
విశాఖ హైవేపై ట్రాఫిక్ రద్దీ
వైజాగ్‌లో అభివృద్ధి.. ట్రాఫిక్ ట్రబుల్స్ పోటా పోటీ!
విశాఖలో ట్రాఫిక్ ఇక్కట్లకు రోడ్ల విస్తరణ జరగకపోవడమేనన్న వాదనలు ఊపందుకుంటున్నాయి.
విశాఖ మహా నగరాన్ని మేం అభివృద్ధి చేశామంటే.. మేం చేశామని గొప్పలు చెప్పుకుంటారు రాజకీయ నాయకులు. ఈ గొప్పలకు ఆ పార్టీ, ఈ పార్టీ అనే బేధం లేదు. ఏ పార్టీ నేతలదైనా అదే తీరు. అప్పుడెప్పుడో మూడు దశాబ్దాల క్రితం వేసిన రోడ్లకే అప్పుడప్పుడు మెరుగులు దిద్దుతుంటారు. అరకొరగా విస్తరణ పనులు చేస్తుంటారు. అదే అభివృద్ధిగా చాటుకుంటున్నారు తప్ప రోడ్ల విస్తరణ, అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ట్రాఫిక్ సమస్యలు కూడా అంతే వేగంగా పోటీ పడుతున్నాయి.
జగదాంబ జంక్షన్‌లో కిక్కిరిసిన వాహనాలు
వీఎంఆర్‌డీఏ ప్రయారిటీ రోడ్ల పరిస్థితి ఇదీ..
విశాఖపట్నంలో ట్రాఫిక్ ఇక్కట్లు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) విశాఖ పరిధిలో 15 మాస్టర్ ప్లాన్ రోడ్డు ప్రాజెక్టులను ప్రతిపాదించింది. వీటిలో ఎనిమిది ప్రయారిటీ మాస్టర్ ప్లాన్ రోడ్లు కూడా ఉన్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే నగర పరిధిలో ట్రాఫిక్ సమస్యలు తీరతాయి. అంతేకాదు.. జాతీయ రహదారి–16తో అనుసంధానమై త్వరలో అందుబాటులోకి రానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ కూడా మెరుగు పడుతుంది. అయితే ఈ రోడ్ల పురోగతి మాత్రం నత్తతో పోటీ పడుతోంది. వీటిలో తిమ్మాపురం– మారికవలస రోడ్డు ఒక్కటే శత శాతం పూర్తయింది. బోయపాలెం–కాపులుప్పాడ రోడ్డు 58 శాతం, తాళ్లవలస–కొత్తవలస రోడ్డు 36 శాతం, అడవివరం–శొంఠ్యాం రోడ్డు 33 శాతం, వేపగుంట–పినగాడి (వీఎంఆర్‌డీఏ సెగ్మెంట్ 15 శాతం, అదే రోడ్డు జీవీఎంసీ సెగ్మెంట్ 10 శాతం, వేపగుంట–జుత్తాడ రోడ్డు 5 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఇక భీమిలి–దొరతోట జంక్షన్ రోడ్డు పనులే మొదలు కాలేదు. ఈ ప్రయారిటీ రోడ్లు ముందుకు సాగడానికి భూసేకరణ ఇబ్బందులు, అటవీ శాఖ అనుమతుల్లో జాప్యం వంటి సమస్యలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోడ్లను జూన్‌లోగా పూర్తి చేయాలని ఇటీవల వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ అధికారులకు నిర్దేశించారు.
గాజువాకలో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వాహనాలు
ఈ రోడ్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే..
రోడ్డు నం. ఎక్కడ నుంచి ఎక్కడకు? దూరం పూర్తి శాతం
రోడ్డు నం.10ః తిమ్మాపురం–మారికవలస 6.30 కి.మీలు 100
రోడ్డు నం.07ః బోయపాలెం–కాపులుప్పాడ 3.10 కి.మీలు 58
రోడ్డు నం.05ః తాళ్లవలస–కొత్తవలస 3.83 కి.మీలు 36
రోడ్డు నం.12ః అడవివరం–శొంఠ్యాం 8.0 కి.మీలు 33
రోడ్డు నం.14ః వేపగుంట–జుత్తాడ 6.05 కి.మీలు 5
రోడ్డు నం.06ః భీమిలి–దొరతోట జంక్షన్ 6.02 కి.మీలు 0
వీఎంఆర్‌డీఏ సెగ్మెంట్ః వేపగుంట–పినగాడి 3.20 కి.మీలు 15
జీవీఎంసీ సెగ్మెంట్ః వేపగుంట–పినగాడి 3.92 కి.మీలు 10
గాలిలో కలిసిన ఫ్లైవోవర్ల ప్రతిపాదన..
