్యూటి సెక్రటరీ మహ్మద్‌ హఫీజ్‌ అల్‌ అసాద్, భారత ప్రభుత్వం తరఫున డిప్యూటి హై కమిషన్‌ చంద్రజీత్, జైలు సూపరింటెండెంట్‌లు వీరి విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మత్స్యకారుల విడుదలకు సంబంధించిన పత్రాలను ఏపీ మత్స్యకార నాయకుడు జానకీరామ్‌తో కలిసి పూర్తి చేశారు. అనంతరం 23 మంది మత్స్యకారులను జైలు నుంచి విడుదల చేశారు.

మోంగ్లా పోర్టు వద్ద విడుదలైన మత్స్యకారులతో జానకీరామ్‌

అక్కడ నుంచి మోంగ్లా పోర్టుకు..
భాగర్‌హాట్‌ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మోంగ్లా పోర్టుకు తరలించారు. గతంలో పట్టుబడిన వీరి బోట్లు మోంగ్లా పోలీస్‌ స్టేషన్‌ కస్టడీలో ఉన్నాయి. వీటికి మరమ్మతులు చేస్తున్నారు. అనంతరం బుధవారం వీరిని బోట్లలో అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దుల్లోకి బంగ్లాదేశ్‌ కోస్టుగార్డు సిబ్బంది తీసుకెళ్లి భారత కోస్టుగార్డు సిబ్బందికి అప్పగిస్తారు. ఈ మత్స్యకారులు అక్కడ నుంచి బయల్దేరి నెలాఖరుకు విశాఖకు చేరుకుంటారు.
విడుదలకు కృషి చేసిన వారికి ధన్యవాదాలు..
బంగ్లాదేశ్‌ జైలు నుంచి ఉత్తరాంధ్ర మత్స్యకారుల విడుదలకు కృషి చేసిన బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి, అక్కడి జైలు అధికారులు, న్యాయవాదులు, భారత ప్రభుత్వానికి, వివిధ రాజకీయ పార్టీల నేతలకు మత్స్యకారుల తరఫున కృతజ్ఞతలు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ మత్స్యకారుల విడుదలకు చొరవ చూపడం గొప్ప విషయం. బాధిత మత్స్యకారులను తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడించాను. వారెంతో భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. తమ వారి రాకకోసం కళ్లు కాయలు కాసేలా వీరంతా ఎదురు చూస్తున్నారు’ అని ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న ఈస్ట్‌కోస్ట్‌ మెకనైజ్డ్‌ బోట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వాసుపల్లి జానకీరామ్‌ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధి’తో చెప్పారు.
Read More
Next Story