బెయిల్ పొడిగింపు కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిటిషన్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని కోరుతూ సోమవారం (మే 27న) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఇప్పుడు బెయిల్ పొడిగింపు కోసం పిటిషన్ పెట్టుకున్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మే 10న 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మధ్యంతర బెయిల్ జూన్ 1న ముగుస్తుంది. జూన్ 2న ఆయన లొంగిపోవాలని ఆదేశించింది. ఈనేపథ్యంలో ఆయన బెయిల్ పొడిగింపు కోరారు. వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉన్నందున బెయిల్ పొడిగించాలన్నారు. పీఇటీ- సిటీ స్కాన్, ఇతర పరీక్షలు చేయాల్సి ఉందని, ఈ పరీక్షల పూర్తికి మధ్యంతర బెయిల్‌ను ఏడు రోజులు పొడిగించాలని కోరినట్లు వార్త సంస్థ ఎఎన్ఐ పేర్కొంది.
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొడిగింపు పిటిషన్‌పై ఆప్ నేత అథిషి ఎఎన్ఐతో మాట్లాడారు. ఈడీ కస్టడీ సమయంలో ఢిల్లీ సీఎం 7 కిలోల బరువు తగ్గారని, ఆకస్మికంగా బరువు తగ్గడం వైద్యులను ఆందోళనకు గురిచేసిందని ఆమె చెప్పారు.
“కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు, జ్యుడీషియల్ కస్టడీలో సమయంలోనూ 7 కిలోల బరువు తగ్గారు. ఇలా ఒక్కసారిగా బరువు తగ్గడం వైద్యులకు ఆందోళన కలిగిస్తోంది. ఆయన తిరిగి ఆ బరువును తిరిగి పొందలేకపోయారు అని ఆమె చెప్పారు. కీటోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని, దీనికి త్వరగా పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని అథిషి చెప్పారు. ఉన్నట్టుండి బరువు తగ్గడం, కీటోన్ లెవెల్స్ పెరగడం వల్ల మూత్రపిండాలపై ప్రభావం చూపుతాయని, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. "అందువల్ల ఆయన పూర్తిగా పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. అందుకే బెయిల్ పొడిగింపు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు" అని వివరించారు.
బెయిల్ ఇచ్చినపుడు కోర్టు ఏమని చెప్పిందంటే..
జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఐదు షరతులు పెట్టింది. వాటిలో ఒకటి కేసుతో ప్రమేయం ఉన్న సాక్షులెవర్నీ ఆయన సంప్రదించకూడదు. జైలు నుంచి విడుదలయ్యే ముందు, కేజ్రీవాల్ ₹ 50,000 వ్యక్తిగత బాండ్‌ను సమర్పించాల్సి వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, ఢిల్లీ సెక్రటేరియట్‌ను సందర్శించకూడదు. ఆయన తరపున చేసిన ప్రకటనలు, అవసరమైతే తప్ప అధికారిక ఫైళ్లపై సంతకం చేయకూడదు, క్లియరెన్స్ ఇవ్వకూడదు. ఏదైనా ముఖ్యమైన ఫైల్ క్లియరెన్స్ కి పంపాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నుంచి ఆమోదం పొందాలి అని సుప్రీంకోర్టు షరతులు పెట్టింది.
ఇన్ని షరతుల మధ్య ఇచ్చిన బెయిల్ గడువు జూన్ 1తో ముగుస్తుంది. రెండున ఆయన జైలుకు వెళ్లాలి. ఈ సమయంలో పెట్టుకున్న ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుందో లేదో చూడాలి.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో జరిగిన కుంభకోణానికి సంబంధించి మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. ఆ తర్వాత తీహార్ జైలుకు మార్చింది.
Next Story