కాలిఫోర్నియా కార్చిచ్చు.. గవర్నర్ పై ట్రంప్ చిందులు
అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య
లాస్ ఏంజెల్స్ లో చెలరేగిన దావానలం లో మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. తాజాగా అక్కడి అధికారులు 24 మంది మృత దేహాలను కనుగొన్నట్లు తెలిపారు. అయితే చాలామంది మిస్ అయినట్లు తమకు ఫిర్యాదు అందినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇప్పటికే 12000 భవనాలు కాలిబూడిద అయినట్లు తెలిసింది. అవన్నీ చాలా ఖరీదైన ఇళ్లు కావడంతో లక్షలాది డాలర్లు నష్ట వాటిల్లినట్లు స్థానిక ప్రభుత్వం వెల్లడించింది.
దావాగ్ని వ్యాపించడంతో 1.5 లక్షల మంది ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది. దాదాపు 57 వేల బిల్డింగుల నుంచి వీరందరిని తీసుకెళ్లినట్లు తెలిపింది. అయితే ఇంకా 1.66 లక్షల ప్రజలను తరలించాల్సి ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
లాస్ ఏంజెల్స్ ను తిరిగి నిర్మిస్తాం: కాలిఫోర్నియా గవర్నర్
ప్రముఖ నగరమైన లాస్ ఏంజెల్స్ కార్చిచ్చులో చిక్కుకుని నష్టానికి గురికావడంతో కాలిఫోర్నియా గవర్నర్ స్పందించారు. ‘ ఎల్ఏ(లాస్ ఏంజెల్స్) ను తిరిగి నిర్మిస్తాం’ అని కాలిఫోర్నియా గవర్నర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. కాలిఫోర్నియాలోని కార్చిచ్చుకు గురైన ప్రాంతాల్లో శిథిలాలను తొలగించడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేశానని గవర్నర్ న్యూసోమ్ చెప్పారు.
‘‘నేను దావాగ్నిని దూరం నుంచే చూశాం. ఇప్పుడే జరిగిన నష్టాన్ని అంచనా వేయలేము. కొంతకాలం పడుతుంది. ఇప్పుడిప్పుడే మేము కోలుకుంటున్నాం. కమ్యూనిటీలను పునర్మించడానికి, శిథిలాలను తొలగించడానికి 53 బృందాలను ఏర్పాటు చేశాం’’ అని గవర్నర్ గావిన్ న్యూసోమ్ మరో ఎక్స్ పోస్టులో రాశారు.
పొడిగాలులు..
కాలిఫోర్నియా ప్రాంతంలో పొడిగాలులు తీవ్రంగా వీస్తున్నాయని, దీనివల్ల లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో కార్చిచ్చు మరింతగా చెలరేగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంటలు వ్యాపించుకుండా ఫైర్ ఫైటర్లు రేయింబవల్లు శ్రమిస్తున్నారు. మరో వైపు వాయుమార్గంలోనే మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. గ్రౌండ్ సిబ్బంది చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పైపులతో మంటలను ఆర్పుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో పొడిగాలుల తీవ్రత పెరుగుతుందని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది. గాలులు తీవ్రత 30-70 ఎంపీహెచ్ మధ్య వేగం పుంజుకుంటాయని అంచనా వేసింది.
మార్షల్ ప్లాన్..
లాస్ ఏంజెల్స్ నగరాన్ని తిరిగి పున: నిర్మించడానికి మార్షల్ ప్లాన్ ను ప్రారంభిస్తామని గవర్నర్ న్యూసోమ్ చెప్పారు. ఎల్ఏ 2. 0 ను తిరిగి నిర్మించడానికి ఇప్పటికే ఓ బృందం సిద్ధంగా ఉందని గవర్నర్ చెప్పారు. ‘‘ లాస్ ఏంజిల్స్ కార్చిచ్చుతో పోరాడుతోంది. మంటలతో వీరోచితంగా పోరాడుతున్న అగ్నిమాపక సిబ్బందిలో కాలిఫోర్నియా ఆత్మ ప్రతిబింబిస్తోంది’’ అని న్యూసమ్ ఎక్స్ లో రాశారు.
ట్రంప్ చిందులు..
కాలిఫోర్నియాలో అధికారంలో ఉన్న డెమోక్రాటిక్ నాయకులు, అధికారులు మంటలను అదుపు చేయడంలో విఫలం అయ్యారని, ఇది అసమర్థత కారణంగా జరగుతోందని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు గుప్పించారు. వారు మంటలు ఆర్పలేరు.. ఎన్నికల్లో గెలవలేరు అని ట్రంప్ తన సొంత ఫ్లాట్ ఫాం ట్రూత్ లో రాసుకొచ్చారు.
Next Story