ఆంధ్రాలో పెరిగే అసెంబ్లీ సీట్లు ఎన్నంటే..
x
ఆంధ్రప్రదేశ్ మ్యాప్

ఆంధ్రాలో పెరిగే అసెంబ్లీ సీట్లు ఎన్నంటే..

ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల పంట పండినట్టే,


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక చర్చ మొదలైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ (Delimitation) జరుగుతుందా అనే ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా… ఆయన మాటలను బట్టి ఈ ప్రక్రియ తప్పదన్న సంకేతాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
భారతదేశంలో చివరిసారిగా నియోజకవర్గాల పునర్విభజన 2008లో జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ డిలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందంటూ ఊహాగానాలు వచ్చినా 2026 వరకు నిలిపివేశారు. ఇప్పుడు ఆ గడువు ముగింపు దశకు చేరుకుంటుండటంతో… దేశవ్యాప్తంగా మరోసారి Delimitation ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉన్నాయని కేంద్రం నుంచి సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యలో మార్పులు రావొచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కొత్త పునర్వ్యవస్థీకరణ జరిగితే జనాభా పెరుగుదల, భౌగోళిక విస్తీర్ణం, పట్టణీకరణ వంటి అంశాల ఆధారంగా ఈ సంఖ్యలు పెరిగే అవకాశముంది. ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాలు—విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుత ఊహాగానాల ప్రకారం అసెంబ్లీ స్థానాలు 175 నుంచి సుమారు 260, లేదా 263 వరకు—పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా లోక్‌సభ స్థానాలు కూడా 25 నుంచి 37 లేదా 38కు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణం జనాభా. ఇప్పటివరకు 1971 లెక్కల ప్రకారం సీట్ల పంపిణీ కొనసాగింది. కానీ 2026 తర్వాత 2011 జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరగనుంది. ముఖ్యంగా కోస్తా ప్రాంతాలు, పట్టణీకరణ వేగంగా పెరిగిన జిల్లాల్లో కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి వంటి జిల్లాలు ఈ మార్పులో కీలకంగా నిలవనున్నాయి. ఈ జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న స్థానాలకు దాదాపు 40–50 శాతం వరకు అదనంగా సీట్లు పెరిగే అవకాశముంది.
ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే… తూర్పు గోదావరిలో 19 నుంచి 28కి, గుంటూరులో 17 నుంచి 25కి, కృష్ణాలో 16 నుంచి 24కి, విశాఖలో 15 నుంచి 22కి సీట్లు పెరిగే అవకాశముంది. అలాగే రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అనంతపురం, కర్నూలులో కూడా గణనీయమైన పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. నెల్లూరు, శ్రీకాకుళం, కడప వంటి ప్రాంతాల్లో కూడా కొత్త సీట్లు వస్తాయని అంచనా. పశ్చిమ గోదావరిలో 15 నుంచి 22కి, చిత్తూరులో 14 నుంచి 21కి, అనంతపురంలో 14నుంచి 21కి, కర్నూలులో 14 నుంచి 21కి, ప్రకాశంలో 12 నుంచి 18కి, నెల్లూరులో 10 నుంచి 15కి, శ్రీకాకుళంలో 10నుంచి 15కి, వైఎస్ఆర్ కడపలో 10నుంచి 15కి, విజయనగరం జిల్లాలోని 9 సీట్లు 13కి పెరిగే అవకాశం ఉన్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ మార్పు 2008లో జరిగిన పునర్విభజనతో పోలిస్తే పూర్తిగా భిన్నం. అప్పుడు కేవలం నియోజకవర్గాల సరిహద్దులు మాత్రమే మారాయి… సీట్ల సంఖ్య యథాతథంగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు నేరుగా స్థానాల సంఖ్య పెరగబోతోంది. అంటే, రాజకీయంగా ఇది “గేమ్ చేంజర్” అనే చెప్పాలి. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వాలకు ఇది భారీ అవకాశాల వేదికగా మారబోతోంది.
ఇక మహిళా రిజర్వేషన్లు ఈ మార్పులో కీలక పాత్ర పోషించనున్నాయి. కొత్తగా ఏర్పడే అసెంబ్లీ స్థానాల్లో సుమారు 33 శాతం—అంటే దాదాపు 80కి పైగా సీట్లు- మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచనుంది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల సంఖ్య కూడా పెరగనుంది. 1971తో పోలిస్తే ఎస్సీ జనాభా శాతం పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 29 స్థానాలు 45కి పైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు.
ఈ మొత్తం ప్రక్రియ కేవలం సంఖ్యల మార్పు కాదు… రాజకీయ సమీకరణాల పునర్నిర్మాణం. కొత్త నియోజకవర్గాలు అంటే కొత్త నాయకులు, కొత్త పోటీ, కొత్త వ్యూహాలు అనివార్యం అవుతాయి.
అయితే, ఈ మొత్తం ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుందా అన్నది స్పష్టత లేదు. సాధారణంగా Delimitation కమిషన్ ఏర్పాటు, జనగణన డేటా ఆధారంగా సర్వేలు, ప్రజాభిప్రాయం సేకరణ వంటి దశల తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. అంటే, ఇది ఒక దీర్ఘకాలిక ప్రక్రియగా ఉండే అవకాశం ఉంది.
మొత్తం మీద, అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
Read More
Next Story