
ఆదివారం 17 మండలాల్లో తీవ్ర వడగాలు
రాష్ట్రంలోని 32 మండలాల్లో వడగాలు.. సోమవారం నుంచి ఉత్తరాంధ్రలో 3 రోజులు పిడుగుల వర్షాలు
రాష్ట్రంలో వాతావరణం మరోసారి ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఆదివారం (05-04-2026) రాష్ట్రంలోని 17 మండలాల్లో తీవ్ర వడగాలు, మరో 32 మండలాల్లో సాధారణ వడగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. అంతేకాకుండా సోమవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు వ్యక్తమయ్యాయి. దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించడం ఈ వాతావరణ మార్పులకు కారణమని సంస్థ తెలిపింది.
తీవ్ర వడగాలు ఎక్కడ ఎక్కడ?
శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, లక్ష్మీనర్సుపేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాలు, విజయనగరం జిల్లాలో గుర్ల, సంతకవిటి మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ, సీతంపేట మండలాలు, పోలవరం జిల్లాలో గంగవరం, కూనవరం మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం మండలంలోని పలు గ్రామాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో 2మండలాలు, విజయనగరంలో 8, మన్యం 9, పోలవరం 3, కాకినాడ 2, తూర్పుగోదావరి 2, ఏలూరు 3, ఎన్టీఆర్ 3 మండలాల్లో సాధారణ వడగాలు వీస్తాయని ప్రకర్ జైన్ తెలిపారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు ఈ వడగాల వల్ల ఎక్కువగా బాధపడవచ్చని, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థ సూచించింది.
సోమవారం నుంచి వర్షాలు.. పిడుగుల హెచ్చరిక
ఉత్తరాంధ్ర జిల్లాల్లో సోమవారం నుంచి మూడు రోజులపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. “చెట్ల క్రింద ఎంత మాత్రం నిలబడవద్దు. పిడుగులు పడే ప్రమాదం ఉంది” అని రైతులు, ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.
ఎండలు ఇంకా తీవ్రం.. గరిష్ట ఉష్ణోగ్రతలు
శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగింది. నెల్లూరు జిల్లా గూడూరులో 41.2° సెంటీగ్రేడ్, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.1°, కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 40.9°, చిత్తూరు జిల్లా నగరిలో 40.4°, మన్యం జిల్లా వీరఘట్టంలో 40.3° చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించవచ్చని విపత్తుల సంస్థ హెచ్చరించింది.
ప్రజలు ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి
డీహైడ్రేషన్‌ను నివారించడానికి ORS ప్యాకెట్లు, ఇంట్లో తయారుచేసిన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. మంచినీరు ఎక్కువగా తాగాలి. రైతులు పంటలు, పొలాల్లో తగిన చర్యలు తీసుకోవాలి.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 1070, 1077 హెల్ప్‌లైన్ నంబర్లకు సంప్రదించాలని కోరింది. వాతావరణ మార్పులు రాబోయే రోజుల్లో కూడా కొనసాగవచ్చని, ప్రజలు అప్పుడప్పుడు అప్‌డేట్స్ చూసుకోవాలని సంస్థ సూచించింది.

