Rowdy Sheeter Nagendra
x
నిందితుడు నాగేంద్రను (మధ్యలో సర్కిల్ చేసిన వ్యక్తి) హిందూపురం ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

'రౌడీ కవాడీ' కన్నేస్తే రేప్.. కత్తి ఎత్తితే హత్య!

ఆపరేషన్ చిలమత్తూరు: తెల్లవారుజామున 'వేట'


సమయం: తెల్లవారుజామున 5:10 గంటలు
ప్రాంతం: చిలమత్తూరు పోలీస్ స్టేషన్
చుట్టూ గాఢాంధకారం.. చలి వణికిస్తోంది. స్టేషన్‌లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కినుకు తీస్తున్న సమయంలో టేబుల్‌పై ఉన్న ఫోన్ ఒక్కసారిగా మ్రోగింది. అవతలి వైపు నుంచి గొంతులో వణుకు, భయం.. "సార్.. వాడు వచ్చాడు! చిలమత్తూరు అటవీ ప్రాంతంలోని పాత బీకనపల్లి కొట్టాల వైపు నాగేంద్ర కదలికలు ఉన్నాయి.. చేతిలో ఆయుధాలు ఉన్నాయి!" ఆ ఒక్క సమాచారంతో స్టేషన్ అంతా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది.

నిన్న తెల్లవారుజామున ఈ సమాచారం అందిన 20 నిమిషాల్లోనే సీఐ ఆంజనేయులు, ఎస్సై మునీర్ అహ్మద్ తన టీమ్‌తో రంగంలోకి దిగారు. కవాడి నాగేంద్ర.. ఆ పేరు వింటేనే ఆ ప్రాంతంలో అత్తాకోడళ్లపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన గుర్తొచ్చి జనం ఒళ్లు జలదరిస్తుంది. 70 కేసుల్లో నిందితుడు, 40 సార్లు పోలీసుల కళ్లు గప్పినవాడు.. ఈసారి చిక్కితే వదలకూడదని పోలీసులు శపథం పూనారు.
జీపులు అడవి అంచున ఆగిపోయాయి. అక్కడి నుంచి సైలెంట్‌గా గాలింపు మొదలైంది. పొగమంచు కమ్మేయడంతో దారి సరిగ్గా కనిపించడం లేదు. పొదల్లో ఏదో శబ్దం.. "ఎవరు అక్కడ?" అని కానిస్టేబుల్ రవి కుమార్ గట్టిగా అరిచాడు. ఒక్కసారిగా పొదల్లోంచి చిరుతపులిలా ఒక నీడ దూసుకొచ్చింది. అది మరెవరో కాదు.. కవాడి నాగేంద్ర!
కత్తితో దాడి.. రక్తసిక్తమైన అడవి
"లొంగిపో నాగేంద్రా.. చుట్టూ పోలీసులు ఉన్నారు!" అని సీఐ హెచ్చరించారు. కానీ నాగేంద్ర కళ్లలో క్రౌర్యం తాండవిస్తోంది. "నన్ను పట్టుకోవడం ఎవరి తరం కాదు" అంటూ తన వద్ద ఉన్న పదునైన కత్తిని తీసి నేరుగా కానిస్టేబుల్ రవి కుమార్‌పై దాడి చేశాడు. రవి ఎడమ చేతికి తీవ్ర గాయమై రక్తం చిందింది. వాడు తప్పించుకుని పారిపోవడానికి రాళ్లు రువ్వుతూ అడవిలోకి పరిగెత్తాడు.
బుల్లెట్ గర్జించింది!
"ఆగు నాగేంద్రా! లేదంటే కాల్చాల్సి వస్తుంది!" సీఐ చివరి హెచ్చరిక చేశారు. అయినా వాడు వినలేదు. ఆత్మరక్షణ కోసం, ఒక ప్రమాదకరమైన నేరస్థుడు తప్పించుకోకూడదనే ఉద్దేశంతో సీఐ తన సర్వీస్ రివాల్వర్‌కు పని చెప్పారు.

