
అమరావతిలో గ్రామ కంఠాల రీసర్వే పై రైతుల ఆగ్రహం
అమరావతికి ల్యాండ్ పూలింగ్ సమయంలో గ్రామ కంఠ భూములను మినహాయించారు. ఇప్పుడు రైతుల నుంచి లాక్కుందామనే కుట్ర జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు తీవ్రమైన అసంతృప్తికి గురవుతున్నారు. గతంలో భూమి పూలింగ్ సమయంలో ఇచ్చిన మినహాయింపులను పునర్విచారణ చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జిఓ నెంబరు 50 ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఈ జిఓ ద్వారా రైతులను దోషులుగా చిత్రీకరించి, వారిని ఇబ్బందుల పాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో న్యాయమైనది ఇప్పుడు అన్యాయమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జీఓ 50 ఏమి చెబుతుంది?
ఈ ఏడాది జనవరి 23న జారీ అయిన ఈ జీఓ అమరావతి రాజధాని పరిధిలో భూమి పూలింగ్ సమయంలో మినహాయించిన గ్రామ కంఠాలు (విలేజ్ బౌండరీస్)ను పునర్విచారణ చేయాలని ఆదేశిస్తుంది. ముఖ్యంగా 2014 డిసెంబరు 8 నాటికి గ్రామ శివారులో ఉన్న గేదెల పాకలు, పొగాకు బ్యారన్లు, ఇతర నిర్మాణాలను మినహాయించి రైతులకు అదనపు భూమి ఇచ్చిన విషయాన్ని తిరిగి సర్వే చేయాలని పేర్కొంది. 10 సెంట్ల కంటే అధికంగా భూమి పొందిన 510 మంది రైతుల గ్రామ కంఠాలను రీసర్వే చేసి, స్పష్టమైన నివేదిక తయారు చేయాలని ఆదేశించింది. దీనికోసం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ ఆయా గ్రామాల్లో తిరిగి మినహాయించిన భూముల వివరాలను సేకరిస్తుంది.
ఈ జిఓ జారీ అనంతరం రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. గతంలో అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ) తీర్మానాల మేరకు మినహాయింపులు ఇచ్చినప్పుడు అది న్యాయమైన నిర్ణయమని ప్రభుత్వమే అంగీకరించింది. 2016-18 మధ్యలో ఈ మినహాయింపులు పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు అదే నిర్ణయాలను తిరగదోడటం ద్వారా రైతులను అవమానపరచడమేనని వారు ఆరోపిస్తున్నారు. ‘ప్రభుత్వమే మా భూములను పరిశీలించి మినహాయింపులు ఇచ్చింది. ఇప్పుడు పునర్విచారణ అంటే మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించాలనే ఉద్దేశమా?’ అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ జీఓ ద్వారా రైతులు అదనపు భూమి కాజేశారనే అభిప్రాయాన్ని సమాజంలో కలిగించి, వారిని మానసికంగా హింసించడమే లక్ష్యమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసి) ఆధ్వర్యంలో రైతులు పలు సమస్యలను లేవనెత్తుతున్న నేపథ్యంలోనే ఈ జిఓ జారీ అయినట్లు రైతులు భావిస్తున్నారు. రాజధాని నిర్మాణంలో రైతుల సమస్యలు పరిష్కారం కాకుండా, వారి గొంతు నొక్కేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ జీఓను తక్షణమే ఉపసంహరించుకోకపోతే, రైతులు మంత్రి నారాయణను కలిసి విన్నవించనున్నారు. లేకపోతే ఆందోళనల రూపంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ వివాదం రాజధాని అభివృద్ధిని మరింత ఆలస్యం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేకుంటే అమరావతి రాజధాని ఆశలు మరింత మందగించే ప్రమాదం పొంచి ఉంది.
రైతుల అభిప్రాయాలు
పి రామారావు, తుళ్లూరు.
‘జీఓ 50 అనేది భూములు ఇచ్చిన రైతులను ఇబ్బంది పెట్టేందుకు రూపొందించినది. గతంలో మా బ్యారన్లు, పాకలకు మినహాయింపు ఇచ్చి, భూమి అప్పగించారు. ఇప్పుడు పునర్విచారణ అంటే మమ్మల్ని అనుమానాస్పదులుగా చూడటమే. ఇది అన్యాయం. ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించకుండా, మా నోరు మూయించాలని చూస్తోంది. మేం వ్యతిరేకిస్తాం, అవసరమైతే ఆందోళన చేస్తాం.’
ఎం సీతమ్మ, మందడం.
‘మా రైతు కుటుంబాలను మానసికంగా కుంగదీసేందుకే ప్రభుత్వం ఈ జీవో ఇచ్చింది. భూములు ఇచ్చేటప్పుడు అంగీకరించి, పూలింగ్ పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు విచారణ అంటే ఏమిటి? మేం భూములు కాజేశామనే అభిప్రాయం కలిగించడమే లక్ష్యం. గతంలో అధికారులు ఆమోదించినవి ఇప్పుడు తప్పుగా చూపడం ఉద్దేశపూర్వకం. ప్రభుత్వం ఈ జిఓను రద్దు చేసి, మా సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే మేం సీఎం దృష్టికి తీసుకెళ్తాం.’

