
రూ.1.03 లక్షల కోట్లతో ‘హరిత బడ్జెట్’ను ప్రవేశపెట్టిన ఢిల్లీ ప్రభుత్వం
మౌలిక సదుపాయాల కల్పన, నీటి సమస్యపై ప్రత్యేక దృష్టి
ఢిల్లీ ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,03,700 కోట్ల వ్యయంతో భారీ ‘గ్రీన్’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి రేఖా గుప్తా మంగళవారం అసెంబ్లీలో ఈ బడ్జెట్‌ను సమర్పించారు. ఈ బడ్జెట్‌ను “హరిత బడ్జెట్”గా అభివర్ణించారు.
బడ్జెట్ అంచనా ప్రకారం రూ. 74వేల కోట్ల పన్ను ఆదాయం రానుండగా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ. 11,666 కోట్లు కేటాయించారు. దేశంలో తలసరి ఆదాయంలో ఢిల్లీ ముందంజలో ఉందని ప్రభుత్వం పేర్కొంది.
దేనికి ఎంత?
మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించారు. ప్రజా పనుల శాఖకు రూ. 5,921 కోట్లు, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణానికి రూ. 7,887 కోట్లు కేటాయించారు. నగరంలో 750 కిలోమీటర్ల రహదారులను పునర్నిర్మించడంతో పాటు, ధూళి రహిత రోడ్డు అభివృద్ధికి రూ. 1,352 కోట్లు కేటాయించారు.
ఇక విద్యుత్ రంగానికి రూ. 3,942 కోట్లు కేటాయించగా, ఓవర్‌హెడ్ వైర్ల తొలగింపునకు రూ. 200 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. ట్రాన్స్-యమునా ప్రాంత అభివృద్ధికి రూ. 300 కోట్లు, ఢిల్లీ గ్రామ వికాస్ బోర్డుకు రూ. 787 కోట్లు కేటాయించారు.
పారిశ్రామిక అభివృద్ధికి రూ. 160 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, అనధికార పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి కూడా ఇదే మొదటిసారి నిధులు కేటాయించినట్లు తెలిపింది. మోదీ మిల్ ఫ్లైఓవర్ విస్తరణకు రూ. 151 కోట్లు కేటాయించగా, మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ. 371 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
అగ్నిమాపక సేవలను బలోపేతం చేయడానికి రూ. 674 కోట్లు కేటాయించారు. ఇరుకైన వీధులు, అనధికార కాలనీల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు ఈ నిధులు వినియోగించనున్నారు.
ఢిల్లీ జల్ బోర్డుకు భారీగా నిధులు..
నీటి సమస్య పరిష్కారానికి కూడా పెద్దపీట వేశారు. ఢిల్లీ జల్ బోర్డుకు రూ. 9వేల కోట్లు కేటాయించగా, కొత్త పైప్‌లైన్ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. చాంద్రవల్ నీటి శుద్ధి కేంద్రానికి రూ. 475 కోట్లు కేటాయించారు. నగరంలో ఎవరూ నీటి కొరతతో ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
అదనంగా, ఎమ్మెల్యే స్థానిక అభివృద్ధి నిధికి రూ. 350 కోట్లు కేటాయించగా, ప్రభుత్వ ఉద్యోగుల కోసం సమీకృత సచివాలయం, నివాస సముదాయాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు.
మొత్తంగా, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల విస్తరణ, నీటి భద్రతను కేంద్రంగా చేసుకుని ఢిల్లీ ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌ను రూపొందించినట్లు స్పష్టమవుతోంది.

