రాజమహేంద్రవరం కల్తీ పాలలో ఇథైలిన్ గ్లైకాల్
x

రాజమహేంద్రవరం కల్తీ పాలలో ఇథైలిన్ గ్లైకాల్

నిందితుడైన పాల వ్యాపారి ప్రిజ్ నుంచి లీకైన విషం. తొమ్మిది మందిని బలితీసుకుంది.


ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో కల్తీ పాల వల్ల సంభవించిన మరణాలకు ప్రభుత్వం కారణాలు కనిపెట్టింది. ఐదుగురు వ్యక్తులకు సంబంధించిన రిపోర్టులు ప్రభుత్వానికి అందాయి.

ఫోరెన్సిక్ రిపోర్టులు, ఫైనల్ ఒపీనియన్

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL), రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (RFSL)ల నుంచి వచ్చిన ఐదు రిపోర్టులను పరిశీలించారు. ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం సత్యనారాయణ ఇచ్చిన ఫైనల్ ఒపీనియన్ ప్రకారం చనిపోయిన బాధితులు విషపూరితమైన ఇథైలిన్ గ్లైకాల్ (EG) కలిసిన కల్తీ పాలను తాగటం వల్ల acute renal failure (కిడ్నీ ఫెయిల్యూర్) సంభవించి, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు దారితీసి మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఒపీనియన్ ప్రకారం, ఇథైలిన్ గ్లైకాల్ ఒక విషపూరిత కూలెంట్. ఇది మిల్క్ చిల్లింగ్ యూనిట్‌లో లీక్ అవ్వడం వల్ల పాలలో కలిసింది. ఇది 3-4 రోజుల్లోనే తీవ్ర ఆరోగ్య సమస్యలు సృష్టిస్తుందని డా. సత్యనారాయణ ఒపీనియన్‌లో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ రిపోర్టులు విజయవాడ FSLలో పూర్తి చేసి, విషపదార్థాల స్థాయిని నిర్ధారించాయి.

దురంతం వెనుక కారణాలు

ఈ ఘటన వరలక్ష్మి డైరీ యూనిట్‌లో మిల్క్ చిల్లర్ రెఫ్రిజరేటర్‌లో ఇథైలిన్ గ్లైకాల్ లీక్ అవ్వడం వల్ల సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇథైలిన్ గ్లైకాల్ సాధారణంగా ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ చిల్లర్‌లలో ఉపయోగిస్తారు. కానీ మిల్క్ యూనిట్‌లలో దీని వాడకం అత్యంత ప్రమాదకరం. పాలు కల్తీ చేసే ప్రక్రియలో ఈ విషపదార్థం కలవడం వల్ల బాధితులు అనూరియా (మూత్ర విసర్జన ఆగిపోవడం), acute renal failureకు గురై, చివరికి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మరణించారు. ఫోమెపిజోల్ ఇంజెక్షన్ (ఇథైలిన్ గ్లైకాల్ విషానికి యాంటిడోట్)ను 8 మందికి ఇచ్చినప్పటికీ, వృద్ధులు, శిశువులు తీవ్ర ప్రభావానికి గురయ్యారు.

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన అడ్డాల గణేశ్వరరావు @ గణేష్ ( వయసు 37 సంవత్సరాలు) అను వ్యక్తి గత కొంతకాలంగా నరసాపురం గ్రామ చుట్టుపక్కల 43 మంది రైతుల వద్ద పాలను సేకరించి, వాటిని తన ఇంట్లో రెండు కంటైనర్లు గల ఫ్రీజర్ లో నిలువ చేసి, తర్వాత వాటిని క్యాన్లలోకి మార్చుకొని, రాజమహేంద్రవరం లాలాచెరువు పరిధిలోని చౌడేశ్వరనగర్, స్వరూప్‌నగర్ ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారికి ఈ పాలను గత కొంతకాలంగా సరఫరా చేస్తూ పాల వ్యాపారం చేస్తున్నాడు.

16.02.2026 తేదీ నుంచి 24.02.2026 తేదీ మధ్యలో సుమారు 20 మంది బాధితులు వివిధ ఆసుపత్రులలో చేరగా, వారిలో ఇప్పటివరకు 9 మంది మరణించారు. మిగిలిన 11 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

కల్తీ పాల వ్యవహారంపై మార్చి 7, 2026న ప్రభుత్వం విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్‌లో కొత్త మరణాలు లేదా అదనపు కేసులు నమోదు కాలేదు.

గతంలో కలెక్టర్ స్టేట్మెంట్...

మార్చి 3న విడుదలైన బులెటిన్ ప్రకారం ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇచ్చిన సమాచారంలో 13 మంది తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నారని, వారిలో ముగ్గురు శిశువులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)తో సమన్వయం చేసుకుని ల్యాబ్ రిపోర్టులు సేకరిస్తోంది. మరణాలకు కారణమైన విషపదార్థాలపై పూర్తి స్పష్టత కోసం హైదరాబాద్, కాకినాడ ల్యాబ్‌లకు శాంపిల్స్ పంపించారు. ఈ రిపోర్టులు ఇంకా పూర్తి కాలేదు. కానీ ప్రాథమిక పరిశీలనలో ఇథైలిన్ గ్లైకాల్ (ethylene glycol) కల్తీ అనుమానం బలపడింది.

డైయిరీ ఇండస్ట్రీలో సేఫ్టీ లోపాలు

ఈ దురంతం డెయిరీ ఇండస్ట్రీలో సేఫ్టీ స్టాండర్డ్స్ లోపాలను బయటపెట్టింది. అనధికారిక వెండర్లు ప్రమాదకర కెమికల్స్ ఉపయోగించడం, రెగ్యులర్ ఇన్‌స్పెక్షన్ లేకపోవడం ప్రధాన కారణాలు. ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినప్పటికీ, FSSAI ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యురియా, డిటర్జెంట్ వంటి సాధారణ కల్తీలకు మించి, ఇండస్ట్రియల్ కెమికల్స్ ప్రవేశం భవిష్యత్తులో మరిన్ని దురంతాలకు దారితీయవచ్చు. డైరీ యూనిట్‌లలో ప్రాపిలిన్ గ్లైకాల్ వంటి సేఫ్ కూలెంట్స్ వాడకం, రెగ్యులర్ టెస్టింగ్‌ను అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటన పాల సరఫరా చైన్‌లో సమూల మార్పులకు నాంది పలకాలి.

Read More
Next Story