రీల్ రియల్ అయింది, తుపాకీతో ఊపిరే పోయింది!
x

'రీల్' రియల్ అయింది, తుపాకీతో ఊపిరే పోయింది!

వ్యూస్ పిచ్చి ముదిరి పోయిన ఓ యువకుడు తుపాకీతో చెలగాటమాడి చివరికి ప్రాణాలే పొగొట్టుకున్నాడు..


ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా రీల్స్ పిచ్చి రోజురోజుకూ పెరుగుతోంది. వ్యూస్, లైక్స్ కోసం కొందరు యువత ప్రమాదకర స్టంట్లు చేయడానికీ వెనుకాడటం లేదు. కొన్ని సందర్భాల్లో ఈ ప్రయత్నాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన ఘటన ఇందుకు మరో ఉదాహరణగా నిలిచింది.


తూర్పు ఢిల్లీలో పవన్ అనే యువకుడు సోషల్ మీడియా రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు. లోడ్ చేసిన గన్‌తో వీడియో తీయాలని ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రిగ్గర్ నొక్కబడటంతో బుల్లెట్ అతని ఛాతీలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన అక్కడికక్కడే కలకలం రేపింది.

పోలీసు సమాచారం ప్రకారం పవన్ రీల్ చేస్తుండగా అతని స్నేహితుడు పక్కనే నిలబడి వీడియో రికార్డు చేస్తున్నాడు. గన్ బటన్ ఎలా నొక్కాలో చెబుతుండగా పవన్ తుపాకీని లోడ్ చేసి కెమెరా వైపు చూస్తూ నవ్వాడు. వీడియో తీస్తున్న వ్యక్తి ‘కాల్చొద్దు’ అని హెచ్చరించినప్పటికీ, ఆందోళనలో ట్రిగ్గర్ నొక్కేయడంతో బుల్లెట్ ఛాతీలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన పవన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

పోలీసుల ప్రకారం వీడియో రికార్డు చేసిన పవన్ స్నేహితుడిదే ఆ తుపాకీ. దీనికి లైసెన్స్ ఉన్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సోషల్ మీడియా వ్యూస్ కోసం యువత ప్రమాదకర స్టంట్లకు పాల్పడటం ఆందోళనకర ధోరణి. తక్షణ ఖ్యాతి కోసం చేసే ఇలాంటి ప్రయత్నాలు ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాను బాధ్యతతో వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

Read More
Next Story