
’గ్యాస్‘ పుకార్లు నమ్మొద్దు, నిల్వలు పుష్కలం: ప్రభుత్వం
సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు నిండుకున్నాయని, సరఫరా నిలిచిపోతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ పరిస్థితి పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంది. ప్రతిరోజూ గృహ అవసరాలకు 4,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ అవసరం కాగా, ప్రస్తుతం 15,880 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇది దాదాపు నాలుగు రోజుల అవసరాలకు సరిపోతుందని, పైప్‌లైన్ ద్వారా నిరంతర సరఫరా కొనసాగుతుందని ప్రభుత్వం వివరించింది.
కొత్త నిబంధనలు.. ఓటీపీ ఉంటేనే సిలిండర్
గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌కు తరలిపోకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. ఇకపై సిలిండర్ కావాలంటే ఓటీపీ (OTP) పద్ధతిని కచ్చితంగా అమలు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ బుకింగ్ తర్వాత వచ్చే ఓటీపీ చెబితేనే డెలివరీ ఇస్తారు. తప్పుడు ప్రచారాల వల్ల సాధారణం కంటే 15 శాతం అదనంగా బుకింగ్స్ పెరగడంతో, రద్దీని తగ్గించేందుకు సిలిండర్ పొందే గడువుపై కొన్ని పరిమితులు విధించారు. పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్నవారికి 32 రోజుల విరామం తర్వాతే తదుపరి సిలిండర్ పొందేలా ఏర్పాట్లు చేశారు.
సామాన్యులకే తొలి ప్రాధాన్యం
పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్య విభాగాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాపై ఆంక్షలు విధించింది. బల్క్ ఎల్‌పీజీ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి, ఆ గ్యాస్‌ను గృహ అవసరాలకు మళ్లించారు. కేవలం ఆసుపత్రులు, హాస్టళ్లు వంటి అత్యవసర సేవలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. పైప్డ్ గ్యాస్ కంపెనీలతోనూ సమావేశమై సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి పయ్యావుల కేశవ్ హెచ్చరించారు.
ఆర్టీజీఎస్ నిఘాలో గ్యాస్ సరఫరా
రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి గ్యాస్ సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, పౌరసరఫరాల శాఖలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఆరు గంటలకు ఒకసారి స్టాక్ పాయింట్లను తనిఖీ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ కూడా రంగంలోకి దిగింది.
ఏపీలో గ్యాస్ లెక్కలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం 161.19 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిని మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. అత్యధికంగా హెచ్‌పీసీఎల్ (HPCL) 74.11 లక్షల కనెక్షన్లతో మొదటి స్థానంలో ఉండగా, ఐఓసీఎల్ (IOCL) 56.86 లక్షలు, బీపీసీఎల్ (BPCL) 30.22 లక్షల కనెక్షన్లను కలిగి ఉన్నాయి. వీటిలో సింగిల్ సిలిండర్ ఉన్నవారు మెజారిటీ సంఖ్యలో ఉండగా, సుమారు 60 లక్షల మందికి పైగా డబుల్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి.
అవసరాలు..నిల్వ సామర్థ్యం
రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల రోజువారీ గృహ అవసరాల కోసం ప్రతిరోజూ 4,000 మెట్రిక్ టన్నుల (MT) గ్యాస్ వినియోగం జరుగుతోంది. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు భిన్నంగా రాష్ట్రంలో నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ నెల 12వ తేదీ నాటి గణాంకాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్టాక్ పాయింట్ల వద్ద 15,880 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయి.
నాలుగు రోజుల బ్యాకప్ సిద్ధం
ప్రస్తుత వినియోగ రేటును పరిగణనలోకి తీసుకుంటే, ఇప్పుడున్న స్టాక్ అదనపు సరఫరా ఏదీ రాకపోయినా కనీసం నాలుగు రోజుల వరకు రాష్ట్ర అవసరాలకు పూర్తిగా సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పైప్‌లైన్లు , ట్యాంకర్ల ద్వారా నిరంతరంగా గ్యాస్ లోడింగ్ ప్రక్రియ కొనసాగుతున్నందున, నిల్వలు నిండుకుంటాయనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అనవసర ఆందోళనతో గ్యాస్ బుకింగ్స్ చేయవద్దని, అందరికీ సకాలంలో సిలిండర్లు అందుతాయని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. గ్యాస్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు రాష్ట్రంతో సమన్వయం చేసుకుంటోందని మంత్రులు వెల్లడించారు.
Next Story

