’ఎట్ హోమ్‘ కు అంత చరిత్ర ఉందా
x

’ఎట్ హోమ్‘ కు అంత చరిత్ర ఉందా

ఇది దాదాపు వంద ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న సంప్రదాయం.


గణతంత్ర వేడుకల్లో ఉదయం పరేడ్ విన్యాసాలు దేశ సౌర్యాన్ని చాటితే.. సాయంత్రం జరిగే ’ఎట్ హోమ్‘ విందు ప్రజాస్వామ్య సఖ్యతకు అద్దం పడుతుంది. అసలు ’ఎట్ హోమ్'‘అంటే.. మన ఇంటికి ఆత్మీయులను ఆహ్వానించి ఎంత సరదాగా ముచ్చటించుకుంటామో.. దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు తమ నివాసాలను (రాజ్‌భవన్) వేదికగా చేసుకుని ప్రముఖులకు ఇచ్చే గౌరవార్థ విందు ఇది. బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయమే అయినా, నేడు ఇది రాజకీయ వైషమ్యాలను పక్కన పెట్టి దేశాధినేతలు, సామాన్య ప్రతిభావంతులు ఒకే చోట కలిసే ఒక ఆత్మీయ సంగమంగా మారింది. అందుకే దీనిని కేవలం ప్రోటోకాల్ వేడుకగా కాకుండా, ’ప్రథమ పౌరుడి ఇంటి విందు‘గా పిలుచుకుంటారు.

వైషమ్యాలు లేని స్నేహ వేదిక

నిత్యం అసెంబ్లీలో వాదోపవాదాలతో, రాజకీయ విమర్శలతో బిజీగా ఉండే అధికార, ప్రతిపక్ష నేతలు ఈ వేదికపై ఒకే చోట కనిపిస్తారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, ప్రజాస్వామ్య స్ఫూర్తితో అందరూ కలిసి చిరునవ్వుతో ముచ్చటించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నేతలు, హైకోర్టు జడ్జీలు, ఉన్నతాధికారులు అందరూ ఒకే వేదికపై పలకరించుకోవడం చూస్తుంటే.. ప్రజాస్వామ్య అందం అంటే ఇదేనేమో అనిపిస్తుంది.

సామాన్యులకు దక్కే అరుదైన గౌరవం

ఈ వేడుక కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే పరిమితం కాదు. సమాజంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన కళాకారులు, క్రీడాకారులు, శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలకు సైతం గవర్నర్ నుండి ఆహ్వానం అందుతుంది. ఎంతో నిబద్ధతతో పనిచేసే అలాంటి వ్యక్తులను రాష్ట్ర ప్రథమ పౌరుడు స్వయంగా పలకరించి, వారితో కలిసి తేనీటి విందులో పాల్గొనడం వారికి దక్కే అతిపెద్ద గౌరవం. ఒక రకంగా ఇది ప్రతిభకు, సమాజ సేవకు దక్కే సమున్నత గుర్తింపు.

చారిత్రక నేపథ్యం

బ్రిటిష్ కాలం నాటి పునాదులు: బ్రిటిష్ పాలనలో, వైస్రాయ్‌లు, గవర్నర్లు తమ అధికారిక నివాసాలలో ప్రముఖులకు, విదేశీ రాయబారులకు, ఉన్నతాధికారులకు ఇచ్చే సామాజిక విందులనే ’ఎట్ హోమ్‘ అని పిలిచేవారు. అప్పట్లో ఇది కేవలం బ్రిటిష్ పాలక వర్గం, స్థానిక కులీన వర్గాలకే పరిమితమై ఉండేది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, ప్రభుత్వం కొన్ని మంచి పాత సంప్రదాయాలను కొనసాగించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే రాజ్యాంగ అధినేతలు (రాష్ట్రపతి, గవర్నర్లు) ప్రజలకు.. ప్రముఖులకు చేరువగా ఉండటానికి ఈ ఎట్ హోమ్ వేడుకను కొనసాగించారు.

ముఖ్యంగా 1950లో భారతదేశం గణతంత్ర దేశంగా (Republic) మారినప్పటి నుండి, ప్రతి ఏటా జనవరి 26న (రిపబ్లిక్ డే) సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో, రాష్ట్రాల్లోని రాజ్‌భవన్లలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఒక తప్పనిసరి ఆచారంగా మారింది. బ్రిటిష్ కాలంలో ఇది కేవలం హోదాను ప్రదర్శించే వేడుకగా ఉండేది. కానీ స్వాతంత్ర్యానంతరం, ఇది ఒక ప్రజాస్వామ్య వేదికగా మారింది. ఇప్పుడు ఇందులో రాజకీయ నేతలతో పాటు పద్మ అవార్డు గ్రహీతలు, యుద్ధ వీరులు, సామాజిక సేవకులు, సమాజంలోని వివిధ వర్గాల ప్రతినిధులకు చోటు కల్పిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ’తేనీటి విందు‘గా ఉన్న ఇది, ఇప్పుడు దేశ ప్రథమ పౌరుడు ప్రజల మధ్యకు వచ్చి పలకరించే ఒక ఆత్మీయ సంగమంగా రూపుదిద్దుకుంది. క్లుప్తంగా చెప్పాలంటే.. ఇది దాదాపు వంద ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న సంప్రదాయం. బ్రిటిష్ వారి కాలంలో ఒక అధికారిక ప్రోటోకాల్‌గా మొదలై, నేడు భారతీయ ప్రజాస్వామ్య సఖ్యతకు ప్రతీకగా నిలుస్తోంది. అయితే..2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన వైషమ్యాలు ఉండటంతో ప్రతిపక్ష నేతలు ఈ కార్యక్రమాలకు హాజరుకావడం చాలా వరకు తగ్గింది.

Read More
Next Story