
‘ఫ్యాక్ట్ చెక్ తర్వాతే చర్యలు’
మహారాష్ట్ర మంత్రి జిర్వాల్ వీడియో వివాదంపై స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్
మహారాష్ట్రలో మంత్రి నరహరి జిర్వాల్‌కు సంబంధించిన వైరల్ వీడియోపై వివాదం చెలరేగింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం స్పందించారు. వీడియోలోని నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో, మంత్రి నరహరి జిర్వాల్ ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తితో కలిసి తన అధికార నివాసంలోని బెడ్‌రూమ్‌లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీడియో వైరల్ కావడంతో రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి వెంటనే స్పందించింది. జిర్వాల్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
ఇదిలా ఉండగా, జిర్వాల్ ఈ ఆరోపణలను ఖండించారు. పాత వీడియోలను కలిపి ఈ వీడియోను తయారు చేశారని ఆయన సీఎం ఫడ్నవిస్‌కు ఫోన్‌లో తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని కూడా కోరారు.
ఈ విషయంపై స్పందించిన సీఎం ఫడ్నవిస్.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని నేను సూచించాను,” అని చెప్పారు. అలాగే పార్టీ నాయకురాలు సునేత్రా పవార్తో కలిసి పరిస్థితులను సమీక్షించిన తర్వాత, వాస్తవాలు వెలుగులోకి వచ్చిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
గత రెండు నెలల్లో జిర్వాల్ రెండో వివాదం ఇది. ఫిబ్రవరిలో మంత్రాలయంలో ఒక క్లర్క్ రూ. 35వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ చేతిలో పట్టుబడిన ఘటన కూడా సంచలనం సృష్టించింది.
66 ఏళ్ల జిర్వాల్ నాసిక్ జిల్లా దిండోరి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మహారాష్ట్ర శాసనసభలో మాజీ ఉపసభాపతిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఎఫ్‌డీఏ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మొత్తంగా ఈ వీడియో వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజానిజాలు వెలుగులోకి వచ్చే వరకు ఈ వ్యవహారం మరింత వేడెక్కే అవకాశముంది.