'ఢాం.. ఢాం..' అని రెండు శబ్దాలు అడవిని ప్రతిధ్వనించాయి.
నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వెళ్లిన బుల్లెట్లు నాగేంద్ర కాళ్లను తాకాయి. అంతే.. అప్పటిదాకా సింహంలా గర్జించిన రౌడీ కవాడీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అత్తాకోడళ్లపై అఘాయిత్యం చేసిన పాపిష్టి కాళ్లు నేల మీద అచేతనంగా పడిపోయాయి.
శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 70 కేసుల మోస్ట్ వాంటెడ్ నేరస్థుడి ఆట ముగిసింది. రక్తమోడుతున్న నాగేంద్రను, గాయపడిన కానిస్టేబుల్‌ను హుటాహుటిన హిందూపురం ఆస్పత్రికి తరలించారు.
ఎవరీ కవాడి నాగేంద్ర?
హిందూపురం ప్రాంతానికి చెందిన కవాడి నాగేంద్ర అంటేనే నేరాలకు కేరాఫ్ అడ్రస్. ఇతనిపై ఉన్నవి ఒకటి రెండు కాదు, ఏకంగా 70 కేసులు. ఇందులో హత్యలు, దొంగతనాలు, దోపిడీలతో పాటు అత్యంత కిరాతకమైన సామూహిక అత్యాచార కేసులు ఉన్నాయి.
2024 అక్టోబర్ 12న చిలమత్తూరు మండలం దేపలొడ్డి వద్ద ఒక ఫ్యాక్టరీలో పనిచేసే కుటుంబంపై దాడి చేసి, అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్‌పై వచ్చిన నాగేంద్ర, కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతూ మళ్లీ నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు.
పోలీసులతో సత్ సంబంధాలు..
డబ్బుతో ఏదైనా చేయవచ్చుననే ధీమా నాగేంద్రది. ఎంతటి కేసులో నుంచైనా ఇట్టే బయటపడగల సామర్థ్యం, పోలీసులతో సంబంధాలు ఉన్నాయి. విచ్చలవిడిగా లంచాలు ఇవ్వగలడు. పోలీసుల్ని తన దారికి తెచ్చుకోగలడు. కర్నాటక, ఆంధ్రా సరిహద్దుల్లో ఇతని అడ్డా ఉండడంతో చిన్న చిన్న ప్రలోభాలకు సైతం పోలీసులు తేలిగ్గా లొంగిపోయేవారు. ఇతని అండ ఉండే చాలన్న విధంగా పోలీసులు వ్యవహరించేవారు. అందువల్లే అతను ఇంతకాలం తప్పించుకుతిరగగలిగాడు. నాగేంద్ర బాబాయి కూడా ఓ చిన్న సైజు రౌడీ షీటరే. హిందూపురం సహా అనేక చోట్ల వీళ్ల స్థావరాలు ఉన్నాయి. అక్రమంగా ఆయుధాలు సంపాయించి జనాన్ని ప్రత్యేకించి తాను టార్గెట్ చేసిన వారిని కొల్లగొట్టడం ఇతని నైజం.
నేరాల చరిత్ర.. పొంచి ఉన్న శిక్ష!
నాగేంద్రపై గతంలోనే తన స్నేహితుడిని హత్య చేసిన కేసు ఉంది. గంజాయి రవాణాలోనూ ఇతగాడు ఆరితేరినవాడు. ఇన్ని నేరాలు చేస్తున్నా ఇన్నాళ్లూ తప్పించుకోవడానికి కొందరు లోకల్ నెట్‌వర్క్ సహకారం ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే, ఈసారి పోలీసులు పక్కా వ్యూహంతో 'ఆపరేషన్ నాగేంద్ర'ను విజయవంతం చేశారు.
Read More
Next Story