‘సోరోస్’ కు యూఎస్ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానంపై వివాదం ఎందుకు?
x

‘సోరోస్’ కు యూఎస్ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానంపై వివాదం ఎందుకు?

తీవ్రంగా వ్యతిరేకించిన మస్క్, రిపబ్లిక్ పార్టీ నాయకులు, ‘మగా’ మద్ధతుదారులు


పదవీ విరమణ చేయడానికి కొన్ని రోజులు ముందు జో బైడెన్ వరుసగా వివాదాస్పద నిర్ణయాల్లో జోరు ప్రదర్శిస్తున్నారు. తమ దేశానికి సేవలు చేసినందుకు గానూ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన కీలక నేత మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరి క్లింటన్, ఫుట్ బాల్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ, వివాదాస్పద జార్జ్ సోరోస్, నటుడు డేంజెల్ వాషింగ్టన్ సహ 19 మందికి అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ‘‘యూఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం’’ అందజేశారు.

‘‘అమెరికా సంస్కృతిని పెంపొందించడానికి పవిత్రమైన కృషి అందించిన అసాధారణ వ్యక్తుల సమూహానికి మనదేశపు అత్యున్నత పౌర గౌరవం అయినా మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ను అందించిన గౌరవం నాకు దక్కింది’’ అని వైట్ హౌజ్ లోని ఈస్ట్ రూమ్ లో జరిగిన కార్యక్రమంలో బైడెన్ అన్నారు.
ఈ వేడుకకు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తో పాటు పలువురు ప్రముఖులతో పాటు ఆయన క్యాబినేట్ లోని పలువురు హజరయ్యారు.
యూఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం అంటే ఏమిటీ?
యునైటెడ్ స్టేట్స్ శ్రేయస్సు, విలువలు, భద్రత, ప్రపంచశాంతి ఇతర ముఖ్యమైన ప్రభుత్వ లేదా ప్రైవేట్ ప్రయత్నాలకు తమ వంతు కృషి అందించిన వ్యక్తులకు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అందించాలని నియమం ఉంది. ఈ అవార్డును మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ 1963 లో ప్రారంభించారు. ఇంతకుముందు 1945 లో హ్యారీ ఎస్ ట్రూమన్ పౌర సేవల కోసం ఓ అవార్డును స్థాపించారు. తరువాత ఇది మారింది.
యునైటెడ్ స్టేట్స్ భద్రత, జాతీయ ప్రయోజనాలకు లేదా ప్రపంచ శాంతికి లేదా సాంస్కృతిక లేదా ఇతర ముఖ్యమైన పనులు చేసిన వ్యక్తులకు అవార్డు అందజేయడానికి అధ్యక్షుడికి సంపూర్ణ అధికారం ఉంటుంది.
ఈ పతకం ఎరుపు రంగులో 13 బంగారు నక్షత్రాలు ఉండి, వాటి చుట్టూ నీలిరంగూ వృత్తం ఉంటుంది. మధ్యలో ఐదు బంగారు ఈకలతో కూడిన పెంటగాన్ ఉంటుంది. ఈ మెడల్ కోసం అధికారిక ప్రక్రియ అంటూ ఏదీ ఉండదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 11515(మార్చి 13, 1970) ప్రకారం దీనిపై ప్రెసిడెంట్ కు విస్తృత అధికారం ఉంది.
రాష్ట్రపతికి సిఫార్సు చేయబడిన వ్యక్తికి, లేదా తను స్వయంగా ఎంపిక చేసిన వ్యక్తికి ఈ అవార్డు అందజేస్తారు. ఇది కేవలం పౌర పురస్కారం మాత్రమే కాదు.. సైనిక సిబ్బందికి కూడా ప్రదానం చేస్తారు. సైనికులు యూనిఫాంలో ఈ అవార్డును స్వీకరించవచ్చు. ప్రపంచంలోని ఏ వ్యక్తుల కైనా ఇది ప్రదానం చేయవచ్చు.
జార్జ్ సోరోస్ కి ఎందుకు..?
