చదువు చెప్పిస్తాడన్న నమ్మకంతో పంపితే.. మా బిడ్డను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, చంపేశాడు. నమ్మించి గొంతు కోసిన ఆ మృగాడికి ఉరిశిక్ష వేయండి లేదా ఎన్‌కౌంటర్ చేయండి.. అప్పుడే మా బిడ్డ ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇది ఒక కన్నతండ్రి కడుపు కోత, ఒక కన్నతల్లి ఆవేదన. శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ చదువుతున్న గిరిజన బాలికపై జరిగిన అమానుష అకృత్యం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. అక్షరాలు నేర్పిస్తాడని నమ్మిన సివిల్ ఇంజినీర్ వెంకటరమణ.. ఆ పసిప్రాణాన్ని విశాఖ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పైశాచికంగా వేధించి, అత్యాచారం చేసి చివరకు ప్రాణం తీసిన తీరు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. నిందితుడికి ఉన్న రాజకీయ పలుకుబడి, ఆర్థిక బలంతో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని, పోస్టుమార్టం నివేదికను కూడా ప్రభావితం చేసే కుట్రలు సాగుతున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరగకపోతే తాము కూడా ఆత్మహత్యే శరణ్యమని ఆ తల్లిదండ్రులు చేస్తున్న ఆవేదనతో కూడిన హెచ్చరికలు ఇప్పుడు పోలీసు యంత్రాంగానికి పెను సవాలుగా మారాయి.
నమ్మించి నట్టేట ముంచిన వైనం
శ్రీకాకుళం జిల్లా హిరమండలం ప్రాంతానికి చెందిన ఒక నిరుపేద గిరిజన కుటుంబానికి ఆ అమ్మాయి ఏకైక కుమార్తె. అల్లారుముద్దుగా పెంచుకుంటూ, తన బిడ్డ గొప్ప చదువులు చదివి తమ తలరాత మారుస్తుందని ఆ తల్లిదండ్రులు కలలు గన్నారు. విజయనగరం జిల్లాలో ఇంటర్ చదువుతున్న ఆ బాలిక పరీక్షలు రాసి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో స్థానికంగా సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వెంకటరమణ అనే వ్యక్తి.. ఆ బాలికకు పాఠాలు చెబుతానని, చదువులో సహాయం చేస్తానని నమ్మబలికాడు. తన బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని భావించిన ఆ అమాయక తల్లిదండ్రులు, కంచే చేను మేస్తుందని ఊహించలేకపోయారు. విద్యావంతుడనే ముసుగులో ఉన్న ఆ మృగాన్ని నమ్మి బిడ్డను అప్పగించడం వారు చేసిన పాపమైంది. శ్రీకూర్మం సాక్షిగా మొదలైన మృగకాండ
ఈ నెల 22న బాలికను శ్రీకాకుళం తీసుకురావాలని నిందితుడు సూచించడంతో, తండ్రి స్వయంగా తన బిడ్డను వెంకటరమణకు అప్పగించారు. అయితే, నిందితుడు వ్యూహాత్మకంగా వారిని శ్రీకూర్మం రప్పించి, తండ్రిని వెనక్కి పంపేసి బాలికను తన వద్దే ఉంచుకున్నాడు. మరుసటి రోజు (ఈ నెల 23న) ఆ బాలికను విశాఖపట్నంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి పైశాచికంగా దాడి చేశాడు. ఆ మృగం చేసిన దాడికి ఆ పసి ప్రాణం విలవిలలాడిపోయింది. రక్షించమని వేడుకున్నా ఆ రాక్షసుడికి కనికరం కలగలేదు. సాక్ష్యాల చెరిపివేతకు డబ్బు ఎర
బాలిక పరిస్థితి విషమించడంతో, 24న ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి అనారోగ్యానికి గురైంది అంటూ అప్పగించాడు. అప్పటికే కొనఊపిరితో ఉన్న బాలికను చూసి నిందితుడు భయపడి.. నేనే తప్పు చేశాను, ఈ విషయం బయటకు చెప్పకుండా దహన సంస్కారాలు చేసేయండి, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అంటూ ఆ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. కన్నబిడ్డ చావుబతుకుల్లో ఉంటే ఆ నీచుడు సాక్ష్యాలను డబ్బుతో కొనాలని చూశాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఏకైక సంతానాన్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
పలుకుబడితో కేసు నీరుగార్చే ప్రయత్నం
ప్రస్తుతం ఈ కేసు సంచలన మలుపులు తిరుగుతోంది. నిందితుడు వెంకటరమణకు భారీగా రాజకీయ పలుకుబడి, ఆర్థిక బలం ఉండటంతో కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, నిందితుడి కుమార్తె ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో (GGH) వైద్యురాలిగా పనిచేస్తుండటంతో, పోస్టుమార్టం నివేదికను మార్చే అవకాశం ఉందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కూడా నిందితుడి అరెస్టుపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అధికారం ముందు అక్షరాల సాక్షిగా జరిగిన హత్య మరుగున పడిపోతుందా అన్న భయం వేధిస్తోంది. న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం
మా బిడ్డను చదువు చెప్పమంటే చంపేశాడు.. మాకు న్యాయం జరగాలి అని బాధితురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని లేదా ఎన్‌కౌంటర్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తమకు న్యాయం జరగకపోతే ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుంటామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అధికారం, డబ్బు ముందు ఒక పేద గిరిజన బిడ్డ మరణానికి న్యాయం దక్కుతుందో లేదోనని రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా చర్చ నడుస్తోంది. కన్నవారి కడుపు కోతకు వ్యవస్థ ఇచ్చే సమాధానం ఏమిటో వేచి చూడాలి.