ఈనాడు ఒక ప్రయోగశాల
x

ఈనాడు ఒక ప్రయోగశాల

వార్తకు విశ్వసనీయత పెంచిన వాడు రామోజీ. ఈనాడు లో వస్తేనే వార్తని వార్తగా అంతా భావించే స్థితి తీసుకువచ్చినాడు రామోజీ.


(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు తీవ్ర అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. వారికి నా సంతాపం.

ఈనాడు సంస్థల అధినేతగా అనేక ప్రయోగాలకు వారు ఆద్యులు. ఎన్నో సంచలనాలు సృష్టించిన ఘనత వారిది. ఈనాడు సంస్థలను స్థాపించి విశేషంగా ప్రజలకు పత్రికను చేరువ చేశారు. అటు పిమ్మట ETV ద్వారా 24/7 ప్రత్యక్ష ప్రసారాలను ప్రయోగాత్మకంగా అమలు చేసి విజయం సాధించారు.

ప్రజలకు వార్తలు చేరువ చేసే స్తాయి నుంచి ప్రభావితం చేసే స్థాయికి.

ఆనాడు స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలను జాతీయ పోరాటం వైపు అడుగులు పడేలా పత్రికలు నడిచాయి. 1974లో రామోజీ రావు గారు స్థాపించిన ఈనాడు ప్రజలకు వార్తలను చేరువ చేసే స్థాయి నుంచి ప్రజలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగింది. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈనాడులో వార్త ప్రచురితం అయితే ప్రజలు విశ్వసిస్తారని నమ్మే స్థాయికి తన సంస్థను తీర్చిదిద్దారు. అనేక సామాజిక అంశాలను రాజకీయ అంశాలుగా మార్చి ప్రభుత్వాలను మార్చే ప్రభావిత శక్తిగా ఈనాడు నిలిచింది అందుకు మద్య నిషేధ ఉద్యమం ఒక ఉదాహరణ.

జర్నలిస్టులకు పుట్టినిల్లు ఈనాడు.

నేడూ వివిధ మీడియా సంస్థలలో పనిచేస్తున్న పేరు మోసిన జర్నలిస్టులు ఈనాడు సంస్థల నుంచే వచ్చారు. ఈనాడు జర్నలిస్టు స్కూలు స్థాపించి వృత్తిలో నైపుణ్యత, మెలుకువలు నేర్పి తన సంస్థతో బాటు మొత్తం జర్నలిస్టులకు పుట్టినిల్లుగా మార్చారు. నేడు కీలకమైన మీడియా సంస్థలు ఈనాడు స్ఫూర్తితో తాము కూడా జర్నలిజం స్కూల్ ను ప్రారంభించాయి.

రాజకీయంగా విభేదించే వారు కూడా ఈనాడును అనుసరించారు.

ఈనాడు సంస్థ ప్రజల ప్రభావిత శక్తిగా ఎదిగింది. ముఖ్యంగా సామాజిక, రాజకీయ పరిణామాలపై ఈనాడులో వార్త ప్రచురితం అయితే అది ప్రజలను ప్రభావితం చేస్తుంది. రామోజీ రావు గారితో విభేదించే వారు కూడా వార్తను నిజం అని నమ్మేలా వార్త శైలి ఈనాడు సంస్థ ప్రత్యేకత. అందుకే రామోజీ రావు గారిని అభిమానించే వారు ఎంతగా విశ్వసిస్తారో వ్యతిరేకించే వారు కూడా ఈనాడులో వచ్చె వార్తను నిజం అని నమ్మే పరిస్థితి.


ఒక్క ముక్కలో చెప్పాలంటే పత్రికలు - రాజకీయాలు అనే అంశం చర్చకు వచ్చినప్పుడు రామోజీ రావుతో ఏకీభవించే వారు విభేదించే వారుగా సమాజం మారింది అంటే ఈనాడు ఎంతటి ప్రభావిత శక్తిగా ఎదిగింది అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి అవసరం లేదు. తాను రాజకీయ నాయకుడు కాకపోయినా పరస్పర విభిన్న రాజకీయ పార్టీ నాయకులను కుడా తన చెంతకు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే కేవలం అవసరం కోసం మాత్రమే కాదు సంస్థకు, వారికి సమాజంలో ఉన్న ప్రధాన్యత అని చెప్పక తప్పదు.

ఈనాడు సంస్థతో చరిత్ర సృష్టించిన రామోజీరావు గారు తెలుగు ప్రజలను అత్యంత ప్రభావితం చేసారు. కేవలము మీడియా పరంగానే కాకుండా తెలుగుజాతి ప్రస్థానంలో తనకు ఓ పేజీని చిరస్తాయిగా ఏర్పాటు చేసుకున్న రామోజీ రావు గారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.


( మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి, సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం)

Read More
Next Story