వివాదాస్పద ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జార్జ్ సోరోస్ కు సైతం ఈ అవార్డును ప్రదానం చేశారు. ‘‘ హంగేరిలోని ఓ యూదు కుటుంబంలో జన్మించిన సోరోస్, నాజీల నుంచి తప్పించుకున్నాడు. ’’ స్వేచ్చా జీవితం కోసం కృషి చేశాడు. వైట్ హౌజ్ ప్రకారం.. 120 కంటే ఎక్కువ దేశాల్లో అనేక ప్రాజెక్ట్ లు, నెట్ వర్క్ ల ద్వారా ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, విద్య, సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయడానికి కార్యక్రమాలు నిర్వహించారు.
‘‘గత 40 సంవత్సరాలుగా స్వేచ్చ కోసం అనేక మంది వ్యక్తుల తరఫున పోరాడిన నేను ఈ అవార్డును స్వీకరిస్తున్నాను’’ అని ఆయన అన్నారు. తన తండ్రి తరఫున ఈ అవార్డు అందుకున్న కుమారుడు అలెక్స్ మాట్లాడుతూ.. తన తండ్రి అమెరికా దేశ భక్తుడని, స్వేచ్ఛ, మానవ హక్కుల కోసం తన జీవితాన్ని గడిపారని అన్నారు.
వివాదం ఎందుకు?
జార్జ్ సోరోస్ కు అవార్డు ఇవ్వడం పై అమెరికాలోనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో ‘‘ జో బైడెన్, సోరోస్ కు అవార్డు ఇవ్వడం ఓ హస్యాస్పదం’’ అని పోస్ట్ చేశారు. అలాగే పలువురు రిపబ్లికన్ పార్టీ నాయకులు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA) మద్ధతుదారులు కూడా సోరోస్ కు అవార్డు ఇవ్వడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు.
జో బైడెన్ తన పదవీకాలంలో అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో హంతకులకు శిక్షలు తగ్గించడం, సొంత కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించడం సహ ఇప్పుడు సోరోస్ అవార్డు వంటి నిర్ణయాలు తీసుకున్నారని వారి వాదన. తన పదవీకాలం కేవలం 15 రోజులు ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటనీ నిక్కి హేలీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
మెంటానా సెనేటర్ టీమ్ మాట్లాడుతూ.. జార్జ్ సోరోస్ సాఫ్ట్ క్రైమ్ రాజకీయ నాయకులను రాజకీయ పీఠం అధిష్టించడానికి మిలియన్ల కొద్ది డాలర్లను ఖర్చు చేశారు. ఇలాంటి నాయకులు మా ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించడానికి వీలు కల్పించిందన్నారు.
భారత్ లోనూ సోరోస్ పై వ్యతిరేకత ఎందుకు?
అమెరికాలో అధికారంలోకి వచ్చిన రిపబ్లిక్ పార్టీ జార్జ్ సోరోస్ పై చాలాకాలంగా అనేక ఆరోపణలు గుప్పించింది. డీప్ స్టేట్ లో భాగంగా రెజిమ్ ఛేంజ్ ద్వారా ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు చేశారని విమర్శలు గుప్పిస్తోంది. అలాగే భారత్ లో గత నెలలో సోరోస్ పై పెద్ద ఎత్తున అధికార పార్టీ విమర్శలు గుప్పించింది.
రాహుల్ గాంధీతో కలిసి దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని దించడానికి ప్రయత్నించారని కాషాయ పార్టీ ఆరోపించింది. ‘ విదేశీ శక్తులతో చేతులు కలిపి దేశాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ’ కమల దళం ఘాటైన విమర్శలు చేసింది. దీనిపై కాంగ్రెస్ ఎదురుదాడి చేసిన ఫలితం లేకుండా పోయింది. అయితే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కార్యక్రమాలు హంగేరీ, రష్యాలో నిషేధించారు.


Read More
Next Story