
గీతం యూనివర్శిటీ మీద అంత ప్రేమ ఎందుకు?
యూనివర్శిటీ ఆక్రమించిన 55 ఎకరాల భూమిని రెగ్యలరైజ్ చేసేందుకు నిర్ణయం. దీని వేల కోట్ల విలువైన భూమిలివి? మాజీ ఐఎఎస్ అధికారి ఆక్షేపణ
విశాఖపట్నం సమీపాన రుషికొండ, ఎండాడ గ్రామాల్లో గీతం యూనివర్శిటీ అక్రమించుకున్న వేలాది కోట్ల రూపాయల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంటనే స్వాదీనం చేసుకోవాలని మాజీ ఐఎఎస్ అధికారి డాక్టర్ ఇఎఎస్ శర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
స్వాదీనం చేసుకోకపోవడం కాదు, గీతం కు అనుకూలంగా ఇటీవల జరిగిన సమావేశంలో,ఆ భూమి ఆక్రమణను "క్రమబద్ధీకరణ" చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారని వార్త లు వెలువడటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయనేతల మద్దతు ఉండడం కారణంగా, స్థానిక రెవిన్యూ అధికారులు కాని, జీవీఎంసీ అధికారులు కాని, ఆ సంస్థను ప్రశ్నించి, ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవడం జరగలేదని ఆయన ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , చీఫ్ కమీషనర్ (ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్)లకు ఒక లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
BSO 24 కింద కాని , రెవిన్యూ శాఖ 14-9-2012 లో జారీచేసిన GOMs No 571 కింద కాని , ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదన్న నియమాన్ని గుర్తు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరొక న్యాయం అమలుఅవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ‘‘అదే ఉన్నత రెవిన్యూ అధికారులు, జీవీఎంసీ అధికారులు, నగరానికి జీవనోపాధి కోసం వలస వచ్చి, నగరప్రజలకు సదుపాయాలు కలిగిస్తూ, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు కట్టుకున్న చిన్నకారు ప్రజలను, పోలీస్ బలగాల సహాయంతో, ప్రొక్లైన్ లను తీసుకువచ్చి, నిర్వాసితులు చేయడం, ప్రజలకు సేవలు అందిస్తున్న వీధి వ్యాపారులను కూడా అదే విధంగా నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరుగుతున్నది,’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

