యుద్ధం తెచ్చిన తంట: వంట నూనెల మంట తప్పదా?
x

యుద్ధం తెచ్చిన తంట: వంట నూనెల మంట తప్పదా?

సూయజ్, హార్ముజ్ రూట్ మూసివేతతో నౌకలు బంద్..


ఇరాన్- అమెరికా యుద్ధంతో వంట నూనెలు మండనున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. నూనె గింజల దిగుమతులు, ఆయిల్ ఉత్పత్తుల ఎగుమతులు రెండింటిపైనా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నప్పటికీ, సరఫరా గొలుసులో అంతరాయాలు తప్పవనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇండియా తన వంటనూనె అవసరాల్లో 60-70 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. ఇండోనేషియా, మలేషియా నుంచి పామ్ ఆయిల్, అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి సోయాబీన్ ఆయిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్రధానంగా వస్తున్నాయి. ఈ దిగుమతుల్లో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి, సూయజ్ కాలువ గుండా సాగుతుంది. ఈ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగితే, ముఖ్యంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ లభ్యత తగ్గి ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

క్రూడాయిల్ ధరలు పెరిగితే రవాణా, బీమా ఖర్చులు భారీగా పెరిగి అది వినియోగదారులపై భారంగా మారుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఏరోజుకో ఒక ట్రెండ్‌లో ఉన్నాయి. గ్లోబల్ బయోఫ్యూయల్ డిమాండ్ పెరిగితే వంటనూనెల ధరలు మరింత ప్రభావితమవుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డాలర్-రూపాయి మారకం విలువలో వచ్చే మార్పులు కూడా ఈ రంగంపై ఒత్తిడి పెంచుతాయని విజయవాడకు చెందిన వంట నూనెల ట్రేడర్ పరశురాం వివరించారు.
ఎగుమతులపైనా దెబ్బ
కేవలం దిగుమతులే కాదు, భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ఆయిల్స్ (నూనె తీసిన తర్వాత మిగిలే ఉప ఉత్పత్తి) ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పరశురాం చెబుతున్నారు. భారత ఆయిల్ మీల్స్ ఎగుమతుల్లో ఆగ్నేయాసియా వాటా 65 శాతం, పశ్చిమాసియా (గల్ఫ్ దేశాలు) 20 శాతం, యూరప్ 15 శాతం ఉంది. యుద్ధం ముదిరితే గల్ఫ్, యూరప్ దేశాలకు రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా డిమాండ్ తగ్గే ప్రమాదం కూడా ఉంది.
ఇండియా మొత్తం డిమాండ్‌లో 55-60% దిగుమతులపై ఆధారపడుతోంది. 2025-26 అంచనా ప్రకారం మొత్తం దిగుమతులు 16.7 మిలియన్ టన్నులు వరకు ఉంది.
దేశాల వారీగా ప్రధాన దిగుమతులు
2024-25 & 2025-26 అంచనాలు ఆధారంగా పామ్ ఆయిల్ ఇండోనేషియా నుంచి వస్తుంది. సుమారు 50-60% అక్కడి నుంచి వస్తోంది. మలేషియా రెండవ స్థానం (30-40% )లో ఉంది.
సోయాబీన్ ఆయిల్:
అర్జెంటీనా: ప్రధానం (అత్యధిక భాగం).
బ్రెజిల్: రెండవది.
ఇతర దేశాలు: రష్యా, అమెరికా, చైనా నుంచి వస్తోంది.
సన్‌ఫ్లవర్ ఆయిల్:
రష్యా: ప్రధానం (అత్యధిక వాటా).
ఉక్రెయిన్: రెండవది.
ఇతర దేశాల్లో అర్జెంటీనా, థాయ్‌లాండ్, పాపువా న్యూ గినియా ఉన్నాయి. ఈ దేశాల నుంచి పామ్ ఆయిల్‌ వస్తుంది. దిగుమతుల్లో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి, సూయజ్ కాలువ ద్వారా వస్తుంది. అందుకే మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ప్రభావం పడుతుంది.

ఆంధ్రప్రదేశ్ శాతం ఎంత?

దిగుమతులు ఆంధ్రప్రదేశ్ కు నేరుగా రావు. దిగుమతులు దేశవ్యాప్తంగా పోర్టుల ద్వారా జరుగుతాయి. ముఖ్యంగా ముంబై, చెన్నై, కొచ్చి వచ్చి అక్కడి నుంచి ఏపీ కి వస్తాయి.
మొత్తం వంట నూనెల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ శాతం సుమారు 8-10% ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక వినియోగం ఆంధ్రప్రదేశ్ దే. ప్రస్తుతం మార్కెట్ వేచి చూసే ధోరణిలో ఉంది. ధరలు ఇప్పటికే కొంచెం పెరిగాయి కానీ పెద్ద జంప్ ఇంకా రాలేదు. IVPA, SEA వంటి సంస్థలు "అస్థిరత" ఉంటుందని, యుద్ధ వాతావరణం తగ్గితే ధరలు నిలకడగా ఉండవచ్చునని చెబుతున్నాయి. షార్ట్-టర్మ్‌లో 10-20%, లాంగ్-టర్మ్‌లో 30%కి పైగా పెరిగే ఛాన్స్ ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది అంచనా మాత్రమే. యుద్ధం ఎలా ముగుస్తుందనేది కీలకం కానుంది.
Read More
Next Story