ఐఏఎస్‌లకు పొడిగింపులు..ప్రొఫెసర్లకు వివక్షా?
x

ఐఏఎస్‌లకు పొడిగింపులు..ప్రొఫెసర్లకు వివక్షా?

ప్రభుత్వ డబుల్ స్టాండర్డ్స్‌పై హైకోర్టు ఆగ్రహం


ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వ్యవసాయ అనుబంధ వర్సిటీల పట్ల చూపుతున్న వివక్షపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ, ఏపీ ఫిషరీస్, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ వర్సిటీల్లోని ప్రొఫెసర్లకు కూడా అదే యూజీసీ స్కేల్, అవే అర్హతలు ఉన్నప్పుడు.. ఒకే రాష్ట్రంలో రెండు వేర్వేరు న్యాయాలు ఎలా ఉంటాయని న్యాయస్థానం నిలదీసింది. ఉన్నత విద్యాశాఖకు ఒక రూలు, మిగిలిన వర్సిటీలకు మరో రూలా? అంటూ ఘాటుగా ప్రశ్నించింది.

ఐఏఎస్‌లకు లేని అభ్యంతరాలు..ప్రొఫెసర్ల విషయంలో ఎందుకు

పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారులకు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ పొడిగింపులు ఇస్తున్న విషయాన్ని కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. పరిపాలనా అధికారులకు లేని అభ్యంతరాలు, విద్యాబోధనలో అపార అనుభవం ఉన్న ప్రొఫెసర్ల విషయంలో ఎందుకు వస్తున్నాయని నిలదీసింది. ఆర్థిక శాఖ అంగీకరించడం లేదన్న ప్రభుత్వ వాదనను ఆక్షేపిస్తూ, విద్యావేత్తల విషయంలో హేతుబద్ధత లేని నిర్ణయాలు తీసుకోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వొద్దు

వయసు పెంపుపై వర్సిటీల నుండి ఎటువంటి సిఫార్సులు రాలేదని ప్రభుత్వం చెప్పడాన్ని జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ మండవ కిరణ్మయిలతో కూడిన ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. వర్సిటీల నుంచి ఇప్పటికే సిఫార్సులు అందాయని, కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించవద్దని హెచ్చరించింది. ఈ మొత్తం వివక్ష వెనుక ఉన్న కారణాలను స్వయంగా వివరించాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ను ఆదేశిస్తూ, ఈ నెల 23న కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.

సింగిల్ జడ్జి తీర్పుపై ధర్మాసనం విచారణ

గతంలో సింగిల్ జడ్జి ఈ పదవీ విరమణ పెంపును ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంగా పేర్కొంటూ దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. అయితే, దీనిపై నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ఉద్యాన, వెటర్నరీ, అగ్రికల్చర్ వర్సిటీల ప్రొఫెసర్లు, డీన్లు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. సమానత్వపు హక్కును కాలరాస్తున్నారన్న పిటిషనర్ల వాదనలతో ఏకీభవిస్తూ, తాజా విచారణలో ధర్మాసనం ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది.

Read More
Next Story