
అల్లూరి జిల్లాలో అర్ధరాత్రి భూకంపం
భయంతో రోడ్లపైకి పరుగులు తీసిన మన్యం ప్రజలు!
అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో శనివారం అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాత్రి సుమారు 11:33 గంటల సమయంలో సంభవించిన ఈ స్వల్ప భూకంపం సుమారు 30 సెకన్ల పాటు ప్రకంపనలు సృష్టించింది. నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ఇళ్లు కదలడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.
అన్ని మండలాల్లోనూ ఒకేసారి ప్రకంపనలు
జిల్లాలోని అనంతగిరి, అరకులోయ, ముంచంగిపుట్టు, పెదబయలు, పాడేరు, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాలతో పాటు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (AOB) ప్రాంతాల్లో ఒకే సమయంలో భూమి కంపించింది. కొన్ని చోట్ల సెకన్ల వ్యవధిలోనే రెండుసార్లు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మారుమూల గ్రామాలైన జోలాపుట్టు, సుజనకోట ప్రాంతాల్లోనూ భూమి కంపించడంతో గిరిజనులు బెంబేలెత్తిపోయారు.
ఇళ్లలో సామాన్లు చెల్లాచెదరు..పర్యాటకుల ఆందోళన
భూకంప తీవ్రతకు కొన్ని ఇళ్లలోని వస్తువులు, సామాగ్రి కింద పడిపోయాయి. అరకు, పాడేరు వంటి పర్యాటక ప్రాంతాల్లో ఉన్న పర్యాటకులు కూడా ఈ ప్రకంపనలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంతకుముందెన్నడూ ఈ ప్రాంతంలో ఇలా భూమి కంపించలేదు అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ చలిని కూడా లెక్కచేయకుండా ప్రజలు చాలా సేపు రోడ్లపైనే గడిపారు. అధికారుల సమాచారం ప్రకారం.. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. దీని కేంద్రం ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఒడిశా సరిహద్దులో భూమి అంతర్భాగంలో కదలికల వల్ల ఈ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది.
Next Story

