పందెంలో పడకేసిన గుడివాడ కోడిపుంజు
x

పందెంలో పడకేసిన గుడివాడ కోడిపుంజు

కోడిపందెంలో అనూహ్య ట్విస్ట్: 'అహింసావాది' పుంజు పోరాడకుండానే ఓటమి!


సాధారణంగా రక్తపాతంతో ముగిసే కోడిపందెంలో అనూహ్య మలుపు! ఇష్టం లేకుండా బరిలోకి దిగిన ఓ పుంజు, పోటీ ప్రారంభమవుతూనే కింద పడుకుని 'పోరాడటం మానేయ్' అంటున్నట్లు స్పందించకుండా మౌనంగా ఓడిపోయింది. స్థానిక కోడిపందెం రాయుళ్లు ఎంత ప్రయత్నించినా మరో పుంజు దాడి చేసినా ఆ కోడి పుంజు లేచి యుద్ధం చేయకపోవడంతో పందెం రద్దు చేసి అది ఓడిపోయినట్లు ప్రకటించారు. ఈ సంఘటన స్థానికుల్లో ఆసక్తి రేపింది. ఈ కోడి పుంజు ‘అహింసా’ మార్గమా? లేక భయమా? అని చర్చలు సాగుతున్నాయి.

గుడివాడ పట్టణ శివార్లలోని ఓ ప్రదేశంలో జరిగిన ఈ పందెంలో కోడిపందెం రాయుళ్లు తమ కోడిపుంజులను సిద్ధం చేసి బరిలోకి దించారు. మొదటి పుంజు ఉత్సాహంగా పోరాడేందుకు సిద్ధంగా ఉండగా, రెండో పుంజు మాత్రం పందెం మీద ఇష్టం లేనట్లు వ్యవహరించింది. పందెం రాయుడు కోడిని వదిలిన వెంటనే అది కింద పడుకుని, ఎంత లేపినా స్పందించలేదు. ‘‘ఎన్ని సార్లు పైకి లేపి యుద్ధంలోకి దించినా, అది నిశ్శబ్దంగా పడుకునే ఉంది. మరో పుంజు దాని జుట్టును పొడిచి రెచ్చగొట్టినా, ఆ పుంజు ఏమాత్రం కదలలేదు.’’

పందెం నియమాల ప్రకారం పోటీలో పాల్గొనకుండా ఉండటం ఓటమిగా పరిగణించాలని పందెం రాయుళ్లు నిర్ణయించారు. దీంతో ఆ పుంజు ఓడిపోయినట్లు ప్రకటించి పందెం ముగించారు. సాధారణంగా కోడి పందెంలో రక్తం చిందులు వేస్తూ ముగుస్తుంది. కానీ ఈసారి 'అహింసా' రూపంలో ఆ పందెం ముగియడం స్థానికులకు ఆశ్చర్యం కలిగించింది. "మా కోడి గాంధీజీ మార్గం పాటిస్తోందేమో" అని ఓ పందెం రాయుడు హాస్యాస్పదంగా వ్యాఖ్యానించాడు.

ఈ కోడి పుంజు ఎందుకు ఇలా చేసిందనేది స్థానికుల్లో చర్చనీయాంశమైంది. పందెం ఒత్తిడి వల్ల కోడిపుంజు భయపడిందని కొందరు వ్యాఖ్యానించారు. కానీ మొత్తంగా ఈ ఘటన కోడిపందెంలోని రక్తపాతాన్ని ప్రశ్నిస్తూ, హాస్యాస్పద కోణాన్ని జోడించింది. ఈ 'అహింసావాది' పుంజు కథ స్థానికులకు ఒక వినోదాత్మక గాథగా మిగిలింది. కోడి పందెంలలో ఇలాంటి అనూహ్య మలుపులు ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని స్థానికులు చెబుతున్నారు. పుంజు పందెంలోకి రాగానే పోటానికి ఉరకలు వేస్తుందని, అటువంటి పుంజులనే పందెం రాయుళ్లు పెంచుతారని కోడి పెందేలు వేసే వారు చెప్పారు.

Read More
Next Story