
వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్: ఈసీ కీలక నిర్ణయం
ఇద్దరి ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటలకే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని ఇద్దరు అగ్రశ్రేణి అధికారులను వారి పదవుల నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తి, హోం కార్యదర్శి జగదీష్ ప్రసాద్ మీనాను వారి పదవుల నుంచి తప్పించింది.
1993 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి దుష్యంత్ నారియాలాను రాష్ట్ర కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అదే సమయంలో నందిని చక్రవర్తిని ఎన్నికలకు సంబంధించిన అన్ని విధుల నుంచి దూరంగా ఉంచాలని ఆదేశించింది.
కొత్త ప్రిన్సిపల్ సెక్రటరీగా ఘోష్..
అలాగే 1997 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి సంఘమిత్ర ఘోష్‌ను రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ, జగదీష్ ప్రసాద్ మీనా స్థానంలో బాధ్యతలు అప్పగించింది.
మమతా ప్రభుత్వానికి ఈసీ లేఖ..
ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. బదిలీ చేసిన అధికారులను ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి పోస్టుల్లోనూ నియమించరాదని కమిషన్ పేర్కొంది. కొత్తగా నియమితులైన అధికారులు సోమవారం మధ్యాహ్నం 3 గంటలలోపు తమ తమ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించినట్లు నివేదిక ఇవ్వాలని కూడా ఎన్నికల సంఘం కోరింది.
రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న S.I.R ప్రక్రియపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సంఘంపై నిరంతరం విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఎన్నికల సమయంలో పాలనలో నిష్పాక్షికతను కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 23 మరియు 29 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

