పదేళ్లలో పర్యావరణ నష్టం రూ.లక్ష కోట్లా?
x
విశాఖలో మీడియాతో మాట్లాడుతున్న బొలిశెట్టి సత్యనారాయణ

పదేళ్లలో పర్యావరణ నష్టం రూ.లక్ష కోట్లా?

గడచిన దశాబ్దకాలంలో కాలుష్యం వల్ల తలెత్తిన పర్యావరణ నష్టం రూ.లక్ష కోట్లకు పైనే ఉంటుందని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ చెప్పారు.

కార్పొరేట్‌ సంస్థల స్వల్ప లాభాల కోసం రూ.లక్షల కోట్ల సముద్ర సంపద బలి అవుతోందని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు తీరప్రాంతాన్ని చుట్టుముట్టిన కాలుష్య ముప్పునకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. పదేళ్లలో ప్రభుత్వ యంత్రాంగం పర్యావరణ విషయంలో చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టారు. ఇటీవలే జనసేన పార్టీ నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించిన బొలిశెట్టి.. శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే?

స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించాలి..
తీర ప్రాంత విధ్వంసాన్ని అంచనా వేసి లెక్కకట్టడానికి స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించాలి. మేధావులు, పర్యావరణ ప్రేమికుల సూచనలతో వైజ్ఞానిక తనిఖీకి పక్షపాతం లేకుండా ఉండటానికి ఈ కమిటీలో స్వతంత్ర శాస్త్రవేత్తలు, పర్యావరణ ఆర్థిక వేత్తలు మాత్రమే ఉండాలి. ఇందులో ప్రభుత్వ అధికారులను మినహాయించాలి. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ వీవీఎస్‌ శర్మ వ్యాఖ్యల ప్రకారం.. రూ.వందల కోట్ల పారిశ్రామిక లాభాల కోసం రూ.లక్షల కోట్ల విలువైన సముద్ర జీవవైవిధ్యాన్ని, పర్యావరణ సేవలను కోల్పోతున్నాం. ప్రస్తుత పారిశ్రామిక నమూనా కేవలం కాలుష్య కారకమే కాకుండా రాష్ట్ర శాశ్వత సహజ సంపదను కార్పొరేట్‌ సంస్థల స్వల్పకాలిక ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నట్టు స్పష్టమవుతోంది.
పర్యావరణ నష్టం రూ.లక్ష కోట్లకు పైనే..
దశాబ్ద కాలంలో జరిగిన మొత్తం పర్యావరణ నష్టాన్ని ఈ కమిటీ అంచనా వేయాలి. సముద్ర పర్యావరణం, ప్రజారోగ్యం, జీవనోపాధికి జరిగిన నష్టం కనీసం రూ.లక్ష కోట్ల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా. పర్యావరణ పునరుద్ధరణ కోసం జీవీఎంసీ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి వంటి బాధ్యతాయుత సంస్థలను ఆర్థికంగా జవాబుదారీలను చేయాలి..
ఇంటికో క్యాన్సర్‌ పేషెంట్‌..
ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నిర్వహించిన సమీక్షా సమావేశంలో విశాఖ జిల్లా తాడి తదితర గ్రామాల్లో కాలుష్యం కారణంగా అక్కడ ప్రతి ఇంట్లోనూ ఒక క్యాన్సర్‌ రోగి ఉన్నట్టు పేర్కొన్నారు. ఇంకా ఆ గ్రామాల నివాసితులు దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, గర్భస్రావాల పెరుగుదల, భూగర్భ జలాలు కలుషితం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం స్వచ్ఛమైన పర్యావరణంతో జీవించే హక్కు, ఆర్టికల్‌ 48ఏ ప్రకారం పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత, ఆర్టికల్‌ 51ఏ(జి) ప్రకారం అడవులు, సరస్సులు, నదులను సంరక్షించడం పౌరుని ప్రాథమిక బాధ్యత
దశాబ్ద కాలంగా వంచన..
కాలుష్యంపై దశాబ్దకాలంగా వంచన జరుగుతోంది. పదేళ్లుగా జీవీఎంసీ ప్రతి రోజూ దాదాపు 200 మిలియన్‌ లీటర్ల శుద్ధి చేయని మురుగునీటిని సముద్రంలోకి వదులుతోంది. 2020 నుంచి నేటి వరకు ఒక్క చుక్క మురుగు నీటిని కూడా తగ్గించలేదు. ఈ స్థానాల్లో ఉన్న అధికారులకు ఎందుకు జరిమానా విధించ కూడదు? జీవీఎంసీ గతంలో ఇచ్చిన అఫిడవిట్లనే కాపీ పేస్ట్‌ చేసి కోర్టును కాలయాపన చే స్తోందని తప్పుదోవ పట్టిస్తోంది. మురుగు నీటి శుద్ధి సామర్థ్యంలో పురోగతి లేదని దాచిపెట్టడానికి డిసెంబర్‌ 2020 నాటి సీల్స్, డేటాను ఇప్పటికీ వాడుతున్నారు. కోర్టు నియమించిన అమికస్‌ క్యూరీ కూడా తన పాత్రకు న్యాయం చేయలేకపోతున్నారు. కాలుష్యానికి సంబంధించిన ఆధారాలను (జీపీఎస్‌ ట్యాగ్‌ ఉన్న ఫోటోలు, వీడియోలు) తన మెయిల్ bolisettisatyanarayana@gmail.com కు పంపితే వీటిని తన పిల్‌లో సాక్ష్యాలుగా పొందుపరుస్తాను’ అని బొలిశెట్టి సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Read More
Next Story