
ఆంధ్రా యూనివర్శిటీల గత కీర్తి ఘనం, వర్తమానం చీకటి
భవిష్యత్తు ప్రశ్నార్థకం అంటున్న విద్యావేత్తలు
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు ఇప్పటికే యాబై వసంతాలు జరుపుకుని శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న నేపధ్యంలో నాణ్యమైన విద్యను అవి అందించ గలుగుతున్నాయా అంటే లేదనే సమాధానం వస్తుంది. దీనికి ప్రధాన కారణం గత 30 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన పార్టీలు వాటి పట్ల చూపిన నిర్లక్ష్యమే అనే దానిలో సందేహం లేదు.
ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిపిన ప్రభుత్వం దాని అభివృద్దికి తీసుకుంటున్న చర్యలపై మాత్రం సందేహాలు అసంతృప్తి ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏ కాలేజీ కైనా ఉండాల్సిన ప్రాథమిక అవసరమైన భోదనా సిబ్బంది కొరత. వీటిని భర్తీ చేయకుండా వాటికి ఘనమైన గత చరిత్ర మాత్రమే మిగులుతుందని భవిష్యత్తు ఉండదని ‘ఫెడరల్’ తో మాట్లాడిన విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ వర్శిటీ లోనే 1200 మంది ఉండాల్సిన ఫ్యాకల్టీ కేవలం 130 మంది మాత్రమే ఉన్నట్టు ఆ వర్శిటీ వర్గాలు వెల్లడించాయి.
వాటి భర్తీకి ప్రయత్నాలు జరిగినా చేపట్టిన ప్రక్రియ యూజీసీ నిబంధనలకు అనుగుణంగా లేదని అభ్యర్థులు కోర్టుకు వెళ్ళటంతో మొత్తం ప్రక్రియ ఆగిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి ప్రధాన కారణం విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తి కోల్పోవటమే అని పేరు బయటపెట్టడానికి ఇష్టపడని ఒక ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.
ఇటీవల రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పిన లెక్క ప్రకారమే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో 3,371 భోదనా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర కౌన్సిల్ లో స్వతంత్ర్య ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. “2023 నోటిఫికేషన్ ను కోర్టు తప్పుపట్టింది. రిజర్వేషన్ నియమాలు పాటిస్తూ నోటిఫికేషన్ ఇస్తాము. సిబ్బంది ఎంత మంది అవసరం అనేది లెక్కవేస్తున్నాము. ఇటీవల జరిగిన వైస్ చాన్సలర్ సమావేశంలోనూ గవర్నర్ చర్చల్లో పాల్గొన్నారు. ఈ ఆడిట్ తరువాత స్పష్టత వస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్ మీద లీగల్ సలహాలు తీసుకుంటున్నాము. అభ్యర్థుల వయసు పై నిర్ణయం తీసుకోవటానికి మినిస్టర్ ల గ్రూప్ ఏర్పాటు చేశాము. 150 రోజుల్లో మా ప్రభుత్వం 16,000 టీచర్ పోస్టులు నింపాము. మూడు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తాము,” అని లోకేశ్ ఆయన ప్రశ్నలకు జవాబుగా చెప్పారు.
2006 తరువాత యూనివర్సిటీల్లో ఒక్క నియామకం జరగలేదు. రాజకీయ జోక్యం పెరిగిపోయింది. వీసీల చేతిలో పాలనా పగ్గాలు లేకుండా పోయాయి. రాజకీయంగా నియామకాలు జరగటంతో వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించటం లేదు.
గెస్ట్, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ లతో కాలం నెట్టుకొస్తున్న యూనివర్సిటీల్లో కేవలం సబ్జెక్టు భోధన మాత్రమే జరుగుతోంది పరిశోధన, పబ్లికేషన్స్ లేవు పేటెంట్ లు రావటం లేదు. క్వాలిటి ఫ్యాకల్టీ లేరు. ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో వచ్చే ఆదాయంతో అవి నెట్టుకొస్తున్నాయని మరో ప్రొఫెసర్ చెప్పారు.
