
సోర్స్: పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్
‘జీరామ్ జీ’ వస్తే, అడిగినా ఆంధ్రాలో ఉపాధి దొరుకుతుందా?
గత ఏడాది కేంద్రం డబ్బులిచ్చినా సగటు 51 రోజుల మించి ఉపాధి దొరకలేదు, భవిష్యత్తులో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుందేమో అంటున్న లిబ్ టెక్ అధయ్యనం
మహాత్మాగాంధీద జాతీయ ఉపాధి హామీ చట్టం (MGNREGA) క్రింద 100 రోజులు పని కావాలని ప్రభుత్వాన్ని అడిగే హక్కు ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో సగటు 51.6 రోజులు మాత్రమే కుటుంబాలకు పని దక్కింది. అది కూడా కేవలం 11 శాతం కుటుంబాలకు మాత్రమే 100 రోజులు పని దొరికింది. ఈ పరిస్థితుల్లో వీబీజీరామ్‌జీ చట్టం వచ్చి ఉపాధి హక్కును తీసేసింది. పథకానిక య్యే ఖర్చులో రాష్ట్రాల వాటాని 10 నుండి 40 శాతానికి పెంచింది. ఇప్పటికే రు. 10 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్న ఆంధ్రలో పథకం మునుపటిలాగా అమలు అవడం కష్టమే.
నరేగా చట్టం పని కల్పించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే హక్కు తో పాటు 15 రోజుల్లో పని చూపించలేని పరిస్థితిలో నిరుద్యోగ భృతిని పొందే హక్కు ఇచ్చింది. ఈ హక్కు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే అందరికీ ఎటువంటి మినహాయింపులు లేకుండా కల్పించింది. దాని స్థానంలో వచ్చిన వీబీజీరామ్‌జీ చట్టం (VB-G RAM G Act)కేంద్రం కేటాయించిన బడ్జెట్ పరిమితుల్లో అది నిర్దేశించిన ప్రాంతాలలో మాత్రమే అమలవుతుంది. కేంద్రం కొత్త చట్టంలో పని దినాలను 100 నుండి 125 కు పెంచామని చెబుతున్నా పథకాన్ని పరిశీలించిన సంస్థలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.
కేంద్రం వీబీజీరామ్‌జీ చట్టం క్రింద పని దినాలను 100 నుండి 125 కు పెంచామని చెబుతున్నా పథకం అమలు తీరును విశ్లేషించిన సంస్థలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పథకం క్రింద కేంద్రం నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే పనులు కల్పించే అవకాశం వుండటంతో దేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ పని అడిగే హక్కు మృగ్యం అవుతుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
నరేగా పై విస్తృతంగా అధ్యయనం చేసిన లిబ్ టెక్ సంస్థ నరేగా క్రింద జీవనోపాధి పొందే వారిలో ఎస్సీ, ఎస్టీ లు, మహిళలు అధికంగా వున్నారని కొత్త చట్టం వీరి జీవనోపాధిని దెబ్బ తీస్తుందని చెప్పింది. కేంద్ర ఎన్డీఏ కూటమిలో భాగం అయిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం వలన కలిగే లాభాలను గ్రామ సభలు పెట్టి వివరించమని అధికారులను నిర్దేశించి కూటమి ధర్మాన్ని పాటించింది కానీ ప్రజా ప్రయోజనాలను విస్మరించిందని ఆ సంస్థ ఆరోపిస్తోంది.
ఈ విషయం పై ఆ సంస్థ విడుదల చేసిన పత్రం పథకాన్ని షెడ్యూల్డ్ కులాలు 19 శాతం, షెడ్యూల్డ్ తెగలు 9.3 శాతం, 58 నుండి 60 శాతం మహిళలు ఉపయోగించుకున్నారని చెప్తోంది. ఈ గణాంకాలు జీవనోపాధి పొందటంలో వెనుకబడిన వర్గాలు పథకం పై ఎంతగా ఆధారపడ్డాయో తెలుపుతున్నాయి.
