
విజయవాడ కోడి పందేల బరుల వద్ద అదిరే ఆఫర్లు, ఆటలు
సంక్రాంతి సంబరాలు: రామవరప్పాడు, గుణదలలో కోడి పందేల జాతర హడావుడి
సంక్రాంతి పండుగ వేళ విజయవాడ శివారు ప్రాంతాలు సందడిగా మారాయి. ముఖ్యంగా రామవరప్పాడు రింగ్ రోడ్డు, గుణదల ఏరియాల్లో కోడి పందేల బరులు హైటెక్ హంగులతో ఏర్పాటు కావడం విశేషం. సాంప్రదాయక సంబరాలు, ఎమ్యూజ్‌మెంట్ స్టాల్స్, రకరకాల ఆటలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. వివిధ జూదపు ఆటల్లో డబ్బులు పెట్టే వారిలో కొందరు పోగొట్టుకుంటుండగా కొందరు వేలకు వేలు సంపాదిస్తున్నారు. గోదావరి జిల్లాల స్థాయికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే చట్టపరమైన ఆంక్షల మధ్య ఈ క్రీడలు కొనసాగుతున్నాయి.
భోగి పండుగ సందర్భంగా విజయవాడ రామవరప్పాడు బరిలో కోడి పందేలు
రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద సుమారు పదెకరాల విశాల స్థలంలో కోడి పందేలకు భారీ బరులు నిర్మించారు. చిన్న బరి, పెద్ద బరి అంటూ రెండు రకాలుగా ఏర్పాటు చేశారు. చిన్న బరులకు రూ.12 లక్షలు, పెద్ద బరులకు రూ.30 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి హైటెక్ గ్యాలరీలు, కుర్చీలు, స్టేజ్‌లు సిద్ధం చేశారు. కోడి పందేలు గెలిచిన వారికి బుల్లెట్ బండి వంటి బహుమతులు ప్రకటించారు. ఇక్కడి నిర్వాహకులు స్థానికులతో పాటు బయట ప్రాంతాల వారు కూడా ఉన్నారు. పోలీసులు వీరి వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. కోడి పందేలపై నిషేధం ఉన్నప్పటికీ సంప్రదాయం పేరుతో ఈ క్రీడలు జరుగుతున్నాయి.
గుణదల ఏరియాలోనూ కోడి పందేల బరులు కోలాహలంగా మారాయి. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి వీక్షిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో సంక్రాంతి కోడి పందాలు జరుగుతున్నాయి. కోడి పందాలు, కోత ముక్కలు వంటి సాంప్రదాయిక ఆటలతో పాటు హైటెక్ ఏర్పాట్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రేక్షకుల కోసం బరుల వద్దే ఆతిథ్య సౌకర్యాలు కల్పించారు. భోగి మంటలు, ముగ్గులు, పిండి వంటలు వంటి సంప్రదాయాలతో సంబరాలు మరింత రంగురంగుల్లా మారాయి.
జూదం స్టాల్స్ వద్ద ఆటలు ఆడుతూ వెయిటింగ్ లో ఉన్న కోడి పందేల ప్రేక్షకులు
సంక్రాంతి సంబరాల్లో ఎమ్యూజ్‌మెంట్ విభాగం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రేక్షకుల కోసం రకరకాల ఆటలు, జూదాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. గుండాట, రంగులాట, లోపబల బయట, చిన్న బజార్, పెద్ద బజార్, ఇతర ఆటలు జరుగుతున్నాయి. విజయవాడ వాసులు బరుల వద్దకు వెళ్లి వీక్షించడమే కాకుండా కోడి పందేలపై పై పందేలు కాస్తున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయని అంచనా. జబర్దస్త్ రాకెట్ రాఘవ వంటి కళాకారుల సందడి కూడా బరులను జాతరలా మార్చేస్తోంది. ఫోక్ ఆర్ట్స్, రూరల్ స్పోర్ట్స్, కల్చరల్ షోలు వంటివి సంక్రాంతి సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి.
కోడి పందేల్లో గెలిచిన వారికి ఆఫర్ లో ఇచ్చే బైక్
బరుల వద్ద వందల సంఖ్యలో స్టాల్స్ వెలిసాయి. ఒక్కో స్టాల్ వ్యాపారాన్ని బట్టి పది వేల నుంచి రూ. 50 వేల వరకు రోజుకు నిర్వాహకులకు చెల్లిస్తున్నారు. అలాగే కోళ్ల బరుల్లోనూ రూ. 10 నుంచి 20 వేల వరకు పెందెం రాయుళ్లు చెల్లించాలి. ఎక్కడి నుంచి వచ్చిన వారైనా పందేలు వేసుకోవచ్చు.
విజయవాడలో సంక్రాంతి సంబరాలు సంప్రదాయం, వినోదం, వివాదాల మధ్య కొనసాగుతున్నాయి. ప్రజలు ఈ సందర్భంగా సురక్షితంగా, సంతోషంగా పండుగ జరుపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