2018 లో ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం జరిగిన పరీక్ష వివాదాలలో చిక్కుకుని ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది.
ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ అధికారులు ప్రొఫెసర్ లను కొనసాగిస్తామని చెప్పిన అఫిడవిట్ సమర్పించిన విధంగానే అసిస్టెంట్ ప్రొఫెసర్ ల విషయంలో కూడా అటువంటి సముచిత నిర్ణయం తీసుకున్నట్టయితే మాకు కూడా న్యాయం జరుగుతుందని, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కె. శ్రీనివాసులు తెలిపారు.
“ఒకే GO ద్వారా మంజూరైన ఆచార్యుల విషయంలో అనుకూల వైఖరిని అవలంబిస్తూ అదే GO ద్వారా మంజూరైన సహాయ ఆచార్యుల విషయంలో వ్యతిరేక వైఖరి అవలంబించడం ఏ ధర్మ నిరతి కిందికి వస్తుందో అధికారులు స్పష్టం చేయాలి. ఆనాటి TDP ప్రభుత్వం ద్వారా జారీచేయబడిన ఉద్యోగ ప్రకటనలను ఈనాడు కూటమిలోని ఉన్నత విద్యాశాఖ అధికారులు వ్యతిరేకించడం ప్రజాస్వామ్యంలో ఎక్కడా జరగని పరిణామం. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఈ విషయంపై తగిన సమయం కేటాయించి, చర్చించి, ఆచార్యులతో పాటు సహాయ ఆచార్య అభ్యర్థులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని,” ఆయన కోరారు.
ఈ విషయం పై ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ స్పందిస్తూ ప్రభుత్వాల వైఖరి వోట్ల కోసం ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉండాలి కానీ ఇవ్వకూడదు. జగన్ ప్రభుత్వం తన పదవీ కాలం చివరిలో నోటిఫికేషన్ ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయ్యింది దీనిపై ఏ చర్యలు చేపట్టలేదు. కాంట్రాక్ట్ టీచర్ లకు జాబ్ గ్యారంటీ లేదు. తక్కువ జీతం, జాబ్ గ్యారంటీ కూడా లేకుండా పాఠాలు ఎలా చెప్తారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్ర వర్శిటీ పరిరక్షణ కమిటీ కి చెందిన ప్రోగ్రామ్ సైంటిస్టు, సమన్వయకర్త గా ఉన్న పి. శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది ఒక తెలివైన కుట్ర అని వర్ణించారు. “1,200 మంది బోధనా సిబ్బంది ఉండాల్సిన స్థానంలో 130 మందికి పర్మనెంట్ టీచర్ ల సంఖ్య పడిపోయాక రిసెర్చ్ స్కాలర్ లను ఎవరు గైడ్ చేస్తారు. ఈ సంఖ్యను బట్టి పరిశోధన ఎంత తీవ్రంగా కుంటుపడింది అర్ధం చేసుకోవచ్చు. ప్రైవేట్ యూనివర్శిటీలలో విద్యార్థులు ప్రశ్నించరు అని వాటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. బోధనేతర సిబ్బంది 2,800 నుండి 600 కు పడిపోయారు. ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షపెట్టడం యూజిసి నియమాలకు వ్యతిరేకం,” అని అభిప్రాయ పడ్డారు. ప్రొఫెసర్ లు పడిపోయిన నిష్పత్తిలో రిసెర్చ్ అసోసియేట్ లు తగ్గిపోయారు. ఇక వర్శిటీలో పరిశోధన ఎలా జరుగుతుంది అని ప్రశ్నించారు.
