
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలు..
కర్నాటకలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తుమకూరు వైపు నుంచి వేగంగా వస్తున్న ఇండికా కారు.. డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. నెలమంగల సమీపంలోని జిందాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసం కాగా.. అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే మదనాయకనహళ్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నెలమంగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుల్లో ఇద్దరిని డొడ్డబళ్లాపురకు చెందిన హర్షిత్, నిఖిత్‌గా గుర్తించారు. మిగతా ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది. హర్షిత్ రాజానకుంటె సాయి విద్యా కళాశాలలో డిగ్రీ సెకండీయర్ చదువుతున్నాడు. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

