
ఘోర ప్రమాదం..ఐదుగురు కూలీల దుర్మరణం
అల్లూరి జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పరిధిలోని తుమ్మలవలస వద్ద భీభత్సమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో ప్రయాణిస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఘటన వివరాలు
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం చింతాడ గ్రామానికి చెందిన సుమారు 25 మంది కూలీలు అరకు ప్రాంతానికి కూలి పనుల కోసం వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి బొలెరో వాహనంలో స్వగ్రామానికి వస్తుండగా, తుమ్మలవలస సమీపంలోని మలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు వాహనం కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. సుమారు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సహాయక చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో అత్యధికంగా మహిళలు, యువకులు ఉన్నట్లు సమాచారం.
విషాదంలో చింతాడ గ్రామం
తమ గ్రామానికి చెందిన వారు ప్రమాదానికి గురయ్యారని తెలియడంతో విజయనగరం జిల్లా చింతాడలో విషాద ఛాయలు అలముకున్నాయి. చేతికొచ్చిన వారు విగతజీవులుగా పడి ఉండటంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి.
Next Story