యూనివర్సిటీలలో డిపార్ట్మెంట్ లో ఒక ప్రొఫెసర్ ఉంటే ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్ లు ఉండాలి అనేది యూజిసి నిబంధన. ఈ నిష్పత్తిలో ఫ్యాకల్టీ లేకపోవటంతో డీఎస్టీ ప్రొజెక్ట్స్, రుసా (రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్), సిఎస్ఐఆర్, యూజిసి నిధులు వర్శిటీలకు రావు. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రభుత్వానికి, విశ్వవిద్యాలయాలకు, యూజిసి కి మధ్యన అనుసంధాన కర్తగా ఉండాలి. ఇది ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడింది. జీవో 3 జారీ చేయడం ద్వారా దీని అధికారాలను ఉన్నత విద్యా కమీషనరేట్ కు బదిలీ చేశారు. ఇలాంటి నిర్ణయాలు విద్యా సంస్థల స్వతంత్రతను దెబ్బతీస్తాయి అని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు.
విశ్వవిద్యాలయాలు జ్ఞానకేంద్రాలుగా దిక్సూచిగా లేవు. సంకుచిత దృష్టి వుంది. చాలా విభాగాలలో 50 శాతం కూడా భర్తీ కావటం లేదు. ప్రభుత్వ సంస్థలు సరిగ్గా లేవు. ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించాలి అనే అభిప్రాయం బలపడింది. విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు టెక్నీషియన్స్ ను మాత్రమే తయారు చేస్తున్నాయి, అని నాగార్జున యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ వి. అంజి రెడ్డి అన్నారు.
రాజకీయ జోక్యం వలన 15 నుండి 20 ఏళ్ళుగా పనిచేస్తున్న ఫ్యాకల్టీ ని తొలగించి కొత్త వారిని నియమించే ప్రయత్నం జరుగుతోందని ఎస్వీ యూనివర్సిటీ లో సీనియర్ కాంట్రాక్ట్ అధ్యాపకుడు డా. కె. కిశోర్ కుమార్ రెడ్డి చెప్పారు. “మేము నెట్, సెట్, పీహెచ్‌డీ, ఉన్న వాళ్ళం. మమ్మల్ని చూపించి నాక్ అక్రిడిటేషన్ సంపాదించారు. అతి తక్కువ జీతాలు ఉన్నప్పటి నుండి పనిచేస్తున్నాము. ఇప్పుడు తొలగిస్తే ఎవరికి బయట వేరే ఉద్యోగాలు రావు,” అని తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మొత్తం పరిస్థితి పై నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత జాయింట్ రిజిస్ట్రార్ ఏ. జగన్నాధ రావు మాట్లాడుతూ, “1990 ల నుంచి జీతాలు, పెన్షన్ లకు సరిపడా ఫండ్స్ కూడా ఉండేవి కాదు. సాధారణ ఖర్చులకు మేమే వనరులు సేకరించాలి అనే వైఖరి పెరిగింది. ఖర్చు చేసి బిల్ పెట్టినా పూర్తి మొత్తం ఎప్పుడు ఇచ్చే వాళ్ళు కాదు. కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ప్రవేశపెట్టాల్సి వచ్చింది. దూర విద్య విభాగం ద్వారా కూడా నిధులు రావటం పెరిగింది. యూజిసి 2005-06 నుండి బిల్డింగ్స్, ల్యాబ్ లు కోసం నిధులు ఇస్తే దానికి 25 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పద్దతిని రాష్ట్ర ప్రభుత్వాలు ఆపేశాయి. వీసీలు రాజకీయ ప్రాపకంతో నియమించిన వారు కాబట్టి అడిగే స్వాతంత్ర్యం కోల్పోయారు,” అని చెప్పారు.
కాగా విద్యా విభాగం సెక్రెటరీ కోన శశిధర్ త్వరలో యూనివర్సిటీ భోదనా సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న 1,100 పోస్టులను ప్రక్కన పెట్టి 1,500 పోస్టులకు నోటిఫికేషన్ మే 15 న ఇవ్వబోతున్నాము అని చెప్పారు. “యూనివర్సిటీ అకడెమిక్ కౌన్సిల్ లకు మేము రిక్రూట్మెంట్ పై నిర్ణయం తీసుకోమని రాశాము. సుప్రీం కోర్టు ఏ నిర్ణయం ఇస్తే దానికి కట్టుబడి ఉంటాము,” అని చెప్పారు.