చట్టం పై వస్తున్న విమర్శలకు సమాధానంగా కొత్త చట్టం పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచిందని కేంద్రం చెప్తోంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నరేగా క్రింద పని హక్కుగా వున్నప్పుడే సరాసరి 51.6 రోజులు మాత్రమే పనులు దక్కాయి. కేవలం 11 శాతం కుటుంబాలు మాత్రమే 100 రోజుల పని దక్కించుకున్నాయి. కొత్త చట్టం పనిని హక్కుగా గుర్తించకపోవటంతో పని దినాలను 125 కు పెంచినా పని దొరికే పరిస్థితి వుండదని లిబ్ టెక్ అంటోంది. ఈ వాదనకు ఊతమిస్తూ 2023-24 ఎకనామిక్ సర్వే కూడా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కు తగినట్టు పనుల కల్పన జరగటం లేదని తెలిపింది. క్రింది స్థాయి సిబ్బంది పని కల్పించమని వచ్చిన అభ్యర్థనలను ఎప్పటికప్పుడు నమోదు చేయటంలేదని, కాబట్టి అధికారిక గణాంకాలు గ్రామీణ ప్రాంతాల్లో వున్న ఆర్థిక సంకటాన్ని ప్రతిబింబించటం లేదని అభిప్రాయ పడింది.
ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్రమంతా గ్రామ సభలు జరిపి ప్రజలను నరేగా కంటే వీబీజీరామ్‌జీ చట్టం మెరుగైనదని ఒప్పించే, నమ్మించే, ప్రయత్నం చేస్తోంది. “కొత్త పథకం కేంద్రం నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే అమలవుతుంది. అయినా గ్రామ సభలను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నారు. పథకాన్ని కుదించి కొన్ని పరిమిత ప్రాంతాల్లో మాత్రమే అమలు చేస్తే సంఖ్యాపరంగా తక్కవగా వుండే గిరిజన జాతులు నష్టపోతారని,” లిబ్ టెక్ కార్యకర్త చక్రధర్ బుద్ధ వివరించారు.
“ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు రు. పది లక్షల కోట్ల అప్పులున్నాయి. ఉన్న ఆర్థిక వెసులుబాటు తక్కువ. 2024-25 ఆర్థిక సంవత్సరం లో కల్పించిన స్థాయిలో నరేగా పనులు కల్పిస్తే రాష్ట్రం పై పడే భారం రు. 517 కోట్ల నుండి రు. 3,470 కోట్లకు పెరుగుతుంది. ప్రతి కుటుంబానికి 125 రోజుల పని కల్పించటానికి రాష్ట్రానికి సంవత్సరానికి రు. 8,400 కొట్లు అవసరం అవుతాయి. 60:40 కేంద్ర రాష్ట్ర వాటా నిష్పత్తి ప్రకారం రాష్ట్రంలో వున్న 65.5 లక్షల కుటుంబాలకు పని కల్పించటానికి మనం రు. 11,700 కొట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది,” అని చక్రధర్ చెబుతూ ఈ లెక్కలు అంచనాలు మాత్రమే అసలు కేంద్రం తన 60 శాతం వాటాను భరిస్తుందనే హామీ కూడా చట్టంలో లేదన్నారు.
కేంద్ర కేటాయింపుల కంటే రాష్ట్రాలు ఎక్కువ ఖర్చు చేస్తే ఆ భారాన్ని అవే భరించాలి. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాలు పథకాన్ని కుదించేందుకు ప్రయత్నిస్తాయి అనటంలో సందేహం లేదు, అని ఆయన విడుదల చేసిన రిపోర్ట్ సందేహం వెలిబుచ్చింది.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడటం వలన మేలు కంటే కీడే ఎక్కువ జరిగిందని చక్రధర్ చెప్పారు. “కొత్త చట్టం సాంకేతిక పరిజ్ఞాన వాడకాన్ని తప్పనిసరి చేస్తోంది. పని చేసే వారిని గుర్తించటం, హాజరు వేయటం, వారి పనిని పర్యవేక్షించటం నుండి వేతన చెల్లింపుల వరకు అన్నీ డిజిటల్ గానే జరగాలని నిర్దేశిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపాలన సులభతరం చేయటానికి మాత్రమే వాడాలి. నరేగా అమలులో ఆంధ్ర ప్రదేశ్ అనుభవాన్ని పరిశీలిస్తే సాంకేతికత వలన చాలా మంది లబ్దిదారులు పథకం ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. నరేగా కార్మికులను ఆధార్ కు అనుసంధానం చేయటం వలన ఒక సంవత్సరంలోనే దాదాపు 78 లక్షల మంది తీసివేయబడ్డారు. ఆధార్ ఆధారంగా ఈ-కెవైసీ అమలు చేయటంతో ఒకే నెలలో 16 లక్షల మంది తొలగించబడ్డారు. ఈ ప్రక్రియ వలన ఎక్కువగా వయసు మళ్లిన వాళ్ళు, ఒంటరి మహిళలు, వైకల్యాలు వున్న వాళ్ళు, మారుమూల గిరిజన ప్రాంతాల వాళ్ళు నష్టపోయారు. ఇలాంటి వాళ్ళకు చేసిన పనికి కూడా వేతనాలు రాలేదు,” అని ఆయన వివరించారు.
