కొండపల్లిలో 47 కోట్ల డ్రగ్స్ గుట్టురట్టు
x

కొండపల్లిలో 47 కోట్ల డ్రగ్స్ గుట్టురట్టు

అక్రమ ’అల్ప్రాజోలం‘ (Alprazolam) తయారీ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారు.


విజయవాడకు కూత వేటు దూరంలోని నగర శివార్లలోని కొండపల్లి ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియా (IDA) ఒక భారీ డ్రగ్ రాకెట్‌కు అడ్డాగా మారిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. 2026 మార్చి 13, శుక్రవారం నాడు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ’ఆపరేషన్ వైట్ హామర్‘ పేరుతో జరిపిన మెరుపు దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఒక ప్రైవేట్ కెమికల్ ఫ్యాక్టరీ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ ’అల్ప్రాజోలం‘ (Alprazolam) తయారీ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారు.

రికార్డు స్థాయిలో డ్రగ్స్ స్వాధీనం
ఈ తనిఖీల్లో అధికారులే విస్తుపోయేలా భారీ మొత్తంలో మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. దాదాపు 237 కిలోల స్వచ్ఛమైన అల్ప్రాజోలం లభ్యమైంది, దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ. 47 కోట్లు ఉంటుందని అంచనా. కేవలం తయారైన డ్రగ్సే కాకుండా, మరో 800 కిలోల ముడి పదార్థాలు, 2,860 లీటర్ల రసాయనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి నుంచి తయారైన డ్రగ్స్‌ను తెలంగాణలోని కల్లు డిపోలకు కల్తీ కోసం సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
మాస్టర్‌మైండ్ కెమిస్ట్ అరెస్ట్
ఈ డ్రగ్ నెట్‌వర్క్ వెనుక ఒక భారీ స్కెచ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉన్న ఒక సీనియర్ కెమిస్ట్ ఈ రాకెట్‌కు మాస్టర్‌మైండ్‌గా వ్యవహరిస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఈ కెమిస్ట్‌తో పాటు అతని ప్రధాన అనుచరుడిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రసాయనాలపై ఉన్న పట్టుతో అతి తక్కువ సమయంలోనే నాణ్యమైన అల్ప్రాజోలం తయారు చేయడంలో ఇతను సిద్ధహస్తుడని సమాచారం. ఫ్యాక్టరీలోని సెంట్రిఫ్యూజ్ మిషన్లు, డ్రైయర్లు, రియాక్టర్లను చూసి అధికారులు విస్తుపోయారు.
శాంతిభద్రతలకు సవాల్‌గా డ్రగ్స్
ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలకు గురువారం కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేసిన తరుణంలోనే.. విజయవాడ సమీపంలో ఇంతపెద్ద డ్రగ్ రాకెట్ బయటపడటం కలకలం రేపుతోంది. కొండపల్లి వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ తయారీ కేంద్రాలు ఇంకా ఎన్ని ఉన్నాయో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అధికారులు ఈ కెమిస్ట్ నెట్‌వర్క్ వెనుక ఉన్న ఫైనాన్షియర్లు ఎవరు? కొనుగోలుదారులు ఎవరు? అనే కోణంలో లోతైన విచారణ జరుపుతున్నారు.
Read More
Next Story