ఆన్‌లైన్ గేమే ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యకు పురిగొల్పిందా?
x

ఆన్‌లైన్ గేమే ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యకు పురిగొల్పిందా?

డిజిటల్ ప్రపంచం పిల్లల మనసులపై చాలా ప్రభావం చూపుతుందోందంటున్న వైద్య నిపుణులు..


Click the Play button to hear this message in audio format

ఉత్తర ప్రదేశ్‌(Utter Pradesh)లో చోటుచేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య(Sisters suicide) ఘటన దేశాన్ని కలచివేసింది. మొదట ఇది సాధారణ దుర్ఘటనగా భావించినా.. పోలీసుల దర్యాప్తులో ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాస్క్ బేస్డ్ ఆన్‌లైన్ గేమ్ - ‘లవ్ గేమ్’ ఈ విషాదానికి కారణమై ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ‘లవ్ గేమ్’లో 50వ టాస్క్ ఎత్తైన భవనం నుంచి దూకాలని సూచించినట్లు పోలీసులు గుర్తించారు. బాలికల మొబైల్ హిస్టరీ, కాల్ రికార్డులు, ఎనిమిది పేజీల డైరీ — ఇవన్నీ కలిపి చూస్తే వారు గేమ్‌కు బాగా అడిక్ట్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఈ టాస్క్‌లను ఎవరైనా ఆన్‌లైన్‌లో ఆదేశిస్తే చేశారా? లేక పిల్లల మానసిక స్థితి ఫలితమా? అనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది.


బలమైన అనుబంధమే ఒకే నిర్ణయానికి దారితీసిందా?

ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎప్పుడూ కలిసి మెలిసి ఉండేవారు —చదవడం, తినడం కలిసి చేసేవారు. వారి మధ్య ఉన్న ఈ బలమైన అనుబంధమే చివరికి ఒకే నిర్ణయానికి దారితీసిందా? అనే ప్రశ్న తల్లిదండ్రుల మనసుల్ని కలిచివేస్తోంది. తమ పిల్లలు చాలా కాలంగా ఆన్‌లైన్ గేమ్‌ ఆడుతున్నట్లు తండ్రి పేర్కొన్నారు. గత రెండేళ్ల నుంచి ఈ అమ్మాయిలు స్కూల్‌కు వెళ్లట్లేదని తెలుస్తోంది. కుటుంబసభ్యులు వారిని స్కూల్‌కు పంపించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.


డిజిటల్ హిప్నాసిస్..

ఇక డైరీలో రాసిన పదాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ‘‘కొరియానే మా ప్రాణం. ఈ విషయం మీకు ఎప్పటికీ అర్థం కాదు. మేం ఇక్కడివాళ్లను పెళ్లి చేసుకోలేం’’ అని వారు ఆ డైరీలో రాసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఊహా ప్రపంచం, వాస్తవికతకు పిల్లలు గుర్తించలేక పోయారని మానసిన నిపుణులు భావిస్తున్నారు. ఈ ఘటనను “డిజిటల్ హిప్నాసిస్”గా పేర్కొంటున్నారు.

మొబైల్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకున్న హర్రర్, సర్వైవల్, డార్క్ కంటెంట్ గేమ్‌లు వారి మానసిక స్థితిపై ప్రభావం చూపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విదేశాల నుంచి ఎవరైనా కమ్యూనికేషన్ చేసి ఈ అఘాయిత్యానికి ఉసిగొలిపారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కేవలం ఒక కుటుంబంలో చోటుచేసుకున్న దుర్ఘటన మాత్రమే కాదు. డిజిటల్ యుగంలో మారుతోన్న పిల్లల మానసిక స్థితిని తెలుపుతుంది. COVID అనంతరం ఒంటరితనం, ఆన్‌లైన్ ప్రపంచంపై ఆధారపడటం, పేరెంటింగ్‌లో డిజిటల్ పర్యవేక్షణ లోపం — ఇవన్నీ కలిసి తీవ్ర విషాదానికి దారితీశాయి.

ఘజియాబాద్ పోలీసులు ఈ కేసును హై–ప్రొఫైల్ సైబర్ క్రైమ్‌గా దర్యాప్తు చేస్తున్నారు. తుది నివేదికలో అసలు కారణాలు వెలుగులోకి రానున్నాయి. డిజిటల్ ప్రపంచం ఎంత ఆకర్షణీయమైనదైనా, పిల్లల మనసులపై అది ఎంత ప్రభావం చూపుతుందో తల్లిదండ్రులు, సమాజం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read More
Next Story