అమరావతికి చట్టబద్ధత ఉన్నట్లా? లేనట్లా?
x

అమరావతికి 'చట్టబద్ధత' ఉన్నట్లా? లేనట్లా?

అమరావతికి చట్టబద్దత ఉందని మంత్రి నారా లోకేష్ చెబుతున్నారు. మరో వైపు అమరావతికి చట్టబద్దత కల్పించాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవితవ్యంపై కూటమి ప్రభుత్వం ఒకే రోజు రెండు భిన్నమైన సంకేతాలను పంపింది. విశాఖలో లోకేష్ ఇచ్చిన 'స్టేట్‌మెంట్'కు, ఢిల్లీలో చంద్రబాబు చేసిన 'రిక్వెస్ట్'కు మధ్య ఉన్న వైరుధ్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమరావతికి చట్టబద్ధత ఉంది.. అందుకే ఎవరూ మార్చలేకపోయారు" అని విశాఖ సాక్షిగా మంత్రి లోకేష్ గంభీర ప్రకటన చేశారు. కానీ, అదే సమయంలో ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి "అమరావతికి చట్టబద్ధత కల్పించండి" అని విజ్ఞప్తి చేశారు. ఒకరికి ఉన్నట్లు కనిపిస్తున్న చట్టబద్ధత, మరొకరికి ఎందుకు లేనట్లు అనిపిస్తోంది? రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు వేస్తోందా? అనే అనుమానాలు ఇప్పుడు రాజకీయ తెరపైకి వస్తున్నాయి.

లోకేష్ వాదనలోని మర్మం

విశాఖపట్నంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. అమరావతికి చట్టబద్ధత ఉంది కాబట్టే గత ప్రభుత్వం ఐదేళ్లు ప్రయత్నించినా రాజధానిని తరలించలేకపోయిందని పేర్కొన్నారు. ఇది ఒక రకంగా కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం. అంటే, అమరావతి విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవని, అది సురక్షితమని ప్రజలను నమ్మించే వ్యూహం ఇందులో కనిపిస్తోంది.
ఢిల్లీలో బాబు అభ్యర్థన వెనుక భయం
లోకేష్ మాటల్లో అంత ధీమా ఉంటే, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి అమిత్ షాకు విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? విభజన చట్టం ప్రకారం అమరావతిని రాజధానిగా గుర్తించినప్పటికీ, గెజిట్ నోటిఫికేషన్ లేదా పార్లమెంటు తరపున మరింత బలమైన 'లీగల్ సీల్' (చట్టపరమైన ముద్ర) కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం మారినా, న్యాయస్థానాల్లో సవాళ్లు ఎదురైనా రాజధాని కదలకూడదనేది ఆయన ఆలోచన. అంటే, ప్రస్తుత చట్టబద్ధత భవిష్యత్తుకు సరిపోదని బాబు భావిస్తున్నారా? అనే ప్రశ్న ఉదయిస్తోంది.

అమిత్ షాను చంద్రబాబు ఏమని కోరారంటే..
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. బుధవారం పోలవరం పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం, కేంద్ర హోం మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై వీరిద్దరూ చర్చించుకున్నారు. అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. దీని వల్ల రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు... రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్టు అవుతుందని చెప్పారు. అలాగే ఇటీవల ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన జీ రామ్ జీ పథకంలోని కొన్ని అంశాల నుంచి రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అమిత్ షాకు సీఎం వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం ఇప్పటికే సహకరిస్తోందని... ఇదే తరహా సహకారాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రామాలు, తాజా పరిణామాలపై వీరిద్దరు చర్చించుకున్నారు.

కర్నూలు నుంచి చెన్నైకి 6 గంటల్లో ప్రయాణం.ఎలా?

గందరగోళం ఎవరికి లాభం?

ఈ నేపథ్యంలో స్పష్టత కరువు లోపించింది. ప్రభుత్వం ఒకవైపు "అంతా బాగుంది" అంటూనే, మరోవైపు కేంద్రం కాళ్ళ దగ్గరకు వెళ్లి "మా రాజధానిని కాపాడండి" అని కోరడం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోంది. ఇప్పటికే చట్టబద్ధత ఉందని లోకేష్ చెబుతున్నప్పుడు, మళ్ళీ కొత్తగా చట్టబద్ధత అడగడం అంటే.. ఇప్పటివరకు అమరావతి విషయంలో జరిగిన పనులకు పూర్తి స్థాయి చట్టపరమైన రక్షణ లేదని ప్రభుత్వం ఒప్పుకున్నట్లేనా? అని ప్రతిపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే రాజధాని ఎంపిక రాష్ట్రాల పరిధిలోని అంశమని కేంద్రం గతంలో పలుమార్లు చెప్పింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు కోరిక మేరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇస్తేనే అమరావతికి పూర్తి స్థాయి 'రక్షణ' లభిస్తుంది.
పరిష్కారం ఎప్పటికో
లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరమైనవి అయితే, చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న ప్రయత్నాలు వ్యూహాత్మకమైనవి. అయితే, ఈ రెండు పరస్పర విరుద్ధంగా అనిపిస్తుండటంతో, అమరావతి చుట్టూ ఉన్న లీగల్ చిక్కులు ఇంకా పూర్తిగా వీడలేదన్నది వాస్తవం. కేంద్రం అమరావతికి పార్లమెంటు సాక్షిగా భరోసా ఇచ్చే వరకు ఈ 'చట్టబద్ధత' చర్చ కొనసాగుతూనే ఉంటుంది. మరోవైపు రాజధాని అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేస్తోంది. ఒకటి.. క్షేత్రస్థాయిలో రైతులకు ధైర్యం చెప్పడం. రెండు.. ఢిల్లీ స్థాయిలో శాశ్వత పరిష్కారం వెతకడం. ఈ డబుల్ గేమ్ అమరావతికి ఎంతవరకు రక్షణ కల్పిస్తుందో కాలమే నిర్ణయించాలి.
Read More
Next Story