
విశాఖ రోడ్లపై పోలీసు డ్రెస్‌తో లోచన్‌కుమార్
పోలీసు కల.. నకిలీ డీఎస్పీతో చెదిరిందిలా..!
పోలీసునంటూ ఎందరినో మోసం చేస్తున్న ఓ యువకుడు తొలుత పోలీసు, ఆపై డీఎస్పీ అవతారమెత్తి పట్టుబడ్డాడు. జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.
అతని తండ్రికి పోలీసు ఉద్యోగమంటే ఇష్టం. కానీ పోలీసు కాలేకపోయాడు. తండ్రి కోరికను తీరుద్దామనుకున్నాడేమో ఆ కొడుకు. కానీ పోలీసు పోస్టు సాధనకు అవసరమైన ప్రయత్నాలేమీ చేయలేదు. పిసరంత కష్టం లేకుండా అడ్డదారులను ఎంచుకుని నకిలీ పోలీసు అవతారమెత్తాడు. పోలీస్ యూనిఫాంతో హల్ చేశాడు. పోలీస్ ఉన్నతాధికారులతో ఫోటోలు దిగాడు. ఆ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలు చేశాడు. చివరకు డీఎస్పీ అవతారం కూడా ఎత్తాడు. ఎట్టకేలకు అదే పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. అనాలోచనల ఆ మోసగాడి పేరు చెల్లుబోయిన లోచన్‌కుమార్.
విశాఖ సీపీ బాగ్చీతో నకిలీ డీఎస్పీ లోచన్
పోలీసునంటూ పోలీసులనే బురిడీ కొట్టించి..
విశాఖపట్నంలోని అల్లిపురం భూపేష్‌నగర్ ప్రాంతానికి చెందిన లోచన్‌కుమార్ (26) తండ్రి రవిశంకర్ నేవల్ డాక్‌యార్డు ఉద్యోగి. తండ్రికి పోలీసు ఉద్యోగంపై మక్కువ ఉండేది. కానీ ఆ కోరిక నెరవేరలేదు. ఆ సంగతి తెలుసుకున్న కొడుకు లోచన్‌కుమార్ చదువు పూర్తయ్యాక ఉద్యోగ వేట మాని యూనిఫాం వేసుకుని పోలీసుగా విశాఖలో చలామణీ అయ్యేవాడు. అలా ఒకట్రెండు సార్లు పోలీసులకు చిక్కినా వారు తేలిగ్గా తీసుకుని వదిలేసేవారు. దీంతో లోచన్ తన ఆలోచనలకు మరింత పదును పెట్టాడు. పోలీసు అధికారులతో చనువు పెంచుకున్నాడు. వారితో కలిసి ఫోటోలు దిగేవాడు. పోలీసు వాహనాల్లోకి ఎక్కి మరీ ఫోటోలు తీసుకునే వాడు. పోలీసుల వైర్‌లెస్ సెట్‌లో మాట్లాడుతున్నట్టు, వారి తుపాకులను చేతబట్టి ఫోటోలకు ఫోజిచ్చేవాడు. విశేషమేమిటంటే.. లోచన్ విశాఖ నగర పోలీస్ కమిషనర్‌నూ వదలకుండా ఆయనతోనూ ఫోటో దిగాడు. తాను సేవారంగంలో ఉన్నానంటూ పోలీసులనూ బురిడీ కొట్టించేవాడు. అప్పటికే లోచన్‌కుమార్ నకిలీ పోలీసుగా రోడ్డెక్కి దొరికిపోయినా పోలీసులు పట్టించుకోకపోవడం విడ్డూరం.
పోలీసు తుపాకులు, వైర్‌లెస్ సెట్ ధరించి..
పోలీసులతో ఉన్న ఫోటోలనే చూపుతూ..
ఇలా పోలీసు అధికారులు, వాహనాలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసేవాడు లోచన్. దీంతో లోచన్ నిజంగానే పోలీసు ఉద్యోగం చేస్తున్నాడని చాలామంది భ్రమించారు. పోలీసు ఉన్నతాధికారులతో తనకు మంచి సంబంధాలున్నాయని, ఆ శాఖలో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు మొదలెట్టాడు. వారికి డీఐజీ పేరిట జారీ చేసిన నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లను కూడా పంపించేవాడు.
లోచన్‌కుమార్ ఇచ్చిన నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్
డీఎస్పీగా ఎంపికైనట్టు పత్రికలకూ బురిడీ..
లోచన్‌కుమార్ ఇటీవల విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో తాను డీఎస్పీగా సెలక్ట్ అయినట్టు ప్రకటించుకున్నాడు. తాను కష్టపడి ఈ ఉద్యోగాన్ని సాధించానంటూ ప్రముఖ పత్రికల్లో వేయించుకున్నాడు. తన కొడుకు నిజంగానే డీఎస్పీ అయ్యాడని భ్రమించిన ఆ తల్లిదండ్రులు స్వీట్లు తినిపించారు. చుట్టాలు బంధువులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. తన కలను కొడుకు సాకారం చేశాడంటూ తండ్రి మురిసిపోయాడు. గతంలో విశాఖ పోలీస్ కమిషనర్‌తో దిగిన ఫోటోను చూపించి తనను ఆయన అభినందించినట్టు ప్రచారం చేసుకున్నాడు. మరోవైపు లోచన్‌కుమార్ ప్రతిభావంతుడని భావించిన కొన్ని కోచింగ్ సంస్థలు మోటివేషన్ క్లాసులకు కూడా ఆహ్వానించాయి.
లోచన్ గురించి మీడియాకు వివరిస్తున్న విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ
మహిళ ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు..
ఇటీవల ఒక మహిళ పోలీస్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని లోచన్‌కుమార్ తన నుంచి రూ.11 లక్షలు వసూలు చేసి మోసం చేశాడని ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లోచన్ నెల్లూరు కోచింగ్ సెంటర్‌లో మోటివేషనల్ క్లాసులకు వెళ్లినట్టు గుర్తించి అక్కడే అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో లోచన్‌కుమార్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుకు గాని, డీఎస్పీగా గాని ఎంపికే కాలేదని నిర్ధారించారు. లోతుగా ఆరా తీస్తే లోచన్‌కుమార్‌పై విశాఖ ఎంవీపీ కాలనీ, మల్కాపురం, ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కటి, ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు మోసం కేసులు ఉన్నట్టు గుర్తించారు.
లోచన్‌కు మోసం తప్ప ఏమీ రాదుః సీపీ
‘లోచన్‌కుమార్‌కు మోసం తప్ప ఏమీ రాదు. ఒక అమ్మాయికి పోలీస్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.11 లక్షలు వసూలు చేసి మోసం చేశాడు. ఇప్పుడు డీఎస్పీ పోస్టు వచ్చినట్టు చెప్పుకుంటున్నాడు. ఇటీవల ఆ విషయాన్ని నేను పేపర్లలోనూ చూశాను. ఆయనపై ప్రస్తుతానికి ఐదు కేసులున్నాయి. నెల్లూరులో ఉన్న లోచన్‌ను తీసుకొచ్చాం. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం’ అని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ మీడియాకు చెప్పారు.
Next Story

