‘పాల్ వాల్తాటీ’ రికార్డు బద్దలు కొట్టిన స్టాయినిస్
x

‘పాల్ వాల్తాటీ’ రికార్డు బద్దలు కొట్టిన స్టాయినిస్

సీఎస్కేపై సంచలన ఇన్సింగ్ ఆడిన ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టాయినిస్, 13 ఏళ్ల క్రితం పాల్ వాల్తాటీ చెన్నైపైనే నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టాడు.


లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్ మెన్ మార్కస్ స్టాయినిస్ మంగళవారం రాత్రి సీఎస్కేపై అత్యద్భుతంగా ఆడి మ్యాచ్ గెలిపించిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్ వరకూ మ్యాచ్ సాగడంలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. స్టోయినిస్ 63 బంతుల్లో ఏకంగా 124 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు.

ఈ సంచలనాత్మక ఇన్సింగ్స్ తో 13 ఏళ్ల కింద చంద్రశేఖర్ పాల్ వాల్తాటీ సాధించిన రికార్డును మార్కస్ తన పేరు మీద లిఖించుకున్నాడు. స్టోయినిస్ అజేయంగా నిలవడంతో చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో LSG ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.

ఈ ఐపీఎల్ సీజన్‌లో లక్నో రెండు సార్లు సీఎస్కేపై విజయం సాధించినట్లు అయింది. ఇంతకుముందు లక్నో హోం గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో కూడా చైన్నైని ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది ఓవరాల్ గా ఐపీఎల్ చరిత్రలో చేధనలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా స్టాయినిస్ నిలిచాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) తరపున ఆడుతున్నచంద్రశేఖర్ పాల్ వాల్తాటి 2011లో CSKపైనే 120 పరుగులు సాధించి నాటౌట్‌గా చేశాడు. అప్పుడు సీఎస్కే 186 పరుగులు సాధించింది. వాల్తాటి చెలరేగడంతో 16 ఓవర్లలోనే పంజాబ్ లక్ష్యాన్ని చేధించింది.
అలాగే వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు సాధించిన వీరేంద్ర సెహ్వాగ్, సంజూ శాంసన్, షేన్ వాట్సన్‌లను స్టాయినిస్ అధిగమించాడు. ఈ మ్యాచ్ లో మరో రికార్డు కూడా నమోదు అయింది. చిదంబరం స్టేడియంలో లక్నో అత్యధిక పరుగులను చేజింగ్ చేసిన జట్టుగా రికార్డు నమోదు చేసింది.
210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎల్‌ఎస్‌జీ 19.3 ఓవర్లలో 213/4తో నిలిచింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు కావాలి. స్టాయినిస్ తొలి మూడు బంతులను 6,4,4 గా మలిచాడు. మూడో బంతి నో బాల్ కావడంతో లభించిన ఫ్రీ హిట్ ను కూడా బౌండరీ దాటించి తనదైన స్టైల్ లో మ్యాచ్ ముగించాడు. ఇదే మ్యాచ్ లో సీఎస్కే జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ సాధించాడు. మ్యాచ్ అనంతరం స్టాయినిస్ మాట్లాడుతూ.. టీ20 గేమ్ మారుతోందని అన్నారు. క్రికెట్లో వేగం పెరిగిందని, నాకంటే ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారని చెప్పారు.
" కొంతమంది బౌలర్లను లక్ష్యంగా చేసుకోవాలనుకున్నాము, అలాగే కొంతమంది బౌలర్లను మరింత జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నాము. నేను బౌండరీలు కొట్టలేకపోయిన ఒక దశలో నికోలస్ పూరన్ బ్యాటింగ్ కు వచ్చి ఒత్తిడి మొత్తం దూరం చేశాడు. కాబట్టి అది నాకంటే గొప్ప ఇన్నింగ్స్ కిందే లెక్క" అన్నారు.
ఐపీఎల్ ఛేజింగ్ లో టాప్ ఫైవ్ నాక్‌లు

124 నాటౌట్ - మార్కస్ స్టోయినిస్ (LSG vs CSK), 2024

120 నాటౌట్ - పాల్ వాల్తాటి (KXIP vs CSK), 2011

119 - వీరేంద్ర సెహ్వాగ్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్ vs డెక్కన్ ఛార్జర్స్), 2011

119 - సంజు శాంసన్ (RR vs PBKS), 2021

117 నాటౌట్ - షేన్ వాట్సన్ (CSK vs SRH), 2018



Read More
Next Story