
Ajit pawar Family (file)
ముగిసిన శకం: 8 సార్లు డెప్యూటీ సీఎం.. అప్రతిహత విజేత.. అజిత్ పవార్
మహారాష్ట్ర రాజకీయ క్షేత్రంలో అజిత్ పవార్ ఒక అధ్యాయం కాదు.. ఒక శకం
మహారాష్ట్ర రాజకీయాల్లో 'దాదా' (పెద్దన్న) గా పేరున్న అజిత్ అనంత్‌రావు పవార్ మరణంతో మరఠా రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్టైంది. బారామతి నియోజకవర్గ రూపురేఖలను మార్చిన 'శిల్పి'గా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. ఆయన రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ, రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకుంది.
అజిత్ పవార్ వ్యక్తిగత వివరాలు...
అజిత్ అనంత్‌రావు పవార్ 1959 జూలై 22న మహారాష్ట్ర లోని అహ్మద్‌నగర్ జిల్లా దేవ్‌లాలీ ప్రవర లో జన్మించారు. 28 జనవరి 2026న బారామతి విమానాశ్రయం వద్ద జరిగిన ప్రమాదంలో మరణించారు. ఎస్.ఎస్.సి (10వ తరగతి) వరకు బారామతిలో చదివారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతల వల్ల కళాశాల విద్యను మధ్యలోనే ఆపివేశారు.
అజిత్ పవార్ ప్రముఖ రాజకీయ కుటుంబం నుండి వచ్చారు. ఆయన రాజకీయ గురువు, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ స్వయానా ఈయనకు పెదనాన్న. తండ్రి అనంత్‌రావు పవార్. ఈయన ప్రముఖ సినీ నిర్మాత వి.శాంతారాం వద్ద రాజ్‌కమల్ స్టూడియోస్‌లో పనిచేశారు. తల్లి ఆశాతాయ్ పవార్.
అజిత్ భార్య సునేత్రా పవార్ ఈమె ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. సామాజిక కార్యకర్తగా, విద్యా సంస్థల ట్రస్టీగా గుర్తింపు పొందారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పార్థ్ పవార్. రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు (2019లో మావల్ నుండి లోక్‌సభకు పోటీ చేశారు), జయ్ పవార్ వ్యాపార రంగంలో ఉన్నారు.
ఆయన సోదరుడు శ్రీనివాస్ పవార్ (వ్యాపారవేత్త). కజిన్: సుప్రియా సూలే (శరద్ పవార్ కుమార్తె, బారామతి ఎంపీ).
రాజకీయ ప్రస్థానం (Political Career)
అజిత్ పవార్ తన రాజకీయ ప్రయాణాన్ని సహకార రంగం ద్వారా ప్రారంభించి, అడ్మినిస్ట్రేషన్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు. 1982లో ఒక సహకార చక్కెర కర్మాగారం బోర్డు సభ్యునిగా ఎన్నికయ్యారు.
లోక్‌సభ (1991): బారామతి నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు.
ఎమ్మెల్యేగా (1991 - 2026): బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
రికార్డు స్థాయిలో ఉప ముఖ్యమంత్రి
మహారాష్ట్ర చరిత్రలో 8 సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు. పృథ్వీరాజ్ చవాన్, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే క్యాబినెట్లలో ఆయన డెప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
నిర్వహించిన మంత్రిత్వ శాఖలు: ఆర్థికం, ప్రణాళిక, నీటి పారుదల వంటి కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించి, "అడ్మినిస్ట్రేటివ్ మాస్టర్" గా గుర్తింపు పొందారు.
రాజకీయ మలుపులు
పార్టీ విభజన: జూలై 2023లో తన పెదనాన్న శరద్ పవార్‌తో విభేదించి, ఎన్సీపీ (NCP) లోని మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ-శివసేన కూటమిలో చేరారు. అనంతరం ఎన్నికల సంఘం ఆయన వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించింది.
దాదా మార్క్..
అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక 'శూన్యాన్ని' మిగిల్చింది. ఆయన కేవలం ఒక నాయకుడిగానే కాదు, ఒక గొప్ప 'అడ్మినిస్ట్రేటర్' గా గుర్తింపు పొందారు. బారామతిని ఒక సామాన్య కుగ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయి అభివృద్ధికి చిరునామాగా మార్చిన 'ఆధునిక శిల్పి' ఆయన.
రాజకీయ ఎత్తుగడలు, సిద్ధాంతాల పక్కన పెడితే.. రాష్ట్రం ఒక సంక్షోభంలో ఉన్నప్పుడు అందరూ మొదట గుర్తుచేసుకునేది అజిత్ పవార్ కార్యదక్షతనే. జనవరి 28, 2026న జరిగిన ఆ విమాన ప్రమాదం ఒక వ్యక్తిని మాత్రమే బలి తీసుకోలేదు, మహారాష్ట్ర ప్రగతి రథానికి ఒక చక్రం విరిగిపోయినట్లయింది. ఆయన భౌతికంగా దూరమైనా, బారామతి రన్-వే పక్కన ఉన్న ప్రతి ప్రాజెక్టులోనూ, సచివాలయంలో ఆయన చేసిన ప్రతి ఫైలుపై సంతకంలోనూ 'దాదా' ముద్ర ఎప్పటికీ సజీవంగా ఉంటుంది.
"మహారాష్ట్ర రాజకీయ క్షేత్రంలో అజిత్ పవార్ ఒక అధ్యాయం కాదు.. ఒక శకం" అని స్థానికులు కంటతడిపెడుతున్నారు.
Next Story

