
రఘురామకృష్ణరాజును అడ్డుకున్న దళిత సంఘాలు
గొంతెనమ్మ ఆలయం నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం పెద్దపేటలో శ్రీరామనవమి పర్వదినం వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శిథిలావస్థకు చేరిన రామాలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును దళిత సంఘాలు అడ్డుకోవడంతో పరిస్థితి రణరంగంగా మారింది. ఆలయ నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదం చివరకు రెండు వర్గాల మధ్య రాళ్ల దాడులకు దారితీసింది.
వివాదానికి కారణం ఏంటి?
పెద్దపేటలో పాతబడిన రామాలయం స్థానంలో నూతనంగా గుడి కట్టిస్తానని రఘురామకృష్ణరాజు ఇటీవల ప్రకటించారు. అయితే, దీనిపై స్థానిక దళిత సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సదరు స్థలంలో రామాలయం వద్దు అని, అక్కడ గొంతెనమ్మ ఆలయం నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రఘురామ పర్యటనను వారు తీవ్రంగా వ్యతిరేకించారు.
పోలీసుల పహారాలో పూజలు
శ్రీరామనవమి సందర్భంగా ఆ పాత ఆలయంలో పూజలు చేసేందుకు రఘురామ రాగా, దళిత సంఘాల ప్రతినిధులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల భారీ భద్రత నడుమ రఘురామకృష్ణరాజు ఆలయంలోకి వెళ్లి పూజలు పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పరస్పరం రాళ్ల దాడి.. రణరంగమైన పెద్దపేట
డిప్యూటీ స్పీకర్ వెళ్లిన కొద్దిసేపటికే పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. రామాలయం కట్టాలని కోరుతున్న ఒక వర్గం, గొంతెనమ్మ ఆలయం కావాలని పట్టుబడుతున్న దళిత వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా ముదిరి ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ దాడిలో కొందరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. ప్రస్తుతం గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
Next Story