మరోవైపు విశాఖ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులకు మాస్టర్ ప్లాన్ రోడ్లతో పాటు 12 ఫ్లైవోవర్లు అవసరమవుతాయని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఆ పార్టీ అధికారంలో ఉండగా ఫ్లైవోవర్లపై ముందుకు వెళ్లకపోవడంతో వాటి నిర్మాణం జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఫ్లైవోవర్లకు దాదాపు మంగళం పాడేసింది.
ఇదీ విశాఖలో ట్రాఫిక్ రద్దీ ముఖచిత్రం..
విశాఖ నగరంలో రెండు లక్షల కార్లు, మరో ఎనిమిది లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు రోజూ రోడ్లపై పరుగులు తీస్తూనే ఉంటాయి. ప్రతి నెలా ఏడెనిమిది వేల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. ఈ వాహనాల రద్దీతో నగరంలోని అన్ని రోడ్లూ కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతుండడంతో వాహన చోదకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మూడేళ్ల క్రితం వరకు నగరంలోని ద్వారకా బస్టాండు నుంచి గాజువాకకు 18 కి.మీల దూరం ఉంది. గతంలో అరగంటలోనే చేరుకునే వారు. కానీ ఇప్పుడు గంటకు పైగా పడుతోంది. ఒక్కోసారి సిగ్నల్‌ను దాటాలంటే రెండు మూడు సార్లు సిగ్నల్స్ çపడుతున్నాయి. ఈలోగా మంత్రులో, ఇతర వీవీఐపీలో వస్తే సరేసరి. అందరినీ ఆపేసి వారిని పంపించే దాకా ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతోంది. దీంతో కనుచూపు మేర ట్రాఫిక్ జామ్ అయిపోతోంది. ఈ పద్మవ్యూహం నుంచి బయట పడడానికి వాహన చోదకులు పడరాని పాట్లు పడుతున్నారు. తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ప్రధాన రోడ్లలోనే కాదు.. ఇరుకు రోడ్లు, సందుల్లోనూ వాహనాల తాకిడి అధికమవుతోంది. ప్రధాన రోడ్లపై తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోందన్న ఉద్దేశంతో పలువురు సందుల్లో, గొందుల్లో వెళ్తుండడం ఈ పరిస్థితికి కారణమవుతోంది.
అసెంబ్లీలో విశాఖ ట్రాఫిక్ సమస్యపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే గంటా
విశాఖ ట్రాఫిక్‌పై ఎమ్మెల్యే గంటా ఆందోళన..
విశాఖ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం అసెంబ్లీ జీరో అవర్‌లో గళం విప్పారు. ‘ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంటోంది. సీఆర్‌డీఏ మాదిరిగా విశాఖ ట్రాఫిక్‌పై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరపాలి. జూన్ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే వైజాగ్‌లో ట్రాఫిక్ సమస్య మరింత జఠిలం అవుతుంది. విశాఖపట్నంలో 30 ఏళ్లుగా రోడ్ల విస్తరణ జరగలేదు. అప్పటికీ ఇప్పటికీ వాహనాల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. ప్రత్యామ్నాయంగా మెట్రో రైలు, ఫ్లై వోవర్లు, కోస్టల్ కారిడార్ వంటివి ప్రతిపాదించినా వాటి నిర్మాణంలో పురోగతి లేదు. విశాఖ పరిసరాల్లో గూగుల్ డేటా సెంటర్లు, ఐటీ సంస్థలు రాక నేపథ్యంలో నాలుగైదేళ్లలో లక్ష మంది ఉద్యోగులు అదనంగా వస్తారు. దీంతో వాహనాల సంఖ్య మరింత పెరిగి ట్రాఫిక్ దారుణంగా తయారవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విశాఖలో రోడ్లు, ట్రాఫిక్ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి’ అని గంటా ప్రభుత్వాన్ని కోరారు.
Next Story