నరేగా పనుల అమలు పంచాయతీ స్థాయిలో నిర్ణయించబడకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినట్టు జరిగేవి. వైవిధ్యమైన పర్యావరణ, జీవన పరిస్థితులు వున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ కు ఈ వెసులుబాటు అవసరం, అని రిపోర్ట్ చెప్తోంది. కొత్త చట్టంలో కేంద్రం నిర్దేశించిన ‘వికసిత్ భారత్’ లక్ష్యాలకు అనుగుణంగా ప్రాధాన్యతలు వుంటాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంచాయతీలు, రాష్ట్రాలు తమ విచక్షణకు అనుగుణంగా వ్యవహరించే పరిస్థితి తగ్గిపోతుంది.
వ్యవసాయ పనులు విరివిగా జరిగే సమయంలో ఉపాధి పనులు ఆపి వేస్తే కార్మికులు పెద్ద భూస్వాముల దయా దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని, చక్రధర్ ఆవేదన వ్యక్తం చేశారు. “వ్యవసాయ పనులు అధికంగా వుండే కాలంలో 60 రోజులు పనులు ఆపివేయాలని కొత్త చట్టం చెబుతోంది. అయితే రాష్ట్రంలో ఇది వ్యవసాయ పనులు జరిగే కాలం అని నిర్దిష్టంగా చెప్పలేమని, ఈ పరిస్థితిలో ఆ కాలాన్ని ఎలా నిర్ణయిస్తారని,” ఆయన ఆశ్చర్యపోయారు.
“వ్యవసాయ పనులు జరిగే కాలం ప్రాంతాల మధ్య, జిల్లాలలో అంతర్గతంగానూ మారిపోతుంది. వ్యవసాయ పనులు విరివిగా జరిగే కాలంలో నరేగా క్రింద పనులు తగ్గిపోయేవి కానీ పూర్తిగా ఆగిపోయేవి కాదు. కాలాన్ని బట్టి పనుల కల్పనలో మార్పులు చేయటం వలన పని కోరే హక్కు అనే భావనకు తూట్లు పడుతోంది,” అని ఆయన వివరించారు.
నరేగా పనుల కల్పన వలన దళితులు, మహిళా కార్మికులకు అధిక వేతనాలు కోరే వెసులుబాటు కలిగింది. వీబీజీరామ్‌జీ చట్టం క్రింద కేంద్రం తెస్తున్న పరిపాలనా పరమైన, పని కోరే సమయం లో నిబంధనల వలన కార్మికులకు అననుకూలమైన పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతాయి అనటంలో సందేహం లేదు అంటోంది లిబ్ టెక్ ఆంధ్ర పై విడుదల చేసిన పత్రం.
నరేగా క్రింద ప్రభుత్వాన్ని పని కల్పించమని డిమాండ్ చేసే హక్కు వుండేది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించేవి. వీబీజీరామ్‌జీ చట్టం క్రింద ఆ వెసులుబాటు వుండదు. కేంద్రం యిచ్చే ఉత్తర్వులు ఏ ప్రాంతంలో పనులు కల్పించాలో నిర్ణయిస్తుంది. దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి వున్న ఆర్థిక వెసులుబాటు కూడా పనుల కల్పనను ప్రభావితం చేయనుంది. ఈ పరిస్థితిలో ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామాల్లో ఉపాధి హామీ సంక్షోభ సమయాల్లో ప్రజలను ఆదుకునే సాధనంగా వుంటుందా లేదా అనేది చూడాల్సి వుంది.